హైదరాబాద్ హౌస్‌లో సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ట్రంప్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాలను 21వ శతాబ్దంలోనే అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భద్రత, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందడం ఇరుదేశాల వ్యూహాత్మక మైత్రిలో కీలకమైన అంశమన్నారు. ఇరుదేశాల మధ్య త్వరలో ఒక భారీ, పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని సంకేతాలిచ్చారు. భారత్, అమెరికాల మధ్య మంగళవారం జరిగిన సమగ్ర ద్వైపాక్షిక ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ట్రంప్‌తో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం.. తదితర కీలక అంశాలు మోదీ, ట్రంప్‌ల నేతృత్వంలో జరిగిన ఆ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. రెండు దేశాల మధ్య ప్రధాన వివాదాస్పద అంశమైన ద్వైపాక్షిక వాణిజ్యంపై మోదీ విలేకరుల సమావేశంలో స్పందించారు. ఇరు దేశాల వాణిజ్య మంత్రుల మధ్య ఈ విషయంపై సానుకూల ధోరణిలో చర్చలు జరిగాయని ప్రధాని వెల్లడించారు. ‘మా వాణిజ్య మంత్రులు అంగీకారానికి వచ్చిన విషయాలకు ఒక చట్టబద్ధ రూపం తీసుకువచ్చేందుకు ఇరుదేశాల అధికారుల బృందం కృషి చేయాలని ప్రెసిడెంట్ ట్రంప్, నేను నిర్ణయించాం.ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ప్రారంభించాలని కూడా నిర్ణయించాం. ఆ ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనకర ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నాం ’ అని మోదీ వెల్లడించారు.
అంతర్జాతీయంగా ఆమోదించబడిన నిబంధనలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి అందించే నిధుల విషయంలో పారదర్శకత అవసరమని తాను, ట్రంప్ భావిస్తున్నామన్నారు. పరస్పర ప్రయోజనాలే కాకుండా, ప్రపంచ ప్రయోజనాలు లక్ష్యంగా తమ ఆలోచనలు కొనసాగాయని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలను అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించామన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, నార్కో టెర్రరిజాన్ని, ఇతర వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు నూతన విధానాన్ని రూపొందించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు.
ట్రంప్‌కు కేంద్ర మంత్రులను పరిచయం చేస్తున్న ప్రధాని
ఆతిథ్యం అద్భుతం
ట్రంప్‌కు భారత్‌లో లభించిన స్వాగతం చిరకాలం గుర్తుండిపోతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యే ముందు ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ.. భారత్, అమెరికాల సంబంధాలు ఈ స్థాయికి పెరగడానికి ట్రంప్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. ప్రతిగా ట్రంప్ స్పందిస్తూ.. భారత్‌లో ఈ రెండు రోజులు అద్భుతంగా సాగాయన్నారు. ముఖ్యంగా, మొతెరా స్టేడియంలో కార్యక్రమం గొప్పగా జరిగిందన్నారు. ‘అది నాకు లభించిన గొప్ప గౌరవం. నిజానికి ఆ స్టేడియానికి భారీగా తరలివచ్చిన ప్రజలు నా కోసం కాదు.. మీ(మోదీ) కోసమే వచ్చారనిపించింది. స్టేడియం లోపల దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు. మీ పేరును నేను పలికిన ప్రతీసారి చప్పట్ల వర్షం కురిసింది. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారు’ అని ట్రంప్ మీడియా ముందే మోదీపై ప్రశంసలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment