![Donald Trump declares BRICS is dead, claims 100percent tariff If Dollar Replaced](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/tr_0.jpg.webp?itok=FyT5I5qi)
బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాటితో లావాదేవీలన్నీ బంద్
బ్రిక్స్ ఇప్పటికే ఓ మృత కూటమి
మోదీతో భేటీకి ముందు సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్‌తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. డాలర్‌తో ఆటలాడాలని చూస్తే వాటిపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించారు. డాలర్‌ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని చూస్తే బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వర్తక లావాదేవీలూ జరపబోదని స్పష్టం చేశారు.
గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి రెండు గంటల ముందే ట్రంప్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తాను తొలిసారి 100 శాతం టారిఫ్‌ల హెచ్చరికలు చేసినప్పుడే బ్రిక్స్ మృతప్రాయ కూటమిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు! దాని ఏర్పాటులోనే దురుద్దేశం దాగుందని ట్రంప్ ఆరోపించారు. ‘‘బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలే కోరుకోవడం లేదు. బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయి’’అని చెప్పుకొచ్చారు.
ఎందుకంటే, ‘‘డాలర్‌తో గేమ్స్ ఆడొద్దు. అలా చేస్తే మీపై 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అప్పుడు మీరే అలా చేయొద్దంటూ వేడుకుంటారు’’అని హెచ్చరించానన్నారు. బ్రిక్స్ కూటమిని రూపుమాపాలనుకుంటున్నారా, లేక అందులో భాగం కావాలని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాని విషయంలో గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఇలా కఠినంగా వ్యవహరించలేకపోయారని ఆక్షేపించారు.
బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్ సభ్య దేశాలు. బ్రిక్స్‌పై 100 శాతం టారిఫ్‌లు తప్పవని ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచీ హెచ్చరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు బదులుగా తమ సొంత కరెన్సీల్లోనే లావాదేవీలు నెరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023లో బ్రిక్స్ శిఖరాగ్రంలో ప్రతిపాదించారు. మరుసటేడాది బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment