24 రోమియోలు 6 అపాచీలు  | Donald trump India Visit: Trump and Modi have been in talks for nearly five hours | Sakshi
Sakshi News home page

వచ్చేది బిగ్‌ డీల్‌!

Published Wed, Feb 26 2020 2:59 AM | Last Updated on Wed, Feb 26 2020 2:24 PM

Donald trump India Visit: Trump and Modi have been in talks for nearly five hours - Sakshi

హైదరాబాద్‌ హౌస్‌లో సంయుక్త మీడియా ప్రకటన చేసేందుకు కలసివస్తున్న ట్రంప్, మోదీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా మంగళవారం ఇరు దేశాల మధ్య ఇక్కడి హైదరాబాద్‌ హౌజ్‌లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మోదీ, ప్రెసిడెంట్‌ ట్రంప్‌ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో మూడు ఒప్పందాలు కుదిరాయి. చర్చల అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. 300 కోట్ల డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. (తెలుపు.. స్వచ్ఛత)

ఈ ఒప్పందంలో భాగంగా,  260 కోట్ల డాలర్ల విలువైన 24 ఎంహెచ్‌ –60 రోమియో హెలికాప్టర్లను భారతీయ నౌకాదళం కోసం లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ నుంచి భారత్‌ కొనుగోలు చేయనుంది. అలాగే, 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్‌–64ఈ అపాచీ హెలికాప్టర్లను ఆర్మీ అవసరాల కోసం ప్రఖ్యాత బోయింగ్‌ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందాలు భారత్, అమెరికాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. అలాగే, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఇరు దేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. భారత్‌కు చెందిన సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మధ్య వైద్య ఉత్పత్తుల రక్షణకి సంబంధించి ఒక ఎంఓయూపై సంతకాలు జరిగాయి. అలాగే, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఎగ్జాన్‌ మొబిల్‌ ఇండియా ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్, చార్ట్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ల మధ్య సహకారానికి సంబంధించి ఒక లెటర్‌ ఆఫ్‌ కోఆపరేషన్‌పై సంతకాలు జరిగాయి.   (మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి..)

‘హెచ్‌1 బీ’పై ఆందోళన 
చర్చల అనంతరం, వాటి వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ‘అంతర్గత భద్రత, రక్షణ, ఇంధనం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు’ అనే ఐదు ప్రధాన రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి భారత్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ట్రంప్‌ హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్‌ల మధ్య దాదాపు 5 గంటల పాటు చర్చలు కొనసాగాయన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాలు సంయుక్తంగా వర్కింగ్‌ గ్రూప్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయన్నారు. అలాగే, చర్చల సందర్భంగా హెచ్‌1 బీ వీసాల విషయంలో తమ ఆందోళనలను అమెరికా దృష్టికి భారత్‌ తీసుకువచ్చిందన్నారు. అమెరికా హైటెక్‌ రంగంలో భారతీయుల పాత్రను ప్రధానంగా ప్రస్తావించామన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు. (కోరితే.. కశ్మీర్పై మధ్యవర్తిత్వం!)


ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు కూడా ప్రస్తుతం గణనీయ స్థాయికి తగ్గిందని ష్రింగ్లా వెల్లడించారు. అమెరికా భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, భారత్‌ మొత్తం ఎగుమతుల్లో 12% యూఎస్‌కే ఉంటాయని తెలిపారు. ట్రంప్, మోదీల మధ్య సీఏఏ అంశం చర్చకు రాలేదని ష్రింగ్లా తెలిపారు. చర్చలో మత సామరస్యం అంశం ప్రస్తావనకు వచ్చిందని, భిన్నత్వం, బహుళత్వం భారత్, అమెరికాల ఉమ్మడి విలువలని ఆ సందర్భంగా ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారని ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలోనూ ట్రంప్‌ భారత్‌లోని మత విభిన్నతను, మత సామరస్యాన్ని ప్రస్తావించిన విషయాన్ని ష్రింగ్లా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మరోసారి గెలుస్తారనే భావనతోనే.. ఈ స్థాయి స్వాగతం భారత్‌ నుంచి లభిస్తోందా? అని ప్రశ్నించగా.. వేరు వేరు పార్టీలకు చెందిన యూఎస్‌ అధ్యక్షులు భారత్‌కు వచ్చారని, ద్వైపాక్షిక సహకారం ప్రాతిపదికగానే వారితో భారత్‌ వ్యవహరిస్తుందని వివరించారు.

ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోండి 
పాక్‌ భూభాగంపై ఉగ్ర స్థావరాలకు ఆశ్రయం ఇవ్వకూడదని, ఉగ్రదాడులకు పాక్‌ గడ్డను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. 26/11 ముంబై దాడుల సూత్రధారులు సహా ఆ తరహా దాడులకు పాల్పడిన వారికి అతి త్వరగా శిక్ష పడేలా చూడాలని పాక్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇరువురు నేతలు  సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జైషే మొహమ్మద్, లష్కరే, హిజ్బుల్‌ ముజాహిదీన్, డీ –కంపెనీ(దావూద్‌ ఇబ్రహీంకు చెందిన మాఫియా సంస్థ), అల్‌ కాయిదా, ఐసిస్, హక్కానీ నెట్‌వర్క్, తెహరీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్తాన్‌ తదితర ఉగ్రవాద సంస్థలను, వాటి సోదర సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement