మాటలు కోటలు దాటుతున్నా సొంతింటిని చక్కదిద్దుకోవడంలో పాకిస్థాన్ ఎప్పటిలానే విఫలమవుతున్నదని వాఘా సరిహద్దుల్లో ఆదివారం జరిగిన అత్యంత దుర్మార్గమైన ఆత్మాహుతి దాడి నిరూపించింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ప్రతి సాయంత్రం పతాకాల అవనతం అనంతరం జరిగే సైనిక విన్యాసాన్ని వీక్షించడానికొచ్చి తిరిగి వెళ్తున్న పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి దిగారు. ఇందులో 60 మంది ప్రాణాలు కోల్పోగా, 200మంది గాయపడ్డారంటే దాడి తీవ్రత ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది.
ఆత్మాహుతి దాడికి బాధ్యులం తామంటే తామని పోటీలుపడి ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకోవడం వారిలోని నెత్తుటి దాహాన్ని తెలియపరుస్తుంది. ఉగ్రవాదులు వాఘా వద్ద దాడికి పథకం పన్నుతున్నారని అయిదురోజుల క్రితం ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ పాక్ మీడియాలో కథనాలు వెలువడినా దాన్ని నివారించడంలో అక్కడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆత్మాహుతి దాడులు పాకిస్థాన్‌కు కొత్త కాదు. ఇటీవలి కాలంలో వాటి సంఖ్య బాగా పెరిగింది. పాక్-అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులను అణచడం కోసమంటూ సైన్యం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ తాము ఇలాంటి దాడులు చేస్తున్నామని ప్రతి సందర్భంలోనూ ఉగ్రవాదులు ప్రకటిస్తున్నారు. అయితే, వాఘా సంగతి వేరు. ఇది దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వస్థలం.
పాకిస్థాన్‌లో అత్యంత సంపన్నవంతమైన, అధిక జనాభాగల పంజాబ్ రాష్ట్రంలో వాఘా ఉంది. ఈ సరిహద్దు మొదటినుంచీ ఇరుదేశాల సుహృద్భావ సంబంధాలకూ ప్రతీకగా ఉంటూ వస్తున్నది. 1965, 1971 యుద్ధ సమయాల్లో తప్ప ఇక్కడ సైనిక విన్యాసాలు ఎప్పుడూ ఆగలేదు. రెండు దేశాలకూ చెందిన వేలాది మంది పౌరులు ఇరుపక్కలా చేరి సైనిక విన్యాసాలను వీక్షిస్తూ దేశభక్తి నినాదాలు చేసే ప్రాంతమది. కనుక సరిహద్దు ప్రాంతమని మాత్రమేకాక, ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండొచ్చునన్న కారణంతో భద్రత విషయంలో అదనపు ఏర్పాట్లుచేస్తారు.
రెండు పక్కలా మూడు, నాలుగు అంచెల్లో భద్రతా వలయాలుంటాయి. పకడ్బందీ తనిఖీలుంటాయి. పైగా వచ్చే మూడురోజులపాటు విన్యాసాలకు విరామం ప్రకటిద్దామని పాక్ రేంజర్లు ప్రకటించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. వీటన్నిటితోపాటు ఉగ్రవాదుల పథకం గురించి ముందస్తు సమాచారం ఉంది. ఇన్ని అవరోధాలను కూడా ఉగ్రవాదులు అవలీలగా అధిగమించగలిగారంటే తన చేతగానితనం ఏ స్థాయిలో ఉన్నదో పాక్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి.
పాక్‌లోని ఉత్తర వజీర్‌స్థాన్ ప్రాంతంలో సాయుధ మిలిటెంట్లను ఏరివేసే లక్ష్యంతో సైన్యం జర్బ్-ఇ-అజ్బ్ పేరిట సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో కీలక విజయాలు సాధిస్తున్నామని, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను చావుదెబ్బ తీయ గలిగామని పాక్ సైన్యం చెప్పుకున్నది. వాఘా ఘటన తర్వాత కూడా మిలిటెంట్లపై తీసుకున్న చర్యలను ఏకరువుపెట్టింది. దేశంలోని పలుచోట్ల దాడులు నిర్వహించామని, ఒక ఆత్మాహుతి దళ సభ్యుడితోసహా ఎందరినో అరెస్టుచేశామని భారీయెత్తున ఆయుధాలనూ, మందుగుండునూ స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. ఇలాంటి చర్యలు ఎప్పుడూ కొనసాగవలసిందే. అయితే, ఈ చర్యలు మాత్రమే ఉగ్రవాదాన్ని నిరోధించలేవు.
అంతర్గతంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు... ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న స్వప్రయోజనపరుల సంగతి కూడా చూడాలి. సరిహద్దు వివాదాన్ని అడ్డంపెట్టుకుని భారత్‌ను ఇరకాటంలో పెట్టడం కోసం అక్కడి ఐఎస్‌ఐవంటి సంస్థలు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నాయి. ఈ అనుబంధాన్ని పూర్తిగా ఛేదిస్తే తప్ప ఉగ్రవాదం అంతరించడం సాధ్యంకాదు. దేశం ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే అంతర్గతంగా శాంతి, సుస్థిరతలు నెలకొనడంతోపాటు ఇరుగుపొరుగుతో సామరస్యపూర్వక సంబంధాలుండాలి. ఈ రెండింటి విషయంలోనూ పాకిస్థాన్‌ది ఎప్పుడూ వెనకడుగే.
పౌర ప్రభుత్వాన్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి నిత్యం ప్రయత్నించే సైన్యంవల్ల ప్రభుత్వం ఇంటా, బయటా నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నది. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ వచ్చిన సందర్భంలో భారత్‌తో ఏర్పడిన సుహృద్భావాన్ని దెబ్బతీసేందుకు సైన్యం శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. పర్యవసానంగా గత రెండునెలల పొడవునా కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకుని సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడింది. పాక్ సరిహద్దుకు చేరివున్న గ్రామాల్లోని పౌరులు 17మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఊళ్లు విడిచి వెళ్లారు.
ఉగ్రవాదం మూలాలపై దృష్టిపెట్టి దాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి బదులు పాక్ సైన్యం తన శక్తియుక్తులన్నిటినీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఉపయోగించింది. ఇరు దేశాల అధినేతలూ చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కేవలం తన శక్తియుక్తులు మాత్రమే చాలవనీ...అంతర్జాతీయ సహకారం, మరీ ముఖ్యంగా భారత్ అండదండలూ లేకుండా సాధ్యంకాదని పాకిస్థాన్ గ్రహించాల్సి ఉన్నది.
సరిహద్దుల్లో ప్రశాంతత, అంతర్గతంగా భద్రత మాత్రమే ఉగ్రవాదం ముప్పును నిరోధించగలదని, అప్పుడు మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకోవడం సాధ్యపడు తుందని గుర్తించాలి. ఇందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. మనకు కూతవేటు దూరంలోనే ఆత్మాహుతి దాడి జరగడం మన దేశానికి కూడా హెచ్చరికే. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న కాశ్మీర్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాలన్నిటా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్నది.
వాఘా విషాదం
Published Tue, Nov 4 2014 12:57 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement