భారత పర్యటనలో వాణిజ్య ఒప్పందం కష్టమే..! | Donald Trump says he may postpone possible US-India trade deal | Sakshi
Sakshi News home page

భారత పర్యటనలో వాణిజ్య ఒప్పందం కష్టమే..!

Published Thu, Feb 20 2020 4:17 AM | Last Updated on Mon, Feb 24 2020 2:06 PM

Donald Trump says he may postpone possible US-India trade deal - Sakshi

వాషింగ్టన్‌: వాణిజ్యం విషయంలో భారత్‌ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్‌ ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్‌ స్పందించారు. భారత్‌ మాతో సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్‌ వ్యవహరిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే.

ఈ విషయంలో భారత్‌ను మొదటి నుంచి ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. ‘‘భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. ఇది మాకు అవసరం. అయితే, ఎన్నికల ముందు ఇది జరుగుతుందా అన్నది నాకు తెలియదు. కానీ, భారత్‌తో మాకు భారీ వాణిజ్య ఒప్పందం అయితే ఉంటుంది’’ అంటూ కర్ర విరగకుండా, పాము చావకుండా రీతిలో ట్రంప్‌ చెప్పారు. ఇరు దేశాల మధ్య ట్రంప్‌ పర్యటనలో భాగంగా డీల్‌ కుదురొచ్చన్న అంచనాలు ఇప్పటికే వ్యక్తమవుతుండడం గమనార్హం. భారత్‌తో వాణిజ్య చర్యలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌జర్‌ ట్రంప్‌తో కలసి భారత పర్యటనకు రాకపోవచ్చని తెలుస్తోంది. వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్, లైట్‌జర్‌ మధ్య ఇప్పటికే పలు విడతలుగా వాణిజ్య చర్చలు జరిగాయి. తమ దేశ పాడి, పౌల్ట్రీ, వైద్య పరికరాలకు మరింత మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది.

మోదీ అంటే ఎంతో ఇష్టం..: ప్రధానమంత్రి మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు ట్రంప్‌. భారత పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన మొతెరా స్టేడియంలో ఇరు దేశాధి నేతలతో భారీ సభ జరగనుంది. దీని గురించి ట్రంప్‌ మాట్లాడుతూ..‘‘విమానాశ్రయం, కార్యక్రమం జరిగే ప్రాంతానికి మధ్య ఏడు మిలియన్ల ప్రజలు ఉంటారని ఆయన (మోదీ) నాకు చెప్పారు. ఆ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దదిగా అవతరించనుంది. ఇది ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. మీరు కూడా దీన్ని ఆనందిస్తారు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్‌ అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement