నాటి బ్రిటన్ పాలకులపై భోపాల్ వ్యాపారి ఆరోపణ
తాత ఇచ్చిన అప్పు పత్రాలను సాక్ష్యంగా చూపిస్తున్న వ్యాపారి
సీహోర్(ఎంపీ): వారసత్వంగా తమకు దక్కాల్సిన ఆస్తులు, భవనాలు, వజ్రాభరణాలపై వారసులు న్యాయస్థానాల మెట్లెక్కడం మనం చూస్తూనే ఉంటాం. సబార్డినేట్ కోర్టుల మొదలు సుప్రీంకోర్టు దాకా ఇలాంటి కేసులు కోకొల్లలు. అవన్నీ వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్ తగాదాలు. వీటికి పూర్తి భిన్నంగా ఏకంగా ఆనాటి బ్రిటిష్ పాలకులపై మధ్యప్రదేశ్ వ్యాపారి ఒకరు 35,000 రూపాయల పాత బాకీ కట్టాలని ఇప్పుడు న్యాయపోరాటానికి సంసిద్ధమవుతున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో భారత్‌లోని సంపన్నుల నుంచి నాటి బ్రిటన్ ప్రభుత్వం కొంత మేర నగదు మొత్తాలను రుణాలరూపంలో సమీకరించింది. వాటిని తిరిగి చెల్లించేలోపే మనకు స్వాతంత్య్రంఇచ్చేసి వెళ్లిపోయింది. దీంతో తన తాతకు రావాల్సిన రూ.35వేలు అలాగే ఉండిపోయాయని, బ్రిటన్ ఇప్పటికైనా బాకీ తీర్చాల్సిందేనని సేఠ్ జుమ్మా లాల్ రూథియా మనవడు వివేక్ డిమాండ్‌చేస్తున్నారు.
అసలేం జరిగింది?
1914లో మొదలైన మొదటి ప్రపంచయుద్ధకాలంలో నిధుల కటకట నుంచి గట్టెక్కేందుకు బ్రిటన్ ప్రభుత్వం నాటి మధ్యప్రదేశ్ ప్రాంతంలోని సంపన్నుల నుంచీ రుణాలను తీసుకుంది. అప్పట్లో సీహోర్, భోపాల్ సంస్థానాల్లో సంపన్నులుగా ఖ్యాతి పొందిన రూథియాలు సైతం బ్రిటన్ పాలకులకు రుణాలు ఇచ్చారు. సేఠ్ జుమాలాల్ నుంచి భోపాల్ రాజకీయ ప్రతినిధిగా డబ్ల్యూ ఎస్ డేవిస్ రూ.35 వేలు పుచ్చుకున్నారు.
ఆ మేరకు రసీదు రాసి సంతకంచేసి ఇచ్చారు. 1917 జూన్ నాలుగోతేదీన ఈ అప్పు ఇచ్చినట్లు రసీదులో ఉంది. అప్పు ఇచ్చాక రెండు దశాబ్దాల తర్వాత 109 ఏళ్ల వయసులో 1937లో సేఠ్ చనిపోయారు. అప్పు పత్రం మాత్రం భద్రంగా ఉంది. ఇటీవలికాలంలో తమ ఇంట్లో పాత వస్తువులను దులుపుతుండగా ఈ అరుదైన పత్రం ఆయన మనవడు, ప్రస్తుతం భోపాల్‌లో పెద్ద వ్యాపారి వివేక్(65) కంటబడింది.
దీంతో ఎలాగైనా తన తాత ఇచ్చిన రుణాన్ని యూకే సర్కార్ నుంచి ముక్కుపిండి వసూలుచేస్తానని ఆయన శపథంచేశారు. ఈ మేరకు తన వద్ద ఉన్న అన్ని అనుబంధ డాక్యుమెంట్లనూ ఆయన మీడియా ముందుపెట్టారు. ‘‘ఇండియా వార్ లోన్ కోసం సేఠ్ నుంచి రూ.35వేలు ముట్టాయి. రుణమిచ్చి ఆయన ప్రభుత్వం, రాజ్యం పట్ల తన విధేయతను ప్రకటించుకున్నారు’’అని అప్పుపత్రంలో రాసి ఉంది.
‘‘వలసరాజ్యపాలనాకాలంలో నాటి పాలకులు తీసుకున్న రుణాలను ఏ విధంగా రాబట్టాలో మా లాయర్లతో చర్చిస్తున్నా. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వానికి నోటీస్‌లు పంపిస్తా. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా సార్వ¿ౌమదేశానికి పాత రుణాలను తీర్చే బాధ్యత ఉంటుంది. ఆ లెక్కన మా తాత డబ్బు మాకు తిరిగి ఇవ్వాల్సిందే. అప్పు ఇచ్చి వందేళ్లు దాటింది.
అసలుకు చక్రవడ్డీ లేదా కనీసం సాధారణ వడ్డీగా ఐదు శాతం లెక్కేసుకున్నా ఇప్పడా రుణం కోట్ల రూపాయల్లో ఉంటుంది. నాటి బంగారం రేట్లతో పోల్చుకున్నా సరే ఇప్పుడా మొత్తం 3,000 రెట్లు పెరిగి రూ.10 కోట్లుదాకా రావాల్సిందే’’అని వివేక్ అన్నారు. అయితే వివేక్ వాదన అంతర్జాతీయ చట్టాల్లో ఏ మేరకు చెల్లుబాటు అవుతుందనే సందేహాన్ని న్యాయనిపుణులు వెలిబుచ్చారు.
‘‘నాటి రాజరికం ఇప్పుడు లేదు. పాలకులూ మారిపోయారు. వలసరాజ్యంగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పును ఇప్పుడు ఏ నిబంధనల ప్రకారం బ్రిటన్ సర్కార్ చెల్లిస్తుంది? స్వాతంత్య్రం ఇచ్చాక పోతూపోతూ పాత ఒడంబడికలు, ఒప్పందాలు, హామీలతో మాకు సంబంధం లేదు అని బ్రిటిషర్లు చేతులు దులుపుకునే ఉండి ఉంటారు.
ఈ లెక్కన నాటి అప్పు నేడు రాబట్టడం కష్టం’’అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అప్పు రాకపోయినా శతాబ్దకాలంనాటి పురాతన పత్రంగాఅయినాఇది ఘన చరిత్రను చాటుతూ శాశ్వతంగా నిలిచి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పత్రం చరిత్రగా ఉండిపోతుందా లేదంటే అప్పు రాబట్టి కొత్త చరిత్ర లిఖిస్తుందా అనేది వివేక్ కొనసాగించే తదుపరి పోరుపై ఆధారపడి ఉంటుంది.


