చివరకు మిగిలింది.. రూ.18 వేల కోట్లు
► అప్పుల పంపిణీకి ఆఖరి పీటముడి
► రెండు రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన ఏజీ
► జనాభా ప్రకారం పంచాలన్న తెలంగాణ
► ఖర్చుల పద్దుల వారీగా పంచాలన్న ఏపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీ ఆఖరి దశకు చేరింది. చివరకు మిగిలిన రూ.18 వేల కోట్ల అప్పు పంచుకోవాల్సి ఉంది. అకౌంటెంట్ జనరల్ (ఏజీ) సూచన ప్రకారం రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖలు తమ ప్రతిపాదనలు, అభిప్రాయాలను వెల్లడించే గడువు మంగళవారంతో ముగి సింది. గడువుకు ముందుగానే తెలంగాణ ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనలను ఏజీకి పంపింది. జనాభా ప్రాతిపదికన ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం అప్పును పంపిణీ చేయాలని పేర్కొంది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో, ఏ అవసరానికి ఎంత ఖర్చు చేశారో లెక్కతీసి చట్ట ప్రకారం పంపిణీ చేయాలని ఏపీ ఆర్థిక శాఖ విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చటంతో ఏజీ సైతం ఈ వివాదాన్ని పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర విభజన ముందు వరకు సమైక్య రాష్ట్రానికి రూ. 1.78 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నాటికి కేంద్రం ప్రాథమికంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల వాటాలను పంపిణీ చేసింది. ఆడిట్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రూ.1.60 లక్షల కోట్ల అప్పుల పంపిణీ పూర్తయింది. మిగతా అప్పును జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేస్తే తెలంగాణకు రూ. 7,560 కోట్లు, ఏపీకి రూ.10,440 కోట్లు అప్పు మిగులుతుంది. ఏపీ ప్రతిపాదన ప్రకారం లెక్కగడితే.. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, భారీగా నష్టం వాటిల్లుతుందని ఆర్థిక శాఖ అప్రమత్తమైంది.
రూ.1.60 లక్షల కోట్లు పంపిణీ చేసేటప్పుడు వాటిని ఎక్కడెక్కడ.. వేటికి ఖర్చు చేశారనేది ఏజీ ఆరా తీయలేదు. కేవలం ఆడిట్ లెక్కల ఆధారంగా అప్పుల పంపిణీ జరిగింది. అంత భారీ మొత్తానికి భౌగోళిక ప్రాంతాలతో సంబ ంధం లేనప్పుడు.. మిగిలిన రూ.18 వేల కోట్ల కు ఈ నిబంధన ఎలా చెల్లుబాటవుతుందని తెలంగాణ వాదిస్తోంది. అది తమకు సమ్మతం కాదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విభజన వివాదాల పరిష్కార కమిటీ జోక్యం చేసుకుంటే తప్ప ఇది కొలిక్కి వచ్చేలా లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.