అహ్మదాబాద్: ఓ అద్భుతమైన, ఇప్పటి వరకు చరిత్రలో అతిపెద్దది అయిన వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా చర్చలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత పర్యటనలో తొలి రోజు సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం నుంచి ఆయన ప్రసంగించారు. పెట్టుబడులకు అవరోధాలను తగ్గించే దిశగా అద్భుతమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని ప్రకటించారు. ‘‘నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ, నేను ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల విస్తృతికి చర్చించనున్నాం. ప్రధాని మోదీతో కలసి ఇరు దేశాలకూ మంచి చేసే గొప్ప అద్భుతమైన ఒప్పందానికి వస్తామన్న విశ్వాసం నాకుంది’’ అని ట్రంప్ వివరించారు.
అమెరికా బూమింగ్ ప్రపంచానికి ప్రయోజనం
అమెరికా అభివృద్ధి చెందితే అది భారత్‌కు, ప్రపంచానికి మంచిదన్నారు ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతోందని చెప్పేందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగాలను ఆకర్షించడం, వ్యాపారాల్లో సమస్యలను తగ్గించడం, నూతన పెట్టుబడులకు అవరోధాల్లేకుండా చేయడం, అనవసర బ్యూరోక్రసీ, నియంత్రణలను తొలగించినట్టు ట్రంప్ వివరించారు.
వ్యాపార వాతావరణం మరింత మెరుగవ్వాలి..
ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే గణనీయమైన సంస్కరణలను చేపట్టారన్న ట్రంప్.. భారత్‌లో వ్యాపార వాతావరణం మరింత మెరుగవ్వాలని ప్రపంచం కోరుకుంటోందన్నారు. ఆయన (మోదీ) దీన్ని రికార్డు వేగంతో చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సున్నితమైన వ్యవసాయం, పాడి, డేటా పరిరక్షణ, డేటా స్థానికంగా నిల్వ చేయడం, ఈ కామర్స్ తదితర రంగాలపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరాల్సి ఉంది. ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుందని, భారత ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని ఓ అధికారి తెలిపారు. వాణిజ్య చర్చలు పురోగతి చెందితే అమెరికా మరిన్ని డిమాండ్లను ముందుకు తీసుకురావచ్చని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు భారత్‌తో 17 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు తమ దేశ పాడి, పౌల్ట్రీ, వైద్య పరికరాలకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పించాలన్నది అమెరికా డిమాండ్. భారత్ నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, వాణిజ్య పరంగా ప్రాధాన్య దేశం హోదా తిరిగి కల్పించాలని మన దేశం కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment