
వాషింగ్టన్: భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌తో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఢిల్లీ ఘర్షణలు భారత్ అంతర్గత వ్యవహారమని, అందుకే మోదీతో దానిపై చర్చించలేదని మరోసారి స్పష్టం చేశారు.
కరోనాతో కంగారు లేదు: ట్రంప్
అమెరికాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధితో కంగారు పడాల్సిన పనేమీ లేదని అన్నారు. సంక్షోభ సమయాల్ని తాను అద్భుతంగా పరిష్కరించగలనని ట్రంప్ చెప్పారు. కోవిడ్–19 దాడి చేసినా ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్ కాస్త భయానకమైనదని, కానీ దాని గురించి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు.
నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు!
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్‌సీ సమాచారమిచ్చింది.