
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చిరస్మరణీయ ఆహ్వానం పలుకుతామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ట్రంప్ భారత పర్యటన చాలా ప్రత్యేకమైనదని, ఇది అమెరికా–భారత్‌ల మధ్య స్నేహం బలపడేందుకు ఉపకరిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ‘భారత్, అమెరికాలకు ప్రజాస్వామ్యం పట్లా, భిన్న భావాలకూ అవకాశం ఇచ్చే విషయంలో ఒకేరకమైన నిబద్దత ఉన్నది. ఈ ఇరుదేశాల మధ్య స్నేహం, ఈ ఇరుదేశాల పౌరులకే కాకుండా యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా రానున్నారు.
భారత్ పర్యటన కోసం వేచి చూస్తున్నా: ట్రంప్
భారత్ పర్యటనకోసం తాను వేచి ఉన్నానని ట్రంప్ ట్వీట్ చేశారు. మోదీ తనకు మంచి స్నేహితుడనీ అతను చాలా గొప్ప వ్యక్తి అని అమెరికా అధ్యక్ష భవనంలో మీడియాతో చెప్పారు.
సరైన ఒప్పందం కావాలి...
భారత్‌తో వాణిజ్య ఒప్పందం సాధ్యమేననీ అయితే అది సరైన ఒప్పందం కావాలని ట్రంప్ అన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ రెండు దేశాలు అటువంటి ప్రయత్నాలేమీ చేయలేదని చెప్పారు.
అహ్మదాబాద్‌లో భారీ రోడ్ షో..
డొనాల్డ్ ట్రంప్ తన భారత పర్యటనలో భాగంగా ఈసారి ఢిల్లీలో కాకుండా నేరుగా అహ్మదాబాద్‌కి చేరుకుంటారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు 10 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేయబోయే రోడ్‌షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఆ తరువాత అహ్మదాబాద్‌లోని మొటేరా ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తోన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంను ట్రంప్–మోదీలు ఇద్దరూ ఆవిష్కరిస్తారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంకన్నా ఈ స్టేడియం పెద్దదని అధికారులు వెల్లడించారు. ఈ స్టేడియంలో 1.10 లక్షల మంది కూర్చునే అవకాశం ఉంది.
గుజరాత్ బడ్జెట్ సమావేశాలు వాయిదా...
ట్రంప్ పర్యటన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ని ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ట్రంప్ పర్యటనలో భాగంగా ఏర్పాటుచేయబోయే రోడ్ షో, బహిరంగ సభలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
హౌడీ ట్రంప్..
గత యేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై నుంచి మోదీ, ట్రంప్ ఉపన్యసించారు. ఈ సభకు అమెరికాలో ఉంటోన్న దాదాపు 50,000 మంది భారతీయులు హాజరయ్యారు. అదే తరహాలో ట్రంప్‌రాక దృష్ట్యా అహ్మదాబాద్‌లో ‘హౌడీ ట్రంప్’పేరిట భారీ సభను ఏర్పాటు చేయాలని భారత్ భావిస్తోంది. సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్న ఈ సభకు దాదాపు లక్షమంది జనం హాజరుకానున్నారు. ఈ సభను ఉద్దేశించి మోదీ, ట్రంప్‌లు ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment