అహ్మదాబాద్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఒకప్పటి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. భారత్ పర్యటన సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో వస్తారా లేదానని యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అమెరికా నుంచి అహ్మదాబాద్‌కి వచ్చిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి మెలానియా తనకు ఎంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో ఒక రాజహంసలా కిందకి దిగారు. తెల్లని జంప్ సూట్ ధరించి నడుం చుట్టూ ఆకుపచ్చని రంగు సాష్ (ఫ్యాషన్ కోసం ధరించేది) అందంగా చుట్టుకున్నారు.
భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా, మన దేశీ టచ్‌తో రూపొందించిన డ్రెస్ ధరించడం అందరినీ ముగ్ధుల్ని చేసింది. జుట్టును లూజ్‌గా వదిలేసి అతి కొద్దిగా మేకప్ వేసుకొని తన సహజ సౌందర్యంతోనే ఆమె మెరిసిపోయారు. స్వయంగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మెలానియా సాధారణంగా తన దుస్తుల్ని తానే డిజైన్ చేసుకుంటారు. కానీభారత్ పర్యటన కోసం ప్రముఖ ఫ్రెంచ్ అమెరికన్ డిజైనర్ హెర్వ్ పెయిరె డిజైన్ చేసిన సూట్‌ని ధరించారు. పాల నురుగులాంటి తెల్లటి జంప్ సూట్ వేసుకొని, ఆకుపచ్చ రంగు పట్టు మీద బంగారం జరీ ఎంబ్రాయిడీతో చేసిన దుప్పట్టాను చుట్టుకున్నారు.
భారత్ వస్త్ర పరిశ్రమకు చెందిన 20 శతాబ్దం నాటి తొలి రోజుల్లో డిజైన్‌లను ఆకుపచ్చ రంగు దుప్పట్టాపై చిత్రీకరించినట్టుగా హెర్వ్ పెయిర్ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌లో వెల్లడించారు. తన మిత్రులు పంపించిన కొన్ని డాక్యుమెంట్లని చూసి అత్యంత శ్రద్ధతో ఆకుపచ్చ రంగు సాష్‌ను తయారు చేసినట్టు తెలిపారు. మెలానియా ధరించిన డ్రెస్‌పై ట్విటర్‌లో ప్రశంసలే వచ్చాయి. కొందరు హాస్యఛలోక్తుల్ని కూడా విసిరారు. అందానికే అందంలా ఉండే మెలానియా కొంటె కుర్రాళ్ల బారి నుంచి తనని తాను కాపాడుకోవడానికి కరాటే డ్రెస్ తరహాలో దుస్తులు ధరించారని కామెంట్లు చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ డార్క్ కలర్ సూట్ , పసుపు రంగు టై ధరించారు. మన భారతీయు వాతావరణానికి తగ్గట్టుగా వారి దుస్తుల్ని డిజైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment