Trump India Visit
-
భారత్ వెళ్లొచ్చాక ఆ భయం పోయింది!
సౌత్ కరోలినా: భారత్ పర్యటన తర్వాత భారీ బహిరంగ సభలంటే ఉన్న బెరుకు తనకు లేకుండాపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రజలు ఎంతగానో ప్రేమించే గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. సౌత్కరోలినాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన భారత్‌లో పర్యటనను ప్రస్తావిస్తూ..‘భారీగా జనం హాజరయ్యే సభలంటే ఉన్న భయం భారత్‌కు వెళ్లొచ్చాక పోయింది. మన జనాభా 35 కోట్లు. నా సభలకు మహా అయితే 60 వేల మంది వస్తారేమో. కానీ, భారత్‌లో జరిగిన సభకు లక్ష మందికిపైగా హాజరయ్యారు. ఆ దేశ జనాభా 150 కోట్లు. నాకు మీపై ఎంత అభిమానమో అక్కడి వారన్నా అంతే. భారతీయులకు అమెరికా అన్నా ఎంతో ప్రేమ. ప్రధాని మోదీ గొప్ప నేత. ఆ దేశ పర్యటన నాకు ఎంతో విలువైంది’ అని వ్యాఖ్యానించారు. -
తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్: ఇవాంకా
న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్‌మహల్ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్ ఫొటోషాప్ ఉపయోగించి మార్ఫింగ్ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు. తనపై ఫొటోషాప్ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్లో నవ్వులు పూశాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇవాంకా ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు -
‘నమస్తే ట్రంప్; నేను ఎగ్జయిట్ కాలేదు’
దక్షిణ కరోలినా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు ఎంతో ఇష్టమైన ప్రధాని అతడు. అతనో గొప్ప వ్యక్తి అని ట్రంప్ అభివర్ణించాడు. దక్షిణ కరోలినాలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి తన భారత పర్యటనను గుర్తు చేశారు. లక్షకు పైగా జనంతో మొతెరాలో లభించిన అపూర్వ స్వాగతం మరువలేనిదని అన్నారు. తనకు భారీ జనబాహుళ్యంతో నిండిన సభల్లో పాల్గొనడం అంటే ఇష్టమని, అయితే, అమెరికాలో భారీ జన సమీకరణ జరగదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి: ట్రంప్‌కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!) ‘ప్రధాని మోదీతో భారత పర్యటన అద్భుతంగా సాగింది. దేశ ప్రజలు ప్రేమించే అతనో గొప్ప వ్యక్తి. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ అద్భుతం. భారీ సభల్లో మాట్లాడటం నాకు ఇష్టం. నా సభలకు జనం భారీగా వస్తారు. మొతెరా సభకు లక్షా యాభై వేల మంది జనం వచ్చారు. ప్రస్తుత కరోలినా సభకు జనం భారీగానే వచ్చారు. రెండు సభలూ నాకు ఇష్టమే. అయితే నేను ఈ సమూహాన్ని చూసి ఎగ్జయట్ కాలేదు. ఎందుకంటే నమస్తే ట్రంప్‌లో ఆ జన బాహుళ్యం, వారి ఆదరణ చూశాను కదా..! భారత్‌లో 150 కోట్ల జనాభా ఉంది. మనకేమో 35 కోట్ల జనాభానే. అమెరికాతో సంబంధాలు భారతీయులకు ఎంతో ఇష్టం. వారికి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. అదొక విలువైన పర్యటన’ అని అన్నారు. (చదవండి : నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు!) కాగా, గత సోమవారం సతీసమేతంగా భారత్‌లో పర్యటించిన ట్రంప్‌నకు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌లోని మొతెరాలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో లక్షకు పైగా జనం పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమం, ఆగ్రాలోని ప్రపంచ సుందర కట్టడం తాజ్ మహల్‌ను ట్రంప్ దంపతులు, అతని బృందం సందర్శించింది. అమెరికా-భారత్ ద్వైపాక్షిక చర్చల్లో మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. -
ట్రంప్‌కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!
ట్రంప్ ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అమెరికన్ వంటలు ఎంతమాత్రం నచ్చడం లేదు. పదే పదే ఇండియన్ వంటకాలే గుర్తుకొస్తున్నాయి. ఒక ఫైలు మీద అయితే తన సంతకానికి బదులు ‘ఆంధ్రా నాటుకోడి పులుసు’ అని రాశాడు. ‘‘ఇదేంటి సార్?’’ అని ఆయన పీయే అడగాలనుకున్నాడుగానీ ‘ఎందుకొచ్చిన లొల్లి’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా కామ్‌గా ఉండిపోయాడు. ఆరోజు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ వైట్‌హౌస్‌కు ఫోన్ చేశాడు. ఆ సంభాషణ ఇలా జరిగింది: సెక్రెటరీ: హలో ట్రంపుగారు... ట్రంప్: ‘హలో’ ట్రంపు కాదు... డొనాల్డ్ ట్రంప్‌ని మాట్లాడుతున్నాను...హీ హీ హీ.... సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ... నీ నవ్వు... వినలేక ఛస్తున్నాను... ( ఆ సున్నితమైన నవ్వు ఆగిపోయింది) ట్రంప్: విషయం ఏమిటో చెప్పిచావు... సెక్రెటరీ: ఆ ఇరాన్ వాడు మళ్లీ ‘అణ్వాయుధం తయారుచేస్తున్నాను ఖబడ్దార్’ అంటున్నాడు... ట్రంప్: బాసూ, ఇరాన్ అంటే గుర్తుకు వచ్చింది... నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇరానీ చాయ్ రుచి చూశాను. అబ్బబ్బా ఎంత బాగుందో! ఆ రోజంతా తాగుతూనే ఉన్నాననుకో... సెక్రెటరీ: ఆపవయ్యా నీ ‘టీ’ గోల! ప్రపంచశాంతి గురించి మాట్లాడుదామని ఫోన్ చేస్తే ఇరాన్ టీ గురించి చెప్పి చావగొడుతున్నావు. అసలు మీ రెండు దేశాల వాళ్లు తెల్లారి లేస్తే చాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇదేమన్నా బాగుందా? అని నేను ఐరాస సెక్రెటరీ జనరల్ హోదాలో ప్రశ్నిస్తున్నాను... ట్రంప్: బాసూ... కారాలు మిరియాలు అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు కారం బాగా దట్టించిన రాయలసీమ నాటుకోడి పులుసు రుచి చూశాను... అబ్బా! అదిరిపోయిందనుకో. తింటున్నప్పుడు ఎవరో ‘మిరియాల చారు’ పట్టుకొచ్చారు. అది కలుపుకొని తింటే రుచి ఉంది... నా సామిరంగా... ఇప్పటికి నోట్లో నీళ్లూరుతున్నాయి... (ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?) సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ నీ బ్యాంబూలో సోది... ట్రంప్: అరే... బొంగులో చికెన్ గురించి నీకు చెప్పడం మరిచాను. ఒకరోజు అది వడ్డించారు. ‘బొంగులో చికెన్’ ఈజ్ ట్రడిషనల్ ఫామ్ ఆఫ్ కుకింగ్. ఆల్మోస్ట్ నో ఆయిల్ అండ్ కారం... డిష్ అదిరిపోయింది అనుకో! సెక్రెటరీ: కాస్త నీ చికెన్ గోల ఆపుతావా! కాసేపు ఇండియా–అమెరికా సంబంధాల గురించి మాట్లాడదాం. నువ్వు ఇండియా పర్యటించడం ‘చారిత్రక ఘట్టం’ అనే చెప్పుకోవాలి. ఏమంటావు ట్రంపూ... ట్రంప్: ‘చారిత్రక’ అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు రకరకాల చారుల రుచిచూశాను. ఎంత బాగా నచ్చిందో! మజ్జిగ చారు, మిరియాల చారు, టమాటా చారు... వీటిలో పప్పుచారు హైలెట్ అనుకో... హై ప్రోటీన్ చారు... ప్రిపరేష్ 16 నిమిషాలు, కుక్ 30 నిమిషాలు, టోటల్...46 నిమిషాలు... సింపుల్‌గా చేసుకోవచ్చు... సెక్రెటరీ: ఏమిటయ్యా బాబూ...అప్పటి నుంచి తెగ చావగొడుతున్నావు. నేను మాట్లాడుతున్నదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటీ. ఏమైనా సంబంధం ఉందా? అయినా తప్పు నీది కాదులే...పొద్దున లేచి ఎవడి ముఖం చూసానో... సరే కర్మగాలి చూశానే అనుకో... నీకు ఫోన్ చేయాలని నాకు ఎందుకు అనిపించాలి... దరిద్రం కాకుంటే... ట్రంప్: ఏమిటయ్యో మాటలు మితిమీరి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డోనాల్డ్ ట్రంప్‌తో, అమెరికా ప్రెసిడెంట్‌తో మాట్లాడుతున్నావు. నాకు గానీ తిక్క రేగింది అంటే... సెక్రెటరీ: కూల్ ట్రంప్ కూల్... ట్రంప్: బాసూ... ‘కూల్’ అంటే గుర్తుకు వచ్చింది... ఇండియాలో ఉన్నప్పుడు ‘కుల్ఫీ’ తిన్నానయ్యా... తెగ నచ్చేసిందనుకో... మలై కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ, బటర్ స్కాచ్ కుల్ఫీ, లిచ్చి కుల్ఫీ, కేసర్ పిస్తా కుల్ఫీ, కేసర్ బాదం కుల్ఫీ... ఒక్కటా రెండా... ఎన్నెన్ని కుల్ఫీలు తిన్నానో... సెక్రెటరీ: నీ ఇండియా పర్యటన నా చావుకొచ్చిందయ్యా. బతికుంటే బలుసాకు బిజినెస్ చేసుకొని బతుకుతాను... ఇక సెలవా మరి... ట్రంప్: నువ్వు బలుసాకు అంటే గుర్తుకొచ్చింది... నేను ఇండియా నుంచి తిరుగుప్రయాణం అవుతున్నప్పుడు బ్రహ్మాండమైన విందు ఇచ్చారు. అందులో స్పెషల్ ఏమిటో తెలుసా? బలుసాకు పప్పు, బలుసాకు పప్పుచారు, బలుసాకు మటన్ కర్రీ, బలుసాకు చికెన్ కర్రీ, బలుసాకు ఫిష్ ఫ్రై, బలుసాకు ఫిష్ పులుసు, బలుసాకు బిర్యానీ, బలుసాకు అప్పడాలు, బలుసాకు వడియాలు, బలుసాకు సకినాలు, బలుసాకు కాజా... గమనిక: అటునుంచి ‘సచ్చాన్రో’ అంటూ పెద్ద శబ్దం వినబడి ఫోన్ కట్ అయిపోయింది. అశుభం – యాకుబ్ పాషా -
దత్తుడు గార్లెండ్స్ బాబ్జీ
‘దత్తుడు గార్లెండ్స్ బాబ్జీ, బాబ్జీ గార్లెండ్స్ దత్తుడు’– అంటూ నానుడిలాంటి వాడుక ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారంలో ఉండేది. పెద్ద బస్తీల్లో, చిన్న నగరాల్లో చిన్న చిన్న కూటములుం టాయ్. వారు తమ వృత్తి వ్యాపారాల్లో కొండచిలువల్లా పెరిగిన వారై ఉంటారు. వాళ్లకి కీర్తిని కొనుక్కోవడానికి లెక్కలు చూపని చిల్లర ఉంటుంది. వారి వారి శక్త్వానుసారం అప్పుడప్పుడు సవాపావో, సవాశేరో కీర్తిని కొను క్కుని దండతో ఇంటికి వెళ్తుంటారు. దండోరా వేయించుకుంటారు. ఈ కూటమి వాళ్లకి వినసొంపైన పదవులుంటాయ్. అవి అజాగళస్తనాల్లాంటివి– ఇదేమరి అక్కర్లేని సొల్లు కబుర్లంటే– మొన్న ట్రంప్ టూర్ ప్రసంగాల్లాగా. ట్రంప్ మోదీని, మోదీని ట్రంప్ అడుగడుగునా దండించుకున్నారు. నగర సంకీర్తన వలె పలుచోట్ల పరస్పరం భజించుకున్నారు. ఆ పొగడ్తలకి ఇద్దరి పళ్లు పులిసిపోయి ఉంటాయ్. ట్రంప్ గాంధీ పేరు ఎత్తలేదు, మోదీ తాజ్‌మహల్ గుమ్మం ఎక్కలేదు. చెల్లుకు చెల్లు ఏ అమెరికా ప్రెసిడెంటు వచ్చినా ఏవుండదు కడుపు నిండేది– మా మేనత్త పెళ్లిళ్లకి వెళ్లినట్టే! ఆ వైనం చెబుతా. ఆవిడ ఆస్తిపరురాలు. బాధ్యతలు లేవు. పెద్దతనంలో కూడా జుత్తూడక, మాట చెడక నిండుగా ఉండేది. ఒంటినిండా నగలుండేవి. వొంకుల వడ్డాణం, కాసులపేరు, ఓ చేతికి కట్టె వంకీ, ఇంకో చేతికి నాగవత్తు ఇంకా చాలినన్ని బంగారు గాజులు ఉండేవి. ముక్కుకి ఎర్రరాయి నత్తు, తలతిప్పితే అరచెయ్యంత చేమంతిబిళ్ల, అసలు సిసలు కంజీవరం పట్టు చీరెలో ఆవిడ పందిట్లో తిరుగుతుంటే దేవుడి రథం కదుల్తున్నట్టుండేది. పెళ్లికి వస్తే హీనపక్షం మూడు రోజులుండేది. పట్టు చీరెలన్నీ ప్రదర్శించేదాకా ఉండేది. ఆ రోజుల్లో అరడజనుంటే మహాగొప్ప. ఆవిడ దీవెనలు మాత్రం ఉదారంగా ఇచ్చేసి, పెళ్లివాళ్లు పెద్దరికంగా పెట్టేవి స్వీకరించి వెళ్లేది. అమెరికా ప్రెసిడెంటు తెల్లఏనుగు లాంటి విమానం గురించి, మందీమార్బలం గురించి, జరగాల్సిన మర్యాదల గురించి ఎన్నో కథలు వింటూనే ఉన్నాం. ఒబామా పెంపుడు కుక్కతో సహా వచ్చాడు. అత్తగారు కూడా వచ్చింది. అసలావిడ కోసమే వచ్చారని అనుకున్నారు. తాజ్‌మహల్ చూడాలని మదర్ ఇన్ లా అడిగిందట. అది మన దేశ పౌరులు చేసుకున్న అదృష్టం. అయినా ఎప్పుడూ అదేం దరిద్రమో తెలియదు. ఏ అమెరికా ప్రెసిడెంటు వస్తున్నాడన్నా కోట్లకు కోట్లు ధారపోసి అతి మర్యాదలు చేయడం మనకు అలవాటే. కరువులో అధిక మాసం అంటే ఇదే. అప్పుడెప్పుడో ఇవాంకా వస్తేనే భాగ్యనగరానికి రంగులు వేశాం. దానికి రిటన్ గిఫ్ట్‌గా కేసీఆర్‌ని పిలిచి ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. నవ్వుతూ ఆరుసార్లు చెయ్యి ఊపాడు. జగన్‌కి పిలుపు లేదు. ఇహ దానిమీద ఆయనంటే గిట్టని మీడియా కావల్సినన్ని కథనాలు అల్లింది. నా చిన్నప్పుడు ఐసన్‌హోవర్ రష్యానించి వస్తుంటే నెహ్రూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ట్రంప్ స్వాగతానికి మోదీ కనీసం కొన్ని వందల కోట్లు ఖర్చుచేసి ఉంటారు. శివరాత్రి నుంచి శివతాండవంలా నడిచింది. మోదీకి కూడా పూనకం వస్తుందని అర్థమైంది. ఆ దేశం గొప్ప దేశమే కావచ్చు. మనదీ గొప్ప దేశమే. అంతమాత్రంచేత దాని పాలకులంతా గొప్పవారు కానక్కర్లేదు. మన దేశాన్ని ఎందరు నికృష్టులు పాలించలేదు. పద్ధతులు పాటించవచ్చుగానీ మరీ అతి అవసరం లేదు. సబర్మతి ఆశ్రమంలో ఎన్నో రకాలు ఎంతో వ్యయంతో, శ్రమతో చేయించిన ఉపాహారాలను ట్రంప్ ముట్టనే లేదు. దారిలో ప్రాకృతిక వాతావరణంలో పచ్చని చెట్టుకింద కావాల్సినన్ని మాంసాహారాలు వండి వడ్డించాల్సింది. ట్రంప్ రాబోతున్న ఎన్నికల దృష్ట్యా వచ్చాడని అందరికీ తెలుసు. మోదీ గాంధీల రాష్ట్రం తనకి బాసటగా ఉంటుందని ట్రంప్ ఆశ. సువీ అంటే రోకలిపోటని తెలియందెవరికి. ఆయన మళ్లీ త్వరలోనే వస్తారు. మళ్లీ పొగడ్తలుంటాయ్ కాకపోతే కొత్తవి. కానీ మహాశయా! ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించండి. తెలుగువారు కూడా మీ జాతకం తేల్చగలవారే. ఎందుకైనా మంచిది చంద్రబాబుని కూడా పిలవండి. ఆయనగానీ ఒక్క వీల వేస్తే...... వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
‘నమస్తే ట్రంప్’ను అంత మంది చూశారా!
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్సీ సమాచారమిచ్చింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వీక్షించిన వారికంటే ఇది రెండింతలు కావడం విశేషం. ఆస్కార్ అవార్డుల వేడుకను దాదాపు రెండున్నర కోట్ల మందిపైగా వీక్షించినట్టు తెలుస్తోంది. నమస్తే ట్రంప్ కార్యక్రమానికి విచ్చేసిన ట్రంప్, మెలనియాలకు లక్ష మందిపైగా ప్రజలు స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన జనంతో మొతెరా స్టేడియం కిక్కిరిసింది. (చదవండి: హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా) -
ట్రంప్ పర్యటన: విందుకు అది కూడా వచ్చింది!
రెండు రోజులు పర్యటన నిమిత్తం దేశానికి వచ్చిన అగ్రారాజ్యాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు భారత ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, సీఎం కేసీఆర్ సహా ఆరు రాష్ట్రాల సీఎంలు, భారత్-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇక ట్రంప్ మాంసాహార ప్రియుడైనప్పటికీ ప్రభుత్వం వెజిటేరియన్ మెనూకే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. (రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు విందు) ఇదిలా ఉండగా విందులో అంతమంది ఉంటే రెహమాన్ మాత్రం ఒకరిపైనే దృష్టి సారించాడు. పైగా అది భోజనం చేస్తున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వీడియో తీశాడు. ‘మా చిట్టిపొట్టి స్నేహితుడు కూడా విందుకు వచ్చేశాడు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇంతకీ వచ్చిందెవరనుకుంటున్నారు.. ఓ కోతి. అది అక్కడి పూలకుండీలోని ఆకులను తింటుండగా వీడియో క్లిక్‌మనిపించాడు. దీంతో రెహమాన్ హాస్యచతురతకు మెచ్చిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘మీ దోస్తు భలేగుంది’, ‘ట్రంప్, మోదీతోపాటు మరో ముఖ్య అతిథితో విందారగించారు, నిజంగా మీరు గ్రేట్’ ‘శాఖాహార వంటకాలున్నాయని తెలిసి వచ్చింది కాబోలు’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. (ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?) View this post on Instagram Meanwhile our little friend was having dinner too! A post shared by @ arrahman on Feb 25, 2020 at 12:12pm PST -
హ్యాపీనెస్ క్లాస్‌పై మెలానియా ట్వీట్..
వాషింగ్టన్ : ఇటీవలి భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని సర్వోదయ స్కూల్లో హ్యాపీనెస్ క్లాస్ సెషన్‌కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్ అభివర్ణించారు. తనకు స్కూల్లో సాదర స్వాగతం పలికిన అద్భుత చిన్నారులు, ఫ్యాకల్టీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్కూల్లో చిన్నారుల మధ్య తాను గడిపిన క్షణాలతో కూడిన వీడియోను సోషఃల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. తన భర్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంట భారత్ పర్యటనకు వచ్చిన మెలానియా ఢిల్లీలోని సౌత్ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను మంగళవారం సందర్శించి అక్కడి చిన్నారులతో ముచ్చటించిన సంగతి తెలసిందే. ఇరు దేశాల జెండాలను చేబూనిన విద్యార్ధులు ఆమెకు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. చదవండి : బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్ ఫిదా -
భారత్‌తో బలపడిన బంధం
వాషింగ్టన్: భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌తో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఢిల్లీ ఘర్షణలు భారత్ అంతర్గత వ్యవహారమని, అందుకే మోదీతో దానిపై చర్చించలేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనాతో కంగారు లేదు: ట్రంప్ అమెరికాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధితో కంగారు పడాల్సిన పనేమీ లేదని అన్నారు. సంక్షోభ సమయాల్ని తాను అద్భుతంగా పరిష్కరించగలనని ట్రంప్ చెప్పారు. కోవిడ్–19 దాడి చేసినా ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్ కాస్త భయానకమైనదని, కానీ దాని గురించి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు! న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్సీ సమాచారమిచ్చింది. -
ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మొదటిసారి పర్యటించిన నేపథ్యంలో ఇంటా బయటా భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రంప్ పర్యటనలో సానుకూల చర్చలు జరిగి, హెచ్1బి వీసాల జారీ నిబంధనలు, పాల, పౌల్ట్రీ ఉత్పత్తులకు అనుమతులు, డబ్లు్య.టి.ఓ. అత్యంత అనుకూల దేశాల లిస్టు నుంచి భారత్ తొలగింపు, అభివృద్ధి చెందుతున్న భారత దేశాన్ని కుట్రపూరితంగా అభివృద్ధి చెందిన 20 దేశాల లిస్టులో చేర్చటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై స్పష్టమైన వైఖరి తదితర అంశాలపై స్పష్టత వస్తుందని ఆశించాము.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం మరొక ముఖ్యమైన అంశం. కానీ, పర్యటనలో ఈ కీలక అంశాలపై ఏమాత్రం దృష్టిసారించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రయోజనాలు మరిచి, ఆద్యంతం డొనాల్డ్ ట్రంప్ మరియు వారి కుటుంబ సభ్యుల సేవలో తరించారు. ఈ విషయాలను ఉటంకిస్తూ, అంతర్జాతీయ మీడియా ట్రంప్ భారత పర్యటనను తూర్పారబట్టింది. ఇక ట్రంప్ పర్యటన లోతుల్లోకి వెలితే, మోదీ దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ మోడల్ అభివృద్ధి అనే బూటకపు ప్రచారం చాటున ఉన్న మకిలిని ట్రంప్ గారికి కనబడకుండా గోడ కట్టి, తద్వారా దేశ ప్రజల కళ్ళు తెరిపించారు. గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల డబ్బు ఖర్చు చేసి జనాన్ని తరలించి స్టేడియం నింపారు. మొదటి రోజు పూర్తిగా పొగడ్తలకు కేటాయించారు. మోదీ పొగడ్తలతో ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తగా, ట్రంప్ ఇంకో అడుగు ముందుకేసి మోదీ దేశభక్తికి, ఆయన చాయ్ అమ్మినట్టు జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇస్తూ పోయారు. ఇక గాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్, విజిటర్ రిజిస్టర్లో మన జాతిపిత మహాత్మా గాంధీ పేరును కూడా ప్రస్తావించకుండా, మోదీని పొగడడం చూస్తే సబర్మతి ఆశ్రమం యొక్క ఔన్నత్యం ట్రంప్ గారికి తెలియదు, కేవలం ఫొటోలకు పోజులు ఇవ్వటానికి సందర్శించారని అర్థమవుతుంది. నాడు–నేడు ఎప్పుడైనా అమెరికా దృష్టిలో భారత్ కేవలం వాళ్ళ ఉత్పత్తులు, రక్షణ పరికరాలు అమ్ముకునే పోటెన్షియల్ మార్కెట్ మాత్రమే. అమెరికా జాతీయ సంపదకు ప్రవాస భారతీ యులు కూడా ఎంతో దోహదపడుతున్నారు. ఈ ఏడాది 2020 చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. అక్కడ సుమారు 40 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. కిందటి ఎన్నికల్లో కేవలం 16% మాత్రమే ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేసినట్టు కొన్ని సర్వేలు తేల్చడంతో, రాబోయే ఎన్నికలును దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ పర్యటనకు వచ్చారు. ఒక రోజంతా ట్రంప్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికి, అక్కడి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కలిసే అవకాశం ఇవ్వకపోవటం, రాష్ట్రపతి విందుకు కూడా పిలువకపోవటం మోదీ ప్రభుత్వం యొక్క వివక్ష. ఒకవేళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండివుంటే ఆ ముఖ్యమంత్రిని పిలిచేవారే కదా! ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల్లో అక్కడి ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చిన మోదీ కేజ్రీవాల్‌కు ఇవ్వకపోవడం గమనిం చాలి. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కరచాలనంతో సరిపెట్టుకోగా, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం పంపకపోవటం భారతీయ జనతా పార్టీ వివక్షకు తార్కాణం. మోదీ వ్యక్తిపూజ కోసం వెచ్చించిన సమయాన్ని కుదించి, కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలను వివరించాల్సింది. నిత్యం భారతీయత గురించి ప్రవచించే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, ట్రంప్ పర్యటనలో భారత దేశ విదేశాంగ విధానం, దౌత్య నియమాల పరిధిని దాటి దేశ ప్రతిష్టను దిగజార్చారు. ఒక స్టేట్ గెస్ట్‌కు ఇవ్వవలసిన ప్రాధాన్యం కంటే అతిగా చేయడం ప్రధాని కుర్చీ ప్రభను పెంచదు. మోదీ, మన దేశ ఎజెండా పక్కకు పెట్టి, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి పరిమితమైనారు. మోదీ తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాల కోసం వెంపర్లాడి, భారతదేశ ప్రజల ఆత్మగౌరవం ట్రంప్ వద్ద తాకట్టుపెట్టిన తీరు బాధాకరం. వ్యాసకర్త: కొనగాల మహేష్, జాతీయ సభ్యులు, ఏఐసీసీ, మొబైల్ : 98667 76999 -
తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించాను
-
'తాజ్ అందాలు నన్ను మైమరిపించాయి'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయి రెండు రోజులవుతుంది. అయినా ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వారి పర్యటనపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ తాజ్ అందాలను ఆస్వాదించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశారు. ' ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న తాజ్‌మహల్‌ను దగ్గర నుంచి చూడడం ఆనందం కలిగించింది. తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించానంటూ' క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మొత్తం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తన భర్త ట్రంప్ ట్రంప్‌తో కలిపి చేతిలో చేయి వేసుకొని తాజ్‌మహల్‌లో కలియ తిరగడం కనిపించింది. నితిన్ కుమార్ గైడ్‌గా వ్యవహరిస్తూ తాజ్‌మహల్ విశిష్టతను, దానియొక్క చరిత్రను వారికి వివరించారు. కాగా డేవిడ్ ఐసనోవర్, బిల్ క్లింటన్, తర్వాత తాజ్ మహల్‌ను వీక్షించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గుర్తింపు పొందారు. (‘తాజ్’అందాలు వీక్షించిన ట్రంప్ దంపతులు) -
ఢిల్లీ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలు.. పూర్తిగా విఫలమయ్యారు
వాషింగ్టన్ : భారత రాజధాని ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనబడిందని ఆ దేశ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ సాండర్స్ పేర్కొన్నారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన హింసాకాండపై ట్రంప్ స్పందిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అల్లర్లు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ ఇది ఇండియా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై బెర్నీ సాండర్స్ బుధవారం ట్విటర్ ద్వారా స్పందించారు.' భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. మత ఘర్షణలు జరిగి పదుల సంఖ్యలో చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. అయితే ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారమని ట్రంప్ స్పందించారు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. ఆయన ఒక దేశానికి అధ్యక్షుడిగా నాయకత్వం లోపించింది. అంతేగాక ఒక వ్యక్తిగానూ మానవ హక్కుల విషయంలోనే పూర్తిగా విఫలమయ్యారు' అంటూ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై బెర్నీసాండర్స్ మాత్రమే గాక ఇతర డెమొక్రాటిక్ సెనేటర్లు కూడా తప్పుబట్టారు. అంతకుముందు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్ తమ పౌరుల భద్రత కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముస్లింలపై దాడి నివేదికల మధ్య భారత ప్రభుత్వం ప్రజలకు విశ్వాసంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించాలని అమెరికా సంస్థ తెలిపింది. (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) (భారత్ గొప్ప దేశం: ట్రంప్) -
ట్రంప్‌పై వర్మ మరో ట్వీట్: నెటిజన్లు ఫిదా!
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై కొన్ని రోజులుగా ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్వీట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో.. వర్మ మరోసారి తనదైన శైలిలో ట్రంప్ పర్యటనపై ట్వీట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ నెల 24న ట్రంప్ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అదేరోజు మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశిస్తూ బుధవారం వర్మ సరదాగా ట్వీట్ చేశారు. ట్రంప్ పర్యటన: వర్మ సంచలన వ్యాఖ్యలు! Trump : MR.Modi you told me 70 lakh people will come to see me and there’s only 1 lakh. Modi: Mr.Trumpie Like1 dollar is 70 rs 1 Gujarati is equal to 70 Americans — Ram Gopal Varma (@RGVzoomin) February 26, 2020 ‘ఈ కార్యక్రమంలో నాకు స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది వస్తారని చెప్పావు కదా.. లక్ష మందే వచ్చారేంటి?’ అని అడిగిన ప్రశ్నకు మోదీ ‘ఇండియన్ 70 రూపాయలకు.. అమెరికా 1 డాలర్ ఎలా సమానమో.. 70 మంది అమెరికన్లకు ఒక గుజరాతీ సమానం’ అని మోదీ సమాధానం ఇచ్చినట్లు వర్మ ట్విటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. వర్మ ట్వీట్‌కు ఫిదా అయిన నెటిజన్లు.. ఫన్నీ మీమ్స్‌తో తమ స్పందనను తెలుపుతున్నారు. కాగా గతంలో కూడా వర్మ వివిధ అంశాలపై తనదైన శైలిలో ట్వీట్ చేసి నవ్వించిన సంగతి తెలిసిందే. ట్రంప్ భారత్ పర్యటనపై వర్మ పంచ్‌లు -
బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్ ఫిదా
న్యూఢిల్లీ : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వచ్చిన ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం రాత్రి తిరిగి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో తన డ్రెస్సింగ్, హావభావాలు, మాట్లాడే తీరుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మెలానియా వెళ్తూ వెళ్తూ ఎన్నో మధుర స్మృతులను తన వెంట తీసుకెళ్లారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని నానక్పూర్‌లో ఉన్న సర్వోదయా ప్రభుత్వ పాఠశాలను అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సందర్శించారు. పాఠశాలలో అమలు చేస్తున్న హ్యాపినెస్ విద్యా విధానాన్ని మెలానియా స్వయంగా పరిశీలించారు. క్లాస్‌రూంలో చిన్నారులతో ముచ్చటించిన మెలానియా.. విద్యార్థులు వేసిన సూర్య నమస్కారాలు ఆసక్తిగా తిలకించారు. తరగతి గదిలో టీచర్‌గానూ మారిన మెలానియా చిన్నారులతో ముచ్చటించారు. (అందరి చూపులు ఆమె వైపే..!) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల డ్యాన్స్‌ను చూస్తూ ఉత్సాహంగా గడిపారు. తర్వాత పాఠశాల ఆవరణలో స్టేజ్‌పైన కొంతమంది విద్యార్థినులు పంజాబీ పాటకు నృత్యం చేస్తుండగా మెలానియా విద్యార్థుల పక్కన కూర్చొని చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఒక పిల్లాడు యూఎస్ జెండాను తన చేతిలో పట్టుకొని బాంగ్రా డ్యాన్స్ చేయడం మెలానియాను విశేషంగా ఆకర్షించింది. మెలానియా ఒక గంట పాటు సర్వోదయా స్కూల్ విద్యార్థులతో ఆనందంగా గడిపారు. కాగా మెలానియా పిల్లలతో గడిపిన ఆనంద క్షణాలను ఏఎన్ఐ సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 'హ్యాపినెస్ విద్యా విధానాన్ని' అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేకపోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. (ట్రంప్ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంకా) #WATCH Delhi: First Lady of the United States, Melania Trump watches a dance performance by students at Sarvodaya Co-Ed Senior Secondary School in Nanakpura. pic.twitter.com/dBCuTzvymF — ANI (@ANI) February 25, 2020 -
అమెరికా బయల్దేరిన ట్రంప్
-
మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి: ట్రంప్
న్యూఢిల్లీ: తమ దేశంలో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ భారత కంపెనీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసే దిశగా నియంత్రణలను మరింతగా సడలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం దేశీ దిగ్గజ సంస్థల సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తదితర దిగ్గజాలు దీనికి హాజరయ్యారు. తమ వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడుల గురించి ట్రంప్‌నకు వారు వివరించారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. అపూర్వ విజయాలు సాధించిన మీకు అభినందనలు. మీరు అమెరికా రావాలని, బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మేం పెట్టుబడులను నిధులపరంగా కాకుండా ఉద్యోగాల కల్పన దృష్టితో చూస్తాం‘ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చట్టాలపరంగానూ, ప్రభుత్వపరంగానూ ఉన్న నియంత్రణలపరమైన సమస్యల అంశాన్ని ఈ సందర్భంగా కొందరు వ్యాపారవేత్తలు ప్రస్తావించారు. ‘చాలా నియంత్రణలను ఎత్తివేయబోతున్నాం. పెను మార్పులను మీరు త్వరలోనే చూడబోతున్నారు. ఇకనుంచి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది‘ అని ట్రంప్ సమాధానమిచ్చారు.(సీఎన్ఎన్ X ట్రంప్) ఇక్కడ మేము.. అక్కడ మీరు.. అమెరికా, భారతీయ కంపెనీలు ఇరు దేశాల్లోనూ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు. ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు తోడ్పాటు మాత్రమే అందించగలవని, ప్రైవేట్ రంగమే వాస్తవానికి ఉద్యోగాలు కల్పించగలుగుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తాను కలిసి పనిచేస్తున్నామని ట్రంప్ చెప్పారు. ‘మీ ద్వారా మేము ఈ దేశంలో, ఆయన మా దేశంలో ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ట్రంప్.. మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు. సీఈవోల సమావేశంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘మోదీ చాలా మంచి వ్యక్తి అని ఎవరో చెప్పారు. ఆయన నిజంగా మంచి వ్యక్తే. అంతే కాదు చాలా స్థిరంగానూ వ్యవహరిస్తారు. ఆయన గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు‘ అని ట్రంప్ కితాబిచ్చారు.(నమస్తే ట్రంప్ అదిరింది... ) మళ్లీ నేనే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తానే గెలుపొందుతానం టూ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో మార్కె ట్లు భారీగా లాభపడతాయన్నారు. ఆర్థిక వ్యవస్థ, సైన్యం, వైద్యం తదితర రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించిందని ట్రంప్ చెప్పా రు. తన సారథ్యంలో అమెరికా ఎకానమీ.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వృద్ధి చెందిందని అన్నారు. వాణిజ్య ఒప్పందానికి చేరువలో: గోయెల్ భారత్ అమెరికాలు కీలక వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నట్లు మంగళవారం వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలిపారు. ‘యూఎస్–ఇండియా ఫోరమ్: పార్ట్నర్స్ ఫర్ గ్రోత్’ అన్న అంశంపై ఇక్కడ జరిగిన చర్చలో గోయెల్ మాట్లాడారు. పరస్పర భారీ వాణిజ్య ప్రయోజనాలు ఈ ఒప్పందం వల్ల ఒనగూరుతాయని అన్నారు. 2020 నాటికి కేంద్రం లక్ష్యాలను ఆయన ఈ సందర్భంగా వివరిస్తూ, ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు, 24 గంటలూ విద్యుత్, వంట గ్యాస్, ఇంటర్నెట్ విస్తృతి, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. అమెరికా నుంచి చమురు దిగుమతులు పదింతలు నిత్యం 2,50,000 బ్యారెళ్ల చమురు దిగుమతి భారత్‌కు అమెరికా నుంచి చమురు సరఫరాలు రెండేళ్లలో పది రెట్లు పెరిగి.. రోజుకు 2,50,000 బ్యారెళ్ల స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఇంధన బంధం బలోపేతాన్ని ఇది తెలియజేస్తోంది. ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో జరిగిన వ్యాపార భేటీలో అమెరికా ఇంధన శాఖ మంత్రి డాన్ బ్రోలెట్ మాట్లాడుతూ.. భారత్ 2017లో అమెరికా నుంచి నిత్యం 25,000 బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. గత రెండేళ్లలో ఇది 25,000 బ్యారెళ్ల నుంచి నిత్యం 2,50,000 బ్యారెళ్ల దిగుమతి స్థాయికి చేరుకుంది. ఇది ఇంకా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం’’ అని బ్రోలెట్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇంధన వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోందంటూ ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డాన్బ్రోలెట్ను అభినందించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో అమెరికా 5.4 మిలియన్ టన్నుల చమురును భారత్‌కు ఎగుమతి చేసింది. భారత్‌కు అమెరికా ఆరో అతిపెద్ద చమురు వనరుగా అవతరించినట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో జరిగిన భారత్–అమెరికా వ్యాపార కార్యక్రమంలో భాగంగా తెలిపారు. అలాగే, అమెరికాకు భారత్ ఇప్పుడు 4వ అతిపెద్ద చమురు ఎగుమతి మార్కెట్‌గా మారినట్టు ఆయన వివరించారు.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) -
విందుకు వేళాయె...
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన ట్రంప్ దంపతులను కోవింద్, ఆయన భార్య సవిత కోవింద్ ఆహ్వానం పలికారు. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాలులోకి ట్రంప్ దంపతుల్ని తీసుకువెళ్లి అంతా చూపించారు. ఆ హాలులో 5వ శతాబ్దం నాటి గౌతమ బుద్ధుడి విగ్రహం, భారతీయ నాయకులు చిత్రపటాలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్, కోవింద్ కాసేపు మాట్లాడుకున్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయని, ఇందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ట్రంప్‌కి ఘనస్వాగతం పలకడమే నిదర్శనమని అన్నారు. అమెరికా తమకు అత్యంత విలువైన మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు. ఈ రెండు రోజులు అద్భుతంగా గడిచాయని, ఎంతో ప్రయోజనకరమైన చర్చలు జరిగాయని ట్రంప్ తెలిపారు. వాణిజ్య, రక్షణ ఒప్పందాల్లో ముందడుగులు పడ్డాయని చెప్పారు. భారత్‌కు రావడం వల్ల ఎంతో నేర్చుకున్నామని,, ఎన్నో అందమైన అనుభూతులతో తిరిగి వెళుతున్నామని ట్రంప్ చెప్పారు. రాష్ట్రపతి కోవింద్ చేసిన అతిథి మర్యాదలకు ఆయనకు, ఆయన అనుచర వర్గానికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ విందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు నలుగురు ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు(తెలంగాణ), బీఎస్ యడియూరప్ప(కర్ణాటక), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా),శర్బానంద సోనోవాల్(అస్సాం)..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడి రాకను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విందు అనంతరం ట్రంప్ తిరుగు పయనమయ్యారు. ఇవాంకా, కుష్నర్ దంపతులను రాష్ట్రపతికి పరిచయం చేస్తున్న ట్రంప్..చిత్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య విందు ప్రత్యేకత ఏమంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు భలే పసందుగా ఉంది. ట్రంప్ మాంసాహార ప్రియుడు. ఎక్కడికెళ్లినా ఆయనకు బీఫ్ స్టీక్స్, మీట్ లోఫ్, బర్గర్స్ లాంటి వాటినే ఇష్టంగా లాగిస్తారు. అందుకే భారతీయ రుచులు, ట్రంప్ అభిరుచులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి భవన్ వర్గాలు రెండు రకాల మెనూలు తయారు చేశాయి. వెజిటేరియన్ వంటకాలు: కోరియాండర్ షోర్బా, ఆలూ టిక్కీ, పాలక్ పాప్డి, జార్ఖెజ్ జమీన్, దాల్ రైజినా వగైరాలు, నాన్ వెజ్ మెనూ: రాన్ అలీషాన్, కాజూ స్పైస్డ్ సాల్మన్, డెజర్ట్స్: హాజల్‌నెట్ యాపిల్ పై, కారమెల్ సాస్, మల్పువా రబ్రీరోల్.. ఎపిటైటర్‌గా అమ్యూజ్ బౌచె లంచ్ @ హైదరాబాద్ హౌస్ ట్రంప్, మోదీ మధ్య చర్చల అనంతరం హైదరాబాద్ హౌస్‌లో లంచ్ ఏర్పాటు చేశారు. మోదీ పక్కా శాకాహారి కావడంతో రెండు రకాల మెనూలు సిద్ధం చేశారు. ఈ లంచ్‌కి ఫస్ట్ లేడీ మెలానియా, ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్లు హాజరయ్యారు. సారంగి, సంతూ ర్ జుగల్బందీ చేస్తూ హాయి గొలిపే సంగీతం, గాంధీజీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ భజనలు వస్తూ ఉంటే ఈ లంచ్ కార్యక్రమం జరిగింది. భజనలు, ఘజల్స్, పాశ్చాత్య సంగీత, హిందీ సినిమా పాటల్ని ప్లే చేశారు. అణువణువున దేశభక్తి ఉప్పొంగే మిలేసుర్ మేరా తుమ్హారా పాట కూడా వినిపించారు. హిందీ ఆపాత మధురాలైన మేరే గీత్ అమర్ కర్ దో, పీయా తోసే నైనా లగే రే, సత్యం శివం, సుందరం వంటివి గీతాలు ప్లే అవుతూ ఉంటే, అత్యంత ఆహ్లాదకర వాతారవణంలో భోజనాలు చేశారు. పైనాపిల్, మస్టర్డ్ సీడ్స్‌తో తయారు చేసిన అనాస్ సన్సావ్, పనసపండుతో తయారు చేసిన పాంచ్ ఫోరాన్ కాథల్, జీరా బన్, హాక్ చెనా కబాబ్, స్ప్రౌట్స్తో తయారు చేసిన సూప్, రకరకాల రోటీలు, నాన్లు, ఖర్జూరం హల్వా, అంజీర్ ఐస్‌క్రీమ్, చోటీ స్వీట్స్ వంటివి వెజ్ మెనూలో ఉన్నాయి. ఇక నాన్‌వెజ్ వంటకాల్లో కశ్మీర్ కుంకుం పువ్వు వేసిన రిచ్ గ్రేవీతో తయారు చేసిన కోడికూర, చికెన్ పఫ్‌లు, మసాలా తక్కువగా వేసిన మటన్ కర్రీ, పింక్ సాల్మన్ స్వీట్ బాసిల్ చట్నీ వడ్డించారు. -
సీఎన్ఎన్ X ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీఎన్ఎన్ వార్తాసంస్థపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘మీ పనితీరు చూసి మీరే సిగ్గుపడాలి’అంటూ సీఎన్ఎన్ విలేకరి అకోస్టాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం ఇందుకు వేదికయింది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని నిరాకరిస్తూ మీరు ప్రతిజ్ఞ చేస్తారా?, ఎటువంటి అనుభవం లేని వ్యక్తిని నేషనల్ ఇంటెలిజెన్స్ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారు? అంటూ ఈ సమావేశంలో సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా ప్రశ్నించారు. ఇందుకు ట్రంప్.. ‘ఎన్నికల్లో సాయం చేయాలని ఏ దేశాన్ని కోరలేదు. ఏ దేశం నుంచి నాకు సాయం అందలేదు కూడా’అని బదులిస్తూ.. ఇటీవల ఓ వార్తాంశంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సీఎన్ఎన్ క్షమాపణ చెప్పాలన్నారు.(కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) నిజాన్ని వెల్లడించడంలో మీతో పోలిస్తే మాకు మంచి రికార్డే ఉంది’అని అకోస్టా అనడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ రికార్డు ఏమిటో నేను చెబుతా. ఆ రికార్డు చూసి మీరే సిగ్గుపడతారు’అని పేర్కొన్నారు. ఇలా వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2018లో మీడియా సమావేశంలో ట్రంప్‌తో వాదులాటకు దిగిన అకోస్టా మీడియా పాస్‌ను అధ్యక్ష భవనం రద్దు చేసింది. ఆ తర్వాత కోర్టు జోక్యంతో దానిని పునరుద్ధరించారు. (రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) -
నమస్తే ట్రంప్ అదిరింది...
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనపై అంతర్జాతీయ మీడియా ఆసక్తి కనబరిచింది. సీఎన్ఎస్ ఇంటర్నేషనల్, న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్, బీబీసీ సహా పాకిస్తానీ మీడియా సంస్థలు ట్రంప్ పర్యటనను ప్రముఖంగా ప్రస్తావించాయి. అశేష జనసందోహం నడుమ అమెరికా అధ్యక్షుడికి భారత్‌లో ప్రేమపూర్వక స్వాగతం లభించిందని సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. భారత ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ట్రంప్‌కు స్వాగతం పలికారని వెల్లడించింది. ట్రంప్ తన ప్రసంగంలో పలు భారతీయ పదాలను పలకడంలో తడబడ్డారని పేర్కొంది. ట్రంప్ తన ప్రసంగంలో భాగంగా పేర్కొన్న ‘అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది’అనే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రధాన శీర్షికగా చేసుకుంది. అయితే, మోదీ ప్రభుత్వంపై వెల్లువెత్తే విమర్శలను ట్రంప్ ప్రస్తావించలేదని తెలిపింది. పౌరసత్వ చట్టం సహా పలు అంశాల విషయంలో గత మూడు నెలలుగా భారత్‌లో మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్ పర్యటన కాస్త ఊరడింపుగా మారిందని ద గార్డియన్ పేర్కొంది. భారత్‌లో అమెరికా అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం లభించిందని బీబీసీ పేర్కొంది. భారతీయ పదాలను పలకడంలో ట్రంప్ తడబడ్డారని తెలిపింది. ట్రంప్ పర్యటన విషయంలో పాకిస్తాన్ మీడియా మరోసారి తన తీరును వెళ్లగక్కింది. ట్రంప్ పర్యటన మొత్తంలో పాక్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే హైలెట్ చేసింది. పాక్‌తో సత్సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్ మాటలను ప్రస్తావించింది. -
కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!
న్యూఢిల్లీ: ఈ పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) భారత్ అంతర్గత వ్యవహారమని, ఆ విషయమై తాను ఏమీ వ్యాఖ్యానించబోనని తేల్చిచెప్పారు. భారత పర్యటన సందర్భంగా మంగళవారం ట్రంప్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌లో ప్రజలకు మతస్వేచ్ఛ ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారనే తాను భావిస్తున్నానన్నారు. ‘వివాదాస్పద అంశాల జోలికి వెళ్లాలనుకోవడం లేదు. వివాదాస్పద అంశాలకు సంబంధించిన ఒక చిన్న సమాధానం నా మొత్తం పర్యటన సానుకూలతను ముంచేస్తుంది.(అమెరికాకు బయల్దేరిన ట్రంప్ బృందం) ఆ జవాబును మాత్రమే మీరు పట్టించుకుంటారు. నా పర్యటన అంతా పక్కనబెడ్తారు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనంటూనే.. అంతా కోరుకుంటే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. కశ్మీర్‌ను భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న అతి పెద్ద సమస్యగా ట్రంప్ అభివర్ణించారు. ‘ఉద్రిక్తతలు తొలగేలా మధ్యవర్తితం చేయమంటే.. అందుకు నేను సిద్దం’అన్నారు. మోదీ, ఇమ్రాన్‌ఖాన్.. ఇద్దరితో తనకు సత్సంబంధాలున్నాయన్నారు. ప్రతీ విషయానికి రెండు వాదనలుంటాయని వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్ సమస్యపై కృషి చేస్తున్నారు’అని ట్రంప్ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో పాకిస్తాన్ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. పాక్ నుంచి తలెత్తుతున్న ఉగ్రవాదంపై కూడా చర్చించామన్నారు. ఈ సందర్భంగా మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ సరళంగా వ్యవహరించే, చాలా శక్తిమంతమైన నేత అని వ్యాఖ్యానించారు. ‘మోదీ గట్టి మనిషి. తానేమనుకుంటాడో అది చేస్తారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటారు’అన్నారు. ట్రంప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వాణిజ్యంపై.. దిగుమతుల సుంకాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న హార్లీ డేవిడ్సన్ బైక్‌పై విధిస్తున్న భారీ సంకాల విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ టారిఫ్‌ల విషయంలో అమెరికాతో సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అమెరికా నుంచి భారత్ భారీగా మిలటరీ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేస్తోందన్నారు. తాలిబన్‌తో అమెరికా శాంతి ఒప్పందాన్ని భారత్ సమర్ధిస్తుందనే తాను భావిస్తున్నానన్నారు. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందా? అన్న ప్రశ్నకు.. అలాంటి సమాచారమేదీ తనకు నిఘా వర్గాల నుంచి రాలేదన్నారు. ((సీఎన్ఎన్ X ట్రంప్) ఢిల్లీ అల్లర్లు అంతర్గతం ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లపై మోదీతో చర్చించారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వ్యక్తిగత దాడుల గురించి చర్చించబోనన్నారు. అది భారత్ సొంత విషయమని స్పష్టం చేశారు. సీఏఏపై తాను ఏమీ మాట్లాడబోనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ తన దేశ ప్రజల కోసం సరైన నిర్ణయాలే తీసుకుంటుందని భావిస్తున్నానన్నారు. భారత్‌లో ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారిపై ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందించాలన్న ప్రశ్నకు.. ‘మోదీతో చర్చల్లో ముస్లింల ప్రస్తావన కూడా వచ్చింది. క్రిస్టియన్ల గురించి కూడా చర్చించాం’అన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ నుంచి తనకు శక్తిమంతమైన సమాధానం లభించిందన్నారు. కాగా, మోదీ, ట్రంప్‌ల మధ్య చర్చల్లో సీఏఏ అంశం చర్చకు రాలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు. మత సామరస్యంపై ఇరువురు నేతలు సానుకూల భావాలను వ్యక్తం చేశారన్నారు. మత స్వేచ్ఛపై మాట్లాడా... ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా.. భారత్‌లో మత స్వేచ్ఛ విషయమై సుదీర్ఘంగా చర్చించానని ట్రంప్ తెలిపారు. ‘భారత్‌లో మత స్వేచ్ఛపై చర్చించాం. భారత్‌లో ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలనే మోదీ కోరుకుంటున్నారు. ముస్లింలతో కలిసి పనిచేస్తున్నామని మోదీ నాకు చెప్పారు. గతంలోనూ పౌరులకు మతస్వేచ్ఛను అందించేందుకు భారత్ కృషి చేసింది’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ అద్బుతమైన నేత అని, భారత్ గొప్ప దేశమని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. పౌరులకు మతస్వేచ్ఛ అందించేందుకు భారత్ గొప్పగా కృషి చేసిందన్నారు. -
మహాత్ముడికి ఘన నివాళి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు. మహాత్ముడి సమాధి దగ్గర పుష్పగుచ్ఛాలను ఉంచి, పూలతో అర్చించి నివాళులర్పించారు. అనంతరం ట్రంప్ సందర్శకుల పుస్తకంలో గాంధీజీని కొనియాడుతూ సందేశాన్ని రాశారు. ‘‘మహాత్ముడి ఆలోచనల నుంచి రూపు దిద్దుకున్న అత్యంత అద్భుతమైన సార్వభౌమ భారత్‌కు అమెరికా ప్రజలు బలమైన మద్దతు ఇస్తారు. ఇది నాకు దక్కిన అపూర్వమైన గౌరవం’’అని ఆ పుస్తకంలో రాశారు. ట్రంప్ సబర్మతి ఆశ్రమం సందర్శించినప్పుడు మహాత్ముడి ప్రస్తావన లేకుండా సందేశం రాయడంతో ట్విట్టర్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ అసలు గాంధీ పేరు విన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌ఘాట్‌లో ట్రంప్ రాసే సందేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సందేశం దగ్గర ట్రంప్‌తో పాటు మెలానియా కూడా సంతకాలు చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్రంప్‌ను రాజ్‌ఘాట్‌కు తోడ్కొని వెళ్లారు. రాజ్‌ఘాట్ వద్ద మొక్కను నాటుతున్న ట్రంప్, మెలానియా -
త్వరలో భారీ ట్రేడ్ డీల్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాలను 21వ శతాబ్దంలోనే అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భద్రత, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందడం ఇరుదేశాల వ్యూహాత్మక మైత్రిలో కీలకమైన అంశమన్నారు. ఇరుదేశాల మధ్య త్వరలో ఒక భారీ, పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని సంకేతాలిచ్చారు. భారత్, అమెరికాల మధ్య మంగళవారం జరిగిన సమగ్ర ద్వైపాక్షిక ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ట్రంప్‌తో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం.. తదితర కీలక అంశాలు మోదీ, ట్రంప్‌ల నేతృత్వంలో జరిగిన ఆ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. రెండు దేశాల మధ్య ప్రధాన వివాదాస్పద అంశమైన ద్వైపాక్షిక వాణిజ్యంపై మోదీ విలేకరుల సమావేశంలో స్పందించారు. ఇరు దేశాల వాణిజ్య మంత్రుల మధ్య ఈ విషయంపై సానుకూల ధోరణిలో చర్చలు జరిగాయని ప్రధాని వెల్లడించారు. ‘మా వాణిజ్య మంత్రులు అంగీకారానికి వచ్చిన విషయాలకు ఒక చట్టబద్ధ రూపం తీసుకువచ్చేందుకు ఇరుదేశాల అధికారుల బృందం కృషి చేయాలని ప్రెసిడెంట్ ట్రంప్, నేను నిర్ణయించాం.ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ప్రారంభించాలని కూడా నిర్ణయించాం. ఆ ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనకర ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నాం ’ అని మోదీ వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆమోదించబడిన నిబంధనలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి అందించే నిధుల విషయంలో పారదర్శకత అవసరమని తాను, ట్రంప్ భావిస్తున్నామన్నారు. పరస్పర ప్రయోజనాలే కాకుండా, ప్రపంచ ప్రయోజనాలు లక్ష్యంగా తమ ఆలోచనలు కొనసాగాయని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలను అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించామన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, నార్కో టెర్రరిజాన్ని, ఇతర వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు నూతన విధానాన్ని రూపొందించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు. ట్రంప్‌కు కేంద్ర మంత్రులను పరిచయం చేస్తున్న ప్రధాని ఆతిథ్యం అద్భుతం ట్రంప్‌కు భారత్‌లో లభించిన స్వాగతం చిరకాలం గుర్తుండిపోతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యే ముందు ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ.. భారత్, అమెరికాల సంబంధాలు ఈ స్థాయికి పెరగడానికి ట్రంప్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. ప్రతిగా ట్రంప్ స్పందిస్తూ.. భారత్‌లో ఈ రెండు రోజులు అద్భుతంగా సాగాయన్నారు. ముఖ్యంగా, మొతెరా స్టేడియంలో కార్యక్రమం గొప్పగా జరిగిందన్నారు. ‘అది నాకు లభించిన గొప్ప గౌరవం. నిజానికి ఆ స్టేడియానికి భారీగా తరలివచ్చిన ప్రజలు నా కోసం కాదు.. మీ(మోదీ) కోసమే వచ్చారనిపించింది. స్టేడియం లోపల దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు. మీ పేరును నేను పలికిన ప్రతీసారి చప్పట్ల వర్షం కురిసింది. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారు’ అని ట్రంప్ మీడియా ముందే మోదీపై ప్రశంసలు గుప్పించారు. -
రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన విందు భేటీలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ విందు సమావేశానికి అతిథులుగా ఆహ్వానించగా ఆ జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నారు.(సీఎన్ఎన్ X ట్రంప్) డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ అతిథులను పరిచయం చేసుకుంటూ వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో కరచాలనం చేసి తనను పరిచయం చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ వెంట రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష, ప్రధాని నరేంద్ర మోదీ అతిథులను పలకరిస్తూ ముందుకు సాగారు. ట్రంప్‌కు సంబంధించి పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
24 రోమియోలు 6 అపాచీలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా మంగళవారం ఇరు దేశాల మధ్య ఇక్కడి హైదరాబాద్ హౌజ్‌లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో మూడు ఒప్పందాలు కుదిరాయి. చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. 300 కోట్ల డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. (తెలుపు.. స్వచ్ఛత) ఈ ఒప్పందంలో భాగంగా, 260 కోట్ల డాలర్ల విలువైన 24 ఎంహెచ్ –60 రోమియో హెలికాప్టర్లను భారతీయ నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. అలాగే, 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లను ఆర్మీ అవసరాల కోసం ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందాలు భారత్, అమెరికాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఇరు దేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మధ్య వైద్య ఉత్పత్తుల రక్షణకి సంబంధించి ఒక ఎంఓయూపై సంతకాలు జరిగాయి. అలాగే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎగ్జాన్ మొబిల్ ఇండియా ఎల్ఎన్జీ లిమిటెడ్, చార్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల మధ్య సహకారానికి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ కోఆపరేషన్‌పై సంతకాలు జరిగాయి. (మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి..) ‘హెచ్1 బీ’పై ఆందోళన చర్చల అనంతరం, వాటి వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ‘అంతర్గత భద్రత, రక్షణ, ఇంధనం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు’ అనే ఐదు ప్రధాన రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి భారత్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్‌ల మధ్య దాదాపు 5 గంటల పాటు చర్చలు కొనసాగాయన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాలు సంయుక్తంగా వర్కింగ్ గ్రూప్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయన్నారు. అలాగే, చర్చల సందర్భంగా హెచ్1 బీ వీసాల విషయంలో తమ ఆందోళనలను అమెరికా దృష్టికి భారత్ తీసుకువచ్చిందన్నారు. అమెరికా హైటెక్ రంగంలో భారతీయుల పాత్రను ప్రధానంగా ప్రస్తావించామన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు. (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు కూడా ప్రస్తుతం గణనీయ స్థాయికి తగ్గిందని ష్రింగ్లా వెల్లడించారు. అమెరికా భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, భారత్ మొత్తం ఎగుమతుల్లో 12% యూఎస్‌కే ఉంటాయని తెలిపారు. ట్రంప్, మోదీల మధ్య సీఏఏ అంశం చర్చకు రాలేదని ష్రింగ్లా తెలిపారు. చర్చలో మత సామరస్యం అంశం ప్రస్తావనకు వచ్చిందని, భిన్నత్వం, బహుళత్వం భారత్, అమెరికాల ఉమ్మడి విలువలని ఆ సందర్భంగా ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారని ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలోనూ ట్రంప్ భారత్‌లోని మత విభిన్నతను, మత సామరస్యాన్ని ప్రస్తావించిన విషయాన్ని ష్రింగ్లా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి గెలుస్తారనే భావనతోనే.. ఈ స్థాయి స్వాగతం భారత్ నుంచి లభిస్తోందా? అని ప్రశ్నించగా.. వేరు వేరు పార్టీలకు చెందిన యూఎస్ అధ్యక్షులు భారత్‌కు వచ్చారని, ద్వైపాక్షిక సహకారం ప్రాతిపదికగానే వారితో భారత్ వ్యవహరిస్తుందని వివరించారు. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోండి పాక్ భూభాగంపై ఉగ్ర స్థావరాలకు ఆశ్రయం ఇవ్వకూడదని, ఉగ్రదాడులకు పాక్ గడ్డను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. 26/11 ముంబై దాడుల సూత్రధారులు సహా ఆ తరహా దాడులకు పాల్పడిన వారికి అతి త్వరగా శిక్ష పడేలా చూడాలని పాక్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జైషే మొహమ్మద్, లష్కరే, హిజ్బుల్ ముజాహిదీన్, డీ –కంపెనీ(దావూద్ ఇబ్రహీంకు చెందిన మాఫియా సంస్థ), అల్ కాయిదా, ఐసిస్, హక్కానీ నెట్వర్క్, తెహరీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ తదితర ఉగ్రవాద సంస్థలను, వాటి సోదర సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.