
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా మోదీ సర్కార్ తీరును శివసేన దుయ్యబట్టింది. అహ్మదాబాద్‌లో ట్రంప్ ప్రయాణించే మార్గంలో గుడిసెలు కనిపించకుండా గోడను నిర్మించడాన్ని సేన తప్పుపట్టింది. ట్రంప్ పర్యటనకు భారత్ చేస్తున్న ఏర్పాట్లు దాని బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని మండిపడింది. మోదీ నినాదం గరీబీ చుపావ్ (పేదరికాన్ని దాచడం)లా ఉందని చురకలు వేసింది. ట్రంప్ భారత పర్యటన బాద్షా (చక్రవర్తి)ను మరిపిస్తోందని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఎద్దేవా చేసింది. ట్రంప్ పర్యటన పడిపోతున్న రూపాయిని కాపాడలేదని, గోడ వెనుక పేదలను ఉద్ధరించదని వ్యాఖ్యానించింది.
స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ రాజు, రాణి తమ బానిస రాజ్యాల్లో ఒకటైన భారత్‌ను సందర్శించినప్పుడు చేపట్టే ఏర్పాట్లనే ఇప్పుడు ట్రంప్ పర్యటనకు ట్యాక్స్ పేయర్ల సొమ్ము వెచ్చించడం భారతీయుల బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌లో పేదల గుడిసెలు కనిపించకుండా చేపట్టిన గోడ నిర్మాణానికి ఏమైనా నిధులు కేటాయించారా.? దేశవ్యాప్తంగా ఇలాంటి గోడలు నిర్మించేందుకు అమెరికా భారత్‌కు నిధులు ఏమైనా మంజూరు చేసిందా..? అంటూ శివసేన ప్రశ్నలు గుప్పించింది. అహ్మదాబాద్‌లో ట్రంప్ కేవలం మూడు గంటలు గడుపుతారని, గోడ నిర్మాణానికి ఖజానాకు మాత్రం రూ 100 కోట్ల భారం పడిందని పేర్కొంది. అమెరికాలో అత్యధికంగా ఉన్న గుజరాతీ ఓటర్లను అధ్యక్ష ఎన్నికల్లో ఆకర్షించేందుకే ట్రంప్-మోదీ ఎత్తుగడలో భాగంగా అహ్మదాబాద్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని దుయ్యబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment