First World War
-
ఆలస్యంగా పశ్చాత్తాపం
చేసిన తప్పును గ్రహించినప్పుడు పశ్చాత్తాపపడటం, ఆ తప్పువల్ల బాధపడినవారికి క్షమాపణ చెప్పడం నాగరిక లక్షణం. అందుకు కాలపరిమితి వుండదు. దశాబ్దాలక్రితం జరిగినా, శతాబ్దాలక్రితం జరిగినా ఆ పని చేయాల్సిందే. బ్రిటన్ ఆలస్యంగానైనా అలా చేసింది. తన వలసలుగా మార్చుకున్న దేశాలనుంచి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలమంది సైనికులను బ్రిటన్ సమీకరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ యుద్ధానికి వెళ్లినవారు కొందరైతే... ప్రభుత్వ దాష్టీకానికి భయపడి వెళ్లినవారు మరికొందరు. సైనికులుగానే కాదు...సేవకులుగా, వంట మనుషులుగా, ఇంకా అనేకానేక ఇతర సేవల నిమిత్తం కూడా వెళ్లినవారున్నారు. 1914 జూలై 28న మొదలై ఆ ఏడాది నవంబర్ 11తో ముగిసిన ఆ యుద్ధంలో పాల్గొన్నవారు మొత్తంగా ఏడు కోట్లమంది వుంటారని అంచనా. వారిలో ఆరుకోట్లమంది పరస్పరం కలహించుకుంటున్న యూరోప్ దేశాలకు చెందినవారు కాగా, మిగిలినవారంతా ఆ దేశాల వలస పాలనలో చిక్కుకున్న వెనకబడిన దేశాలవారు. మరణించినవారిలో ఆనాటి అవిభక్త భారత్‌కు చెందిన దాదాపు 50,000మంది వున్నారు. ఇష్టంగానో, అయిష్టంగానో బ్రిటన్ పాలకుల ప్రయోజనాలను కాపాడే క్రమంలో బలైపోయినవారిపట్ల బ్రిటన్‌కు ఏమాత్రం గౌరవమర్యాదలు లేకుండాపోయాయి. తమ దేశస్తుల స్మతికి ఘన నివాళులర్పించేవిధంగా విడివిడిగా సమాధులు నిర్మించి, వారి వివరాలను శిలాఫలకాల్లో పొందుపరిచిన ఆనాటి బ్రిటిష్ రాజ్యం...వెనకబడిన దేశాలవారిని చిన్నచూపు చూసింది. వారందరినీ అనామకులుగా పరిగణించింది. మూకుమ్మడిగా ఒక శిలాఫలకంపై పేర్లు రాయించి వూరుకుంది. నిజానికి శిలాఫలకాలకూ నోచనివారు మరిన్ని వేలమంది వుంటారని అంచనా. ఈ వివాదం చాన్నాళ్లుగా నడుస్తున్నా ఏ ప్రభుత్వమూ తప్పిదాన్ని గుర్తించలేదు. వలసలు అంతరించి వేటికవి స్వతంత్ర రాజ్యాలుగా అవతరించినా...ఆ దేశాలపై బ్రిటన్ చిన్నచూపు పోలేదు. దాని జాత్యహంకారం జాడ చెరగలేదు. యుద్ధంలో నేలకొరిగినవారు శ్వేతేతరులైనంత మాత్రాన ఇలా చిన్నచూపు చూడరాదన్న ఇంగిత జ్ఞానం దానికి లేకపోయింది. ఆనాడు యుద్ధంలో ప్రాణాలర్పించిన వారిలో తూర్పు, పశ్చిమ ఆఫ్రికాలు, ఈజిప్టు, సోమాలియా దేశాలకు చెందినవారు కూడా వున్నారు. వీరందరినీ బ్రిటన్ ఒకే రకంగా అవమానించింది. బ్రిటిష్ పాలనపై 1857లో ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం జరగడానికి ముందూ వెనకా అనేకప్రాంతాల్లో తిరుగుబాట్లు తలెత్తడానికి బ్రిటిష్ పాలకుల దోపిడీ, జాత్యహంకార విధానాలే కారణం. ఈ చరిత్రను కప్పెట్టడానికి అనంతరకాలంలో బ్రిటిష్ ప్రభుత్వాలు అనేకవిధాల ప్రయత్నించాయి. తాము ఎదురు లేకుండా ఒకప్పుడు ప్రపంచాన్నేలామని, రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీయిజాన్ని మట్టి కరిపించామని ఆ దేశ పౌరులు నమ్ముతారు. వలస దేశాల్లో తమ పాలన సమస్తం పరపీడన పరాయణత్వమని, నాజీయిజాన్ని వీరోచితంగా ప్రతిఘటించి మట్టికరిపించింది ఆనాటి సోవియెట్ అనే సంగతి వారికి పెద్దగా తెలియదు. పాఠశాల విద్యనుంచీ అవాస్తవిక చరిత్రను బోధించడంతో తప్పుడు ఆధిక్యతా భావం ఆ సమాజంలో ఈనాటికీ కొనసాగుతోంది. అందుకే జాత్యహంకార దుర్గుణం అక్కడింకా పోలేదు. వాస్తవానికి యుద్ధంలో మరణించినవారందరినీ సమానంగా గౌరవించాలని 1917లోనే అనుకున్నారు. అందుకు ఒక కమిషన్ వేశారు. అయితే అప్పటి విదేశాంగమంత్రి చర్చిల్ అందరికీ ఉమ్మడిగా ఒక ఫలకం సరిపోతుందని సూచనలిచ్చారు. జాత్యహంకారం నరనరానా గూడుకట్టుకుని వున్న చర్చిల్ ఇలా చెప్పడంలో వింతేమీ లేదు. వేర్వేరు దేశాలనుంచి వచ్చిన సైనికుల వివరాలు తెలియకపోయి వుండొచ్చని కొందరు చేసిన వాదన వీగిపోయింది. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు కొందరు చెప్పిన మాటలను ఆనాటి ఆర్మీ అధికారులు రికార్డు చేశారు. తమ భౌతికకాయాలను దహనం చేసినా, ఖననం చేసినా తమకు అభ్యంతరం లేదుగానీ, శిలాఫలకంపై పేరు, ప్రాంతం వగైరా వివరాలు పొందుపరచాలని వారు కోరుకున్నారని రికార్డుల్లో బయటపడింది. అయినా ఇదే వివక్ష రెండో ప్రపంచయుద్ధంలో మరణించినవారిపట్ల కూడా కొనసాగించారు. ఆ రెండు యుద్ధాల్లోనూ మొత్తంగా 17 లక్షలమంది చనిపోగా, అందులో వలస దేశాల వారు గణనీయంగా వున్నారు. కామన్వెల్త్ గ్రేవ్స్ కమిషన్ పేరిట ఏర్పాటైన బృందం సమాధుల విషయంలో చూపిన వివక్షను ఎత్తిచూపగా ఇప్పుడు బ్రిటన్ దాన్ని ఆమోదించి, క్షమాపణలు కోరింది. నిజానికి గత తప్పిదాలు క్షమాపణ చెప్పినంత మాత్రాన మాసిపోవు. చరిత్రను మార్చటం కూడా అసాధ్యం. కానీ తమ వల్లగానీ, తమ పూర్వీకుల వల్లగానీ తప్పులు జరిగాయని తెలిసినప్పుడు వ్యక్తులకైనా, దేశాలకైనా అపరాథ భావం ఏర్పడుతుంది. అది సమూలంగా సమసిపోవాలంటే క్షమాపణ కోరడమే మార్గం. పూర్వీకులు చేసిన తప్పులకు తామెలా బాధ్యులమని ప్రశ్నించేవారూ లేకపోలేదు. కానీ వెనకటి తరాల తప్పులను గుర్తించటమంటే, అందుకు క్షమాపణలు చెప్పటమంటే అలాంటి అనాగరిక ధోరణులను పరిహరించుకోవటం... స్వీయ ప్రక్షాళన చేసుకోవటం... మనుషులుగా తమను తాము నిరూపించుకోవటం. వెనకటి తరాల సంపదనూ, జ్ఞానాన్ని అనుభవిస్తూ...వారి తప్పులకు మాత్రం తమ బాధ్యత లేదనడం అనాగరికం. అది ఆలస్యంగానైనా గ్రహించి బ్రిటన్ ప్రధాని క్షమాపణ కోరడం మంచిదే. -
వెలుగులోకి 100 ఏళ్లనాటి పావురాయి సందేశం
పారిస్: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సందేశాలు చేరవేయడంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయాలంటే మనుషులు వందల మైళ్లు ప్రయాణం చేసి అక్కడకి వెళ్లి సమాచారం తెలిపేవారుల. కానీ ప్రస్తుత కాలంలో కూర్చున్న చోట నుంచే సెకన్ల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలకైనా మెసేజ్‌ని పంపగల్గుతున్నాం. ఈ మెయిల్, వాట్సాప్, ఫేస్బుక్ ఇంకా రకరకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఓ వందేళ్ల క్రితం సందేశాలు పంపాలంటే పావురాలే ప్రధాన ఆధారంగా ఉండేవి. అప్పటికి పోస్టు సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికి కీలక సమాచారాన్ని చేరవేయడం కోసం పావురాల మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే దాదాపు వందేళ్ల క్రితం అంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటి పావురాయి సందేశం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తూర్పు ఫ్రాన్స్‌కు చెందిన ఓ జంట వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. వారికి ఓ చిన్న క్యాప్సిల్స్ కనిపించింది. వింతగా ఉండటంతో దాన్ని తెరిచి చూశారు. (చదవండి: పాకిస్తాన్ పావురం విడుదల) ఆశ్చర్యం.. అందులో ఓ చిన్న ఉత్తరం ఉంది. దాదాపు వందేళ్ల క్రితం ఓ ప్రష్యన్ సైనికుడు పావురం ద్వారా పంపిన సందేశం ఇది. కానీ దురదృష్టం కొద్ది అది తన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయింది. ఇక తూర్పు ఫ్రాన్స్‌లోని ఓర్బీలోని లింగే మ్యూజియం క్యూరేటర్ డొమినిక్ జార్డి మాట్లాడుతూ.. ‘ఇది మొదటి ప్రపంచ యుద్ధ (1914-10)కాలానికి చెందిన సందేశం. ఇంగర్‌షీమ్‌లోని ఒక పదాతిదళ సైనికుడు తన ఉన్నతాధికారిని ఉద్దేశిస్తూ జర్మన్ భాషలో స్వయంగా తన చేతితో రాసిన ఉత్తరం ఇది. దీనిలో అతడు కీలకమైన సైనిక విన్యాసాల గురించి వివరించాడు’ అని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఫ్రాన్స్‌లో భాగమైన ఇంగర్‌షీమ్ ఒకప్పుడు జర్మనీలో భాగంగా ఉండేది. ఇక ఈ ఉత్తరం ఈ ఏడాది సెప్టెంబర్‌లో సదరు దంపతుల చేతికి చిక్కింది. వారు దీన్ని జార్డికి అందించారు. అతడు ఓ జర్మన్ స్నేహితుడి సాయంతో ఈ మెసేజ్‌ని డీకోడ్ చేశాడు. ఇక ఈ ఉత్తరాన్ని అపూర్వమైనదిగా పేర్కొన్న జార్డి దాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాడు. -
వర్షంలో తడిస్తే నా జుట్టు పాడవుతుంది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇప్పడు ఆ నోటి దురుసు వ్యాఖ్యలే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన అమెరికా నౌకాదళ సైనికులను ఫ్రాన్స్‌లోని డబ్ల్యూడబ్ల్యూఐ స్మశానవాటికలో ఖననం చేశారు. ఆ సమాధులను చూడటానికి ట్రంప్ ఇష్టపడలేదని సమాచారం. అంతేకాక ‘ఓడిపోయిన వారు.. పిరికి పందలను నేను చూడనంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అట్లాంటిక్ పత్రిక గురువారం ఒక నివేదిక వెల్లడించింది. మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బెర్గ్ ఈ నివేదికను ప్రచురించారు. దాని ప్రకారం.. 2018 లో పారిస్ సమీపంలోని ఐస్నే-మార్న్ అమెరికన్ స్మశానవాటికను సందర్శించడానికి ట్రంప్ నిరాకరించారని, ఎందుకంటే ‘వర్షంలో తన జుట్టు చెడిపోతుందని ఆయన భయపడ్డాడు’ అని అధికారిక వివరణ. కానీ ట్రంప్ సహాయకులు మాత్రం వాతావరణం బాగాలేదని.. అందుకే హెలికాప్టర్ అక్కడికి వెళ్లలేదని తెలిపారు. సీనియర్ అధికారులతో మాట్లాడి తన పర్యటన వివరాలు తెలుసుకున్న ట్రంప్ ‘నేను ఎందుకు సశ్మాన వాటికను సందర్శించాలి. అక్కడ అంతా ఓడిపోయిన వారే ఉంటారు’ అని వ్యాఖ్యానించినట్లు ఆర్టికల్ పేర్కొన్నది. ఇదే పర్యటనకు సంబంధించి మరో సంభాషణలో ట్రంప్ చనిపోయిన 1,800 మంది నౌకాదళ వీరులను ఓడిపోయారు.. పిరికి వాళ్లు అని విమర్శించినట్లు ఆర్టికల్ వెల్లడించింది. అయితే ఈ కథనాన్ని ట్రంప్ టీం ఖండించింది. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడు ఈ కథనాన్ని చదివి ఎంతో బాధపడ్డారు. తప్పడు వార్తలను తీవ్రంగా ఖండించారు’ అని తెలిపారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలిస్సా ఫరా ఈ ఆరోపణలు అభ్యంతరకరమైనవి.. చాలా తప్పుడువి అన్నారు. అంతేకాక ట్రంప్ ప్రచార ప్రతికా కార్యదర్శి హోగన్ గిడ్లీ మాట్లాడుతూ.. ‘నేను అప్పుడు అధ్యక్షుడితో పాటే ఉన్నాను. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇవి పూర్తిగా పచ్చి అబద్దాలు. పిరికిపంద వ్యాఖ్యలు. కనుకనే వారు పేర్లు వెల్లడించలేదు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో వారికి తెలుసు’ అంటూ గిడ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కొందరు విమర్శకులు మాత్రం ఈ కథనాన్ని సమర్థిస్తున్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు దివంగత సెనేటర్ జాన్ మెక్కెయిన్ గురించే చేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. జాన్ వియాత్నంలో పట్టుబడ్డాడు. అతడిని యుద్ధ వీరుడిగా పరిగణిస్తారు. 2016 ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘జాన్ యుద్ధ వీరుడు కాదు. పట్టుబడ్డ వ్యక్తిని యుద్ధవీరుడు అనకూడదు. శత్రువుకు చిక్కని వారినే నేను ఇష్టపడతాను’ అంటూ వ్యాఖ్యానించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో1918 లో పారిస్ వైపు జర్మన్ పురోగతిని నిలిపివేసి, బెల్లీ వుడ్ వద్ద జరిగిన యుద్ధంలో సుమారు 1,800 అమెరికా నౌకాదళ సైనికులు మరణించారు. అట్లాంటిక్ ప్రకారం, ట్రంప్ తన ఫ్రాన్స్ పర్యటనలో ‘ఈ యుద్ధంలో మంచి వ్యక్తులు ఎవరు.. అసలు యునైటెడ్ స్టేట్స్ మిత్రరాజ్యాల సహాయానికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు’ అని తన సహాయకులతో వ్యాఖ్యానించినట్లు తెలిస్తోంది. -
‘వరల్డ్ వార్ వన్’ విస్మరించిన జర్మనీ
బెర్లిన్ : ‘జర్మనీ జీవించేందుకు మేము చనిపోయాం. జర్మనీ జీవించడంలో మేము బతికుంటాం’ అన్న నినాదం బెర్లిన్‌లోని కొలంబియాడామ్ శ్మశానంలో నేల కొరిగిన ఓ సైనికుడి విగ్రహం పక్కన రాసి ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఏడువేల మంది జర్మనీ సైనికులు సంస్మరణార్థం ఈ విగ్రహాన్ని 1925లో అప్పటి జర్మనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పిడికిలి మాత్రమే బయటకు కనిపించేలా బ్లాంకెట్ కప్పిన అమరసైనికుడి విగ్రహం నెత్తిన టోపీ, పక్కన తుపాకీ ఉన్నట్లుగా చెక్కిన ఈ రాతి విగ్రహం వద్ద మొదట్లో ప్రభుత్వ పెద్దలు, ప్రజలు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం అమర సైనికులను జర్మనీ దాదాపు విస్మరించింది. మొదటి సంవత్సరం యుద్ధం ముగిసి ఆదివారం నాటికి సరిగ్గా వందేళ్లు పూర్తియిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతోపాటు పారిస్‌లో వివిధ దేశాధినేతల సమక్షంలో భారీ ఎత్తున స్మారక కార్యక్రమాలు జరిగాయి. పారిస్ ఆహ్వానాన్ని అందుకున్నప్పటికీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. దేశంలో కూడా పెద్దగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఒక్క పార్లమెంట్ హాలులో స్మారక ఉపన్యాసంతో మొక్కుబడిగా నూరేళ్ల స్మారక దినాన్ని ముక్తిసరిగా ముగించింది. ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన నష్టం కంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువ నష్టం వాటిల్లడం. మొదటి ప్రపంచ యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధానికి కారణం కావడం కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా దేశం రాజరిక వ్యవస్థ నషించి రిపబ్లికన్ వ్యవస్థ ఏర్పడడం, ఆ రిపబ్లికన్ వ్యవస్థ నియంత హిట్లర్, నాజిజిం పుట్టుకకు కారణం అయింది. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి బెర్లిన్‌తోపాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారక భవనాలు, మ్యూజియంలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి అతి తక్కువ స్మారక మ్యూజియంలు ఉన్నాయి. కొలంబియాడామ్ శ్మశానంలోని అమర వీరుల సమాధాల వద్దగానీ, వారి స్మారక విగ్రహం వద్దకుగానీ పుష్మ నివాళులర్పించేందుకు ఈ మధ్య ఎవరూ రావడం లేదని స్థానికులు తెలిపారు. 2017లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలినా మార్కెల్ సైనిక స్మారక విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే ఈసారి ఆమె అక్కడికి కూడా పోలేదు. నాటి యుద్ధానికి కారణమైన దేశాల్లో జర్మనీ ఒకటి అవడమే కాకుండా ఆ యుద్ధంలో ఓటమిని అంగీకరించమనే ఆత్మన్యూనతా భావం వల్ల కూడా జర్మనీ నూరేళ్ల కార్యక్రమాన్ని పట్టించుకోక పోవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమం కోసం పలు దేశాలు ఏడాది ముందుగానే చరిత్రకారులతో, ఉన్నతాధికారులతో కమిటీలు వేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం, ప్రపంచంపై దాని ప్రభావం, ఫలితాలు అంశాలపై చరిత్రకారులతో పుస్తకాలు రాయించి ప్రచురించడంతోపాటు తమ దేశాల్లో పలు స్మారక భవనాలను కూడా నిర్మించాయి. సెమినార్లు, సదస్సులను నిర్వహించాయి. -
సమరం ముగిసి శతాబ్దం
పారిస్: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఆదివారానికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లు, రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్‌ల ప్రధానులు జస్టిన్ ట్రూడో, బెంజమిన్ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్‌లోని చాంప్స్–ఎలైసెస్‌లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. ఆదివారం మేక్రాన్ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్నోన్ సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు. ఫ్రాన్స్ జాతీయగీతంతో ప్రారంభం నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను చదివి వినిపించారు. అంతకుముందు ట్రంప్ చాంప్స్–ఎలైసెస్‌కు చేరుకుంటుండగా ఇద్దరు స్త్రీలు అర్ధనగ్నంగా వచ్చి ట్రంప్ వాహన శ్రేణికి అడ్డు తగిలి నిరసన తెలపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ స్త్రీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఫెమెన్ అనే బృందానికి చెందిన వారు. అనంతరం సంస్మరణ స్థలం వద్ద ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. మెర్కెల్‌తోపాటు పలు ఇతర నేతలతో కూడా చేయి కలిపిన ట్రంప్.. ట్రూడోను మాత్రం పట్టించుకోలేదు. కొన్ని నెలల క్రితం ట్రూడోను ‘నిజాయితీ లేని, బలహీన వ్యక్తి’గా ట్రంప్ విమర్శించడం తెలిసిందే. జాతీయవాదం వెన్నుపోటు వంటిది ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ..‘జాతీయవాదం వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు.. అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నివాళి భారత్‌తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘భారత్ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల పోరాడారు’ అని అన్నారు. ‘తొలి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాన్బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్‌లో రాణి ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య కరచాలనం -
చెదిరిన జీవిత చిత్రం
‘ద గర్ల్ యు లెఫ్ట్ బిహైండ్’ నవల మొదలయ్యేది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పటి 1916లో. ఫ్రెంచ్ చిత్రకారుడైన ఇద్వార్డ్, భార్య సోఫీ చిత్రాన్ని వేస్తాడు. యుద్ధానికి వెళ్ళి పట్టుబడినప్పుడు, జర్మన్ జైల్లో పెడతారు అతణ్ని. జర్మన్లు ఫ్రాన్సులో చిన్న పల్లెటూరైన, సెయింట్ పేహోన్ను ఆక్రమించుకుంటారు. అక్కడే సోఫీ కుటుంబం చిన్న హోటెల్ నడుపుతుంటుంది. ప్రతీ సాయంత్రం జర్మన్ క్యాంప్ కమాండంట్కూ, సిపాయిలకూ తినుబండారాలు, పానీయాలూ అందించవల్సిన పని తప్పించుకోలేకపోతుంది సోఫీ. కమాండెంట్‌ను మొదట సోఫీ చిత్రం ఆకర్షిస్తుంది. ఆ తరువాత సోఫీ. ‘నేను శత్రుసైన్యం వాడినన్న సంగతి మరచిపో. నువ్వు ప్రతి క్షణం ఆ సైన్యాన్నే ఎలా నష్టపరచాలా అని యోచిస్తున్న స్త్రీవని నేనూ మరచిపోతాను. మనం కేవలం ఇద్దరు మనుష్యులుగా మాత్రమే ఉందాం’ అని సోఫీకి సూచిస్తాడు. ‘ప్రతీ క్షణపు సారాన్నీ ఆస్వాదిస్తూ, అది రుచిగా ఉన్నందుకు సంతోషపడుతూ గడపాలి’ అని భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చిన సోఫీ– ఇద్వార్డును జైలునుండి విడిపించడం కోసం, కమాండంట్ షరతును ఒప్పుకుంటుంది. అనుకోకుండా జర్మన్ ఆర్మీ ఆమెను అరెస్ట్ చేస్తుంది. ఆ తరువాత ఆమె జాడ కనబడదు. రచయిత్రి జోజో మోయ్స్– కథను 90 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళి, నాలుగేళ్ళ కిందట భర్తను కోల్పోయిన, 33 ఏళ్ళ లండన్ నివాసి అయిన లివ్ వద్దకు చేరుస్తారు. పెళ్ళయిన కొత్తల్లో, భర్త ఆమెకు బహూకరించిన సోఫీ చిత్రమే లివ్ గోడమీద వేళ్ళాడుతుంటుంది. ‘కొన్నిసార్లు, జీవితం అడ్డంకుల వరుసలా కనిపిస్తుంది. మరొక అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది’ అనుకుంటూ జీవితం ఈడుస్తున్న స్త్రీ లివ్. దొంగిలించబడిన కళాఖండాలను వాటి హక్కుదారులకు అప్పగించే బాధ్యత తీసుకున్న అమెరికన్ అయిన పౌల్, పోలీసుగా పని చేసిన తరువాత, తన సొంత ఏజెన్సీ నడుపుతుంటాడు. ఇద్వార్డ్ కుటుంబం సోఫీ చిత్రం కావాలని కేసు పెట్టినప్పుడు, ఆ కేసు చూస్తున్నదే పౌలే. లివ్, పౌల్‌ను కలుసుకున్న తరువాత, జీవితం పట్ల ఆమె ఆశ తిరిగి చిగురిస్తుంది. ‘లోకం అంతం అయిందనుకున్నాను. తిరిగి ఎప్పుడూ మంచి జరుగుతుందని ఆశించలేదు. నేను ఇన్నాళ్ళూ ఎక్కువ తినలేకపోయాను. ఎవరినీ కలవాలని ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ బతుకంటే ఇష్టం ఏర్పడింది’ అని పౌలుకు చెప్తుంది. అయితే, చిత్రం గురించి తెలిసిన తరువాత వారిద్దరి సంబంధం బీటు పడుతుంది. ఇద్వార్డ్ వేసిన చిత్రాల ధర ఆకాశాన్ని అంటుతోందని తెలియని లివ్, చిత్రాన్ని వదులుకోనంటుంది. అది కమాండెంట్‌కు బహూకరించబడిందని తెలిసిన పౌలు, ‘కేసు గెలవడం కన్నా జీవితంలో మరెంతో ఉంది’ అనుకుని కేసు వదిలేస్తాడు. వాస్తవానికి– సోఫీ భర్తను కలుసుకుని స్విట్జర్లాండ్‌లో, అతనితో కలిసి సంతోషంగా జీవించిందని ఆఖర్న తెలుస్తుంది. సోఫీ దృష్టికోణంతో ఉన్న కథ హటాత్తుగా లివ్ జీవితానికి చేరిన తరువాత, చాలా త్వరగా– ముందుకీ వెనక్కీ నడుస్తుంది. సోఫీకి ఏమయిందన్న రహస్యాన్ని అన్వేషిస్తూనే, లివ్ వద్దనున్న చిత్రం గురించిన ఆసక్తిని హెచ్చిస్తుంటుంది. చిత్రాలను పూర్వస్థితీకరణ చేయడంలో ఉన్న సంక్లిష్టతలను విపులీకరిస్తుంది నవల. యుద్ధకాలంలో దొంగిలించబడిన కళాఖండాల గురించి చెప్తూ కూడా రచయిత్రి– వదంతులు నిజాలని ఎలా కప్పెడతాయో అన్న తన కథనం నుంచి దృష్టి మళ్ళించరు. ‘సరైన కారణాల కోసం ఏదైనా చేసినప్పుడు కూడా అది నమ్మకద్రోహమే అవుతుందా?’ అని కథ ప్రశ్నిస్తుంది. ప్రేమ, త్యాగం, కోల్పోవడం గురించిన పుస్తకంలో యుద్ధపు వివరాలు, అమానుష ప్రవర్తన, విశదమైన లైంగిక వివరాలు ఉంటాయి. వార్తా శీర్షికల వెనకనుండే వ్యక్తిగత కథలను కనబరిచే ఈ నవలను పెంగ్విన్ బుక్స్ 2014లో ప్రచురించింది. ‘సరైన కారణాల కోసం ఏదైనా చేసినప్పుడు కూడా అది నమ్మకద్రోహమే అవుతుందా?’ అని కథ ప్రశ్నిస్తుంది. కృష్ణ వేణి -
అదృశ్యమైన వందేళ్లకు వెపన్స్‌తో దొరికింది!!
సముద్రంలో మునిగిపోయిన ఓ ఓడను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందేళ్ల తర్వాత గుర్తించారు. ఆ సబ్ మెరైన్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా గుర్తించే స్థితిలో ఉండటం గమనార్హం. అందులోని ఆయుధాలు పాక్షికంగానే ధ్వంసమయ్యాయి. అయితే అప్పటి ఆయుధాలను ఇప్పుడు వాడటం కుదకరపోవచ్చునని ఈ ఓడను వెలుగులోకి తెచ్చిన స్కాట్లాండ్ పునరుత్పాదక ఇంధన సంస్థ తెలిపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైనికులు ఈ పెద్ద ఓడలో ప్రయాణించారు. ఇందులోని ప్రయాణించిన వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈస్ట్ ఆంగ్లియన్ తీరానికి 55 మైళ్ల దూరంలో నీటి కింద సుమారు వంద అడుగుల లోతులో ఉన్న ఈ 'యూ-బోట్' భాగాలను స్కాట్లాండ్ కు చెందిన సర్వే కంపెనీ బృందం గుర్తించారు. ఈ షిప్పును పేల్చివేయడంతో మునిగిపోయి ఉండొచ్చునని, 1915లో తొలి ప్రపంచ యుద్ధంలో భాగంగా ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. గ్రేటర్ లండన్ కంటే నాలుగు రెట్ల అధిక వైశాల్యం ఉన్న సముద్రజలాల్లో సుమారు రెండు సంవత్సరాల పాటు అన్వేషించి ఈ షిప్పును గుర్తించారు. మొదటగా దీనిని 1940, జూన్‌లో అదృశ్యమైన డచ్ మిలిటరీ సబ్ మెరైన్ అని భావించారు. చివరికి జర్మనీ సబ్ మెరైన్ 'యూ-31' అని నిర్ధారించుకున్నారు. జనవరి 13, 1915న జర్మనీ తూర్పు తీరంలో గస్తీకి వెళ్లిన ఈ నౌక మళ్లీ కనిపించలేదు. ఈ ఓడ శకలాలను గుర్తించడం నిజంగా చాలా ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని రేకెత్తించిందని స్కాట్లాండ్ పవర్ గ్రూపు ప్రాజెక్టు డైరెక్టర్ చార్లీ జార్డాన్ తెలిపారు. -
హిట్లర్ అలా బతికిపోయాడు
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అడాల్ఫ్ హిట్లర్ ఉత్త అనామక సైనికుడు మాత్రమే. మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ముగిసే దశకు చేరుకున్న సమయంలో ఒక ఇంగ్లిష్ సైనికుడు జాలి తలచడంతో హిట్లర్ ప్రాణగండాన్ని తప్పించుకున్నాడు. అలా బతికి బయటపడ్డ తర్వాత హిట్లర్ ఏ స్థాయికి చేరుకున్నాడో, రెండో ప్రపంచ యుద్ధకాలంలో జనాన్ని గడగడలాడించే నియంతగా ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలై దాదాపు నాలుగేళ్లు సాగింది. భారీ ప్రాణనష్టం తర్వాత 1918 ప్రారంభంలోనే యుద్ధం ముగింపు దశకు వచ్చిన విషయం ఉభయ వర్గాల సైనికులకూ దాదాపు అర్థమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రియా తరఫున యుద్ధంలో సైనికుడుగా పాల్గొన్న హిట్లర్ తీవ్రంగా గాయపడి, ఇంగ్లిష్ సైనికుడు హెన్రీ టాండేకు చిక్కాడు. హెన్రీ అతడికి తుపాకి గురిపెట్టాడు కూడా. అయితే, క్షతగాత్రుడిని చంపడానికి మనస్కరించక విడిచిపెట్టేశాడు. ఎక్కువ మందికి తెలియని ఈ సంఘటనే చరిత్రను మలుపు తిప్పింది. తాను జాలితలచి విడిచిపెట్టిన క్షతగాత్రుడు నియంతగా మారి తలపెట్టిన హింసాకాండను తెలుసుకున్నాక హెన్రీ టాండే జీవితాంతం అపరాధ భావనతో బాధపడ్డాడు. -
మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు
-
మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు
హైదరాబాద్: మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914 - నవంబర్ 11, 1918) ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్దం ముగిసి రేపటికి 96 సంవత్సరాలు కానుంది. ఈ సందర్భంగా ఆనాటి అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం స్మరించుకోనుంది. చాదర్‌ఘాట్‌లోని మొదటి ప్రపంచ యుద్ధం స్మారక స్థూపం వద్ద రేపు శుక్రవారం ఆధికారికంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్, ప్రాన్స్, జర్మనీ కౌన్సిల్ జనరల్స్ పాల్గొంటారు. మొదటి ప్రపంచం యుద్ధంలో 15 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. యుద్దంలో 75వేల మంది సైనికులు కన్నుమూశారు. ** -
ఐ బెగ్ యూ.... ప్లీజ్ స్టాప్...
వాటికన్ సిటీ : మొదటి ప్రపంచ యుద్ధం జరిగి నేటికి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గతకాలపు తప్పులను పునరావృతం చేయవద్దంటూ ప్రపంచ ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. సంఘర్షణలను అధిగమించడానికి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వాసుల మధ్య జరుగుతున్న పోరు, ఇరాక్, ఉక్రెయిన్‌లో యుద్ధాలను ఆయన ప్రస్తావించారు. ఆయన ఆదివారం సెయింట్ పీటర్ స్కేర్ వద్ద యాత్రికులు, భక్తులతో మాట్లాడారు. యుద్ధం కారణంగా చనిపోయిన చిన్నారులు, అనాథలైన పిల్లల గురించి తాను ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. చిన్నారులకు యుద్ధం శిథిలం ఒక ఆటవస్తువుగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. యుద్ధాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటి ప్రపంచయుద్ధాన్ని అనవసర మారణకాండగా పోప్ బెనెడిక్ట్ 15 ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. -
ఒక్క బుల్లెట్ ప్రపంచ చరిత్రనే మార్చేసింది!
వందేళ్ల కింద పేలిన ఒక్క బుల్లెట్ ప్రపంచచరిత్రను మార్చేసింది. నాలుగేళ్లు ప్రపంచమంతా రణసీమగా మారిపోయింది. లక్షల మంది చనిపోయారు. అవును... సరిగ్గా ఇదే రోజు అంటే జూన్ 28, 1914 న ఒక 19 ఏళ్ల కుర్రాడు పేల్చిన తుపాకీ మొదటి ప్రపంచయుద్ధానికి దారితీసింది. సెర్బియాకి చెందిన గావ్రిలో ప్రిన్సిప్ అనే జాతీయ వాది ఆస్ట్రియా ప్రభువు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీలను కాల్చి చంపాడు. ఈ సంఘటన బోస్నియా రాజధాని సరయేవోలో జరిగింది. బోస్నియాకు ఆస్ట్రియా నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుతూ వారీ కాల్పులు జరిపారు. నలుగురు బోస్నియన్ యువకులు ప్రభువును చంపేందుకు పథకం వేశారు. ఫెర్నినాండ్ ఓపెన్ టాప్ జీపులో, పూర్తి సైనిక వేషధారణలో ఊరేగుతుండగా నలుగురు యువకులు ఆయనపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో ముగ్గురు చివరి నిమిషంలో భయపడి బాంబులు వేయలేదు. నెడెల్కో కాబ్రినోవిచ్ అనే నాలుగో వ్యక్తి బాంబు వేశాడు. కానీ అది ఫెర్డినాండ్ కారుకి తగిలి కింద పడిపోయింది. ఆయనకు గాయాలు కాలేదు కానీ చాలా మంది ప్రజలు గాయపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారిని చూసేందుకు ఫెర్డినాండ్ మరో కారులో బయలుదేరాడు. అదే సమయంలో డ్రైవర్ దారి తప్పి ఒక ఇరుకు సందులోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ తుపాకీతో నిలబడి ఉన్న గావ్రిలో ప్రిన్సిప్ కి గోల్డెన్ చాన్స్ వచ్చింది. ఒక బుల్లెట్ తో ఫెర్డినాండ్ గొంతు చీల్చేశాడు, రెండో బుల్లెట్ తో సోఫీని కాల్చేశాడు. దీంతో ఆస్ట్రియా బోస్నియాపై యుద్ధం ప్రకటించింది. అక్కడి నుంచే రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి దేశాలన్నీ యుద్ధంలోకి దిగాయి. ఈ యుద్ధంలోనే తొలి సారి ట్రెంచ్ వార్ ఫేర్ మొదలైంది. ఈ యుద్ధం ప్రపంచ చరిత్రను, ప్రపంచ చిత్రపటాన్ని మార్చేసింది. శనివారం మొదటి ప్రపంచ యుద్ధం మొదలై వందేళ్లు పూర్తయింది. -
వర్ణం : అందాల భరిణెలు
సినిమా తర్వాత అందం తొలి కొలమానంగా తీసుకునే వృత్తి ఎయిర్ హోస్టెస్. ఈ చిత్రం చూస్తే ఇంకో సాక్ష్యం కూడా అక్కర్లేదు. చైనాలో జరిగిన పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ అతిథులకు వీరు స్వాగతం పలకడానికి వచ్చారు. ఈ ప్రభుత్వ సంస్థ చైనాను వేధిస్తున్న అవినీతి, ఆర్థిక వృద్ధి రేటు మందగమనం, సరిహద్దు దేశాలతో సమస్యల గురించి చర్చించింది. ఘోరకలికి వందేళ్లు ఇది చారిత్రక ప్రదేశం ‘క్రిటె డి విమి’. ఫ్రాన్స్‌లో ఉన్న ఈ ప్రదేశం మొదటి ప్రపంచ యుద్ధం చరిత్ర పుటల్లో నమోదై ఉంది. ప్రస్తుతం ప్రముఖ వారసత్వ సంపదగా, చారిత్ర పర్యాటక ప్రదేశంగా పర్యాటకుల మనసులను దోచుకుంటోంది. మొదటి ప్రపంచ యుద్ధం (1914) మొదలై ఈ ఏడాదితో వందేళ్లు కావడంతో అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆడుకునేవి కావు తినేవి ముచ్చటగా ఉన్న ఈ బొమ్మలు రుచిగా ఉంటాయి. ఈ బొమ్మల్ని ఎలా తినాలని ఆలోచిస్తున్నారా... అవి బొమ్మల రూపంలోని కేకులు. తైపే నగరంలో జరుగుతున్న తైపే ఇంటర్నేషనల్ బేకరీ షో సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలోని దృశ్యమిది. ఈ సందర్భంగా నిర్వహించిన వరల్డ్ పాస్ట్రీ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఓ షెఫ్ ఈ బొమ్మ కేకులను తయారుచేశారు. ‘కీ’లు బొమ్మ కాదు ముద్దుగుమ్మ ప్రపంచ ప్రఖ్యాత ప్యాషన్ గారెత్ సృష్టించిన డ్రెస్ ఇది. పారిస్‌లో జరిగిన వింటర్ కలెక్షన్ ఫ్యాషన్ షోలో ఓ ముద్దుగుమ్మ ఇలా ‘కీ’ ఆకారం కలిపి డిజైన్ చేసిన డ్రెస్సును వేసుకుని అందరినీ ఆకట్టుకుంది. -
సంగ్రామం : యుద్ధభూమిలో ఒలికిన సిరా!
కలం... మెదడుకి నాలుక వంటిదంటాడో ప్రాచీన రోమన్ కవి. కానీ తన కంటె తుపాకీ గొప్పదని మెదళ్లు భావిస్తే...? కలం ఆ తుపాకీకే నాలుకగా మారిపోగలదు. మొదటి ప్రపంచ యుద్ధం వేళ జరిగింది ఇదే. ఫలితం- కలం సైనిక భాషను నింపుకుంది. యుద్ధ దేవతను ఆవాహన చేసింది. సామాజిక సంఘర్షణలలో, అంతర్యుద్ధాలలో కవులూ, మేధావులూ బాధితుల వైపు నిలబడడం సహజ పరిణామం. కానీ సామ్రాజ్యాల మధ్య రగడ మీద, పాలక వంశాల నడుమ కక్షల మీద కవులూ రచయితలూ భ్రమలు పెంచుకోవడం ఆ కాలానికి సంక్రమించిన అంధత్వానికి గుర్తు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ చేసిన తొలి దాడి బెల్జియం(ఆగస్టు 4,1914) మీదే. యుద్ధ క్రీడ మరింత వికృతం కాబోతోందని ఆ దాడి సంకేతించింది. స్త్రీ, బాల, వృద్ధ గణాలను యుద్ధ బాధకు దూరంగా ఉంచాలని పాత నీతి. కానీ వయో భేదం లేకుండా జాతిలో ప్రతి ఒక్కరినీ యుద్ధంతో మమేకం చేయాలన్న దుగ్ధ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఐరోపా దేశాలలో కనిపిస్తుంది. యుద్ధం మొదలయ్యే వేళకే జర్మనీలో ఒక యుద్ధ ప్రచార విభాగం చురుకుగా పని చేస్తున్నదన్న సంగతి ఇంగ్లండ్‌కు తెలిసింది. వెంటనే ఆర్థిక కార్యదర్శి డేవిడ్ లాయిడ్ జార్జి... ఇలాంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసే పనిని లిబరల్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, పెద్ద పత్రికా రచయిత చార్లెస్ మాస్టర్మన్ (1873-1927)కు అప్పగించాడు. లండన్‌లోని వెల్లింగ్డన్ హౌస్ కేంద్రంగా మాస్టర్మన్ సెప్టెంబర్ 2,1914న తన పని ప్రారంభించాడు. ఇంగ్లండ్‌కు గొప్ప సారస్వత వారసత్వం ఉంది. జర్మనీకి విస్తారమైన జానపద, పురాణ సంపద ఉంది. వాటిని ఆ రెండు దేశాలూ ఉపయోగించుకున్నాయి. నిజానికి జర్మనీకి యుద్ధ ప్రచారం అవసరం లేదు. సైన్యంలో పనిచేయడం అక్కడి పౌరులందరి విధి. యాభయ్ సంవత్సరాలు నిండే లోపున ప్రతి పౌరుడు యుద్ధంలో ఏదో ఒక కాలంలో కనీసం మూడేళ్లు పని చేయాలి. యుద్ధం ఆ దేశానికి ఒక కుటీర పరిశ్రమ. అయినా డ్రాగన్, రెక్కల గుర్రం వంటి పురాణ ప్రతీకలను ఉపయోగించుకుని జర్మనీ కూడా పెద్ద ఎత్తున యుద్ధ ప్రచారం చేసింది. దీనికి తోడు సంచార సినిమాలతో విస్త్రతంగా ప్రచారం చేసింది. విదేశాలలో, ముఖ్యంగా అమెరికా, కెనడాలలో ఉన్న జర్మన్లు గూఢచర్యం ద్వారా దేశానికి సాయపడాలని భావించారు. బ్రిటన్‌లో యుద్ధ ప్రచార విభాగం ఏర్పాటు చేశాక మాస్టర్మన్ చేసిన మొదటి పని - ఇరవై అయిదుగురు ఇంగ్లిష్ రచయితలతో ఒక సమావేశం నిర్వహించడం. నాడూ నేడూ కూడా ప్రపంచ సాహిత్యం మహనీయులుగా పరిగణిస్తున్న ఉద్దండులు- రడ్యార్డ్ కిప్లింగ్ (1865-1936), సోమర్సెట్ మామ్ (1874-1965), ఆర్థర్ కానన్ డాయ్ల్ (1859-1930), హెచ్‌జీ వెల్స్ (1866-1946), జీకే చెస్టర్సన్ (1874-1936), జీఎం ట్రెవీలియన్ (1876-1962), విలియం ఆర్చర్ (1856-1924), హెచ్‌జే న్యూబాల్ట్ (1862-1938), జాన్ మేస్‌ఫీల్డ్ (1878-1967), ఫోర్డ్ మ్యాడాక్స్ ఫోర్డ్ (1873-1939), జాన్ గాల్స్వర్థీ (1867-1933), ఆర్నాల్డ్ బెనెట్ (1867-1931), గిల్బెర్ట్ పార్కర్ (1862-1932) వంటివారు మాస్టర్మన్ పిలుపును మన్నించినవారే. వీరిలో కిప్లింగ్ ముంబైలోనే పుట్టాడు. ఆయన ‘జంగిల్‌బుక్’ ఇప్పటికీ హాట్‌కేక్. భారతీయ సమాజం నేపథ్యంగా ఎన్నో రచనలు చేశాడు. 1906లో సాహిత్యంలో నోబెల్ బహుమానం స్వీకరించాడు. తరువాత గాల్స్వర్థీకి (1932) ఆ పురస్కారం వచ్చింది. విలియం ఆర్చర్ గురించి కూడా చెప్పుకోవాలి. నార్వేజియన్ మహా రచయిత హెన్రిక్ ఇబ్సన్ను ఇంగ్లిష్‌వారికి పరిచయం చేసిన ఘనత ఆర్చర్‌దే. ‘ఎడింబరో ఈవెనింగ్ న్యూస్’ పత్రికకు సంపాదకీయాలు రాసిన ఆర్చర్, ఇబ్సన్ ప్రపంచ ప్రఖ్యాత నాటకం ‘ఎ డాల్స్ హౌస్’ను ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. ఇబ్సన్ ఇతర రచనలు ‘ద పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’, ‘ద మాస్టర్ బిల్డర్’ వంటి రచనలను కూడా ఆంగ్లంలోకి అనువదించాడు. ట్రెవీలియన్ ప్రధానంగా చరిత్రకారుడు. రచయిత కూడా. యుద్ధాన్నీ, యుద్ధంలో ఇంగ్లండ్ పాత్రనీ సమర్థిస్తూ వీరు చేసిన రచనలను హాడర్ అండ్ స్టౌటన్, మెథూయున్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, జాన్ ముర్రే, మేక్మిలన్, థామస్ నెల్సన్ సంస్థలు అచ్చువేసేవి. అప్పటికే ఐరోపాలో ఎంతో ఖ్యాతి గాంచిన చిత్రకారుడు, డచ్ దేశీయుడు లూయీస్ మేయీకర్ ఈ రచనలకు బొమ్మలు వేసేవాడు. 1918 వరకు వీరు మొత్తం 1160 రచనలు చేశారు. బ్రిటిష్ వార్ ప్రోపగాండా బ్యూరో తన తొలి పత్రాన్ని 1915 ఆరంభంలో వెలువరించింది. ఇది బెల్జియంలో జర్మనీ చేసినట్టు చెబుతున్న అత్యాచారాల గురించి వివరించింది. ‘ఆయుధం ఎత్తు!’ (ఆర్థర్ కానన్ డాయ్ల్), ‘బెర్లిన్‌లో పైశాచకత్వం’ (చెస్టర్సన్), ‘కొత్త సైన్యం’ (కిప్లింగ్), ‘నెత్తురే వాళ్ల వాదన అయినప్పుడు!’(ఫోర్డ్ మాడాక్స్ ఫోర్డ్) వంటి కరపత్రాలు అప్పుడు వచ్చాయి. రచయితలతో పాటు బ్రిటిష్ కళాకారులు కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. వీరి సేవలు యుద్ధంలో ఉపయోగించుకోవడానికి ఏర్పడినదే ఆర్టిస్ట్స్ రైఫిల్.1859లో ఈ దళం ఏర్పాటు యోచనకు బీజం పడింది. మూడో నెపోలియన్ దండెత్తితే జాతికి చెందిన కళాకారులు సయితం ఎదురొడ్డి నిలవాలన్న నినాదంతో ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధకాలానికి బాగా విస్తరించింది. మార్స్ (యుద్ధ దేవత), మినర్వా (జ్ఞానదేవత) తలలతో ఈ దళం ఒక ముద్రికను తయారు చేసుకుంది. 1900 సంవత్సరానికి ఈ దళ ం 12 కంపెనీలుగా విస్తరించింది. తొలి సంవత్సరాలలో ఎక్కువగా చిత్రకారులు, శిల్పులు, ఎన్గ్రేవర్స్, వాస్తు శిల్పులు, నటులు, సంగీత విద్వాంసులు ఉండేవారు. విలియం మోరిస్, ల్యూక్ ఫీల్డెస్, చార్లెస్ కీనే, జాన్ లీచ్, అల్ఫ్రెడ్ లీటే (గ్రాఫిక్స్ డిజైనర్) వంటివారు ఈ దళం తరఫున యుద్ధం చేశారు. పాల్ నాష్, జాన్ నాష్, వింథామ్ రాబిన్సన్, యూజిన్ బెనెట్ కూడా ఈ దళంలోనే పని చేశారు. వీళ్లు ఎక్కువగా శిక్షణ కేంద్రాలలో ఉండేవారు. తేలిక పాటి ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ పొందేవారు. ‘బ్రిటన్ నిన్ను పిలుస్తోంది!’ అంటూ యుద్ధ కార్యదర్శి కిష్నర్ బొమ్మతో రూపొందించిన ప్రఖ్యాత వాల్‌పోస్టర్‌ను రూపొందించిన వాడే అల్ఫ్రెడ్ ఆంబ్రోస్ షూ లీటే (1882-1933). ఆర్టిస్ట్స్ రైఫిల్స్ దళంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి 15,022 మంది అధికారుల స్థాయి వారు ఉండేవారు. వీరిలో 2,003 మంది ఆ యుద్ధంలో చనిపోయారు. అంటే అంతమంది కళాకారులు యుద్ధంలో కన్నుమూశారు. గ్రేట్‌వార్‌లో చెప్పుకోదగిన మరొక విభాగం- సాహిత్యవేత్తలతో ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్ల దళం. అప్పటికీ, అనంతర కాలాలలో ప్రపంచ ప్రఖ్యాతులైన రచయితలంతా పని చేసిన దళమిదే. ఎర్నెస్ట్ హెమింగ్వే, జాన్ దాస్ పాసోస్, ఇఇ కమ్మింగ్స్, వాల్ డిస్నీ వంటివారు ఈ దళంలో చేరారు. వయసు తక్కువ కావడం, లేదా వయసు మీరడం, ఇతర లోపాల వల్ల సైన్యానికి ఎంపిక కాలేకపోయిన వారే ఇందులో ఎక్కువ. ఇలాంటి వారు దాదాపు 23 మంది. జ్టైడ్ స్టీన్, ఈఎం ఫ్రాస్టర్ కూడా ఇందులో ఉన్నారు. విద్యావంతులు, రచయితలు ఇలా డ్రైవర్లుగా పాల్గొనడం రష్యా-జపాన్ యుద్ధం (1905)లో కనిపిస్తుంది.హెమింగ్వే, వాల్ట్ డి స్నీ అమెరికా రెడ్ క్రాస్ తరఫున పాల్గొన్నారు. ప్రచార విభాగంలో ఉన్నప్పటికీ యుద్ధరంగంలో ప్రత్యక్షంగా పాల్గొన దలిచిన వారు కూడా అంబులెన్స్ డ్రైవర్లుగా పని చేశారు. అందుకు ఉదాహరణ- జీఎం ట్రెవీలియన్. ఎన్నో హాస్య రచనలు చేసిన మామ్ సైనికునిగా ఎంపిక కాలేకపోయాడు. కారణం - అప్పటికి ఆయన వయసు నలభయ్ సంవత్సరాలు. దానితో అంబులెన్స్ డ్రైవర్‌గా యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యాడు. చిత్రంగా యుద్ధ ప్రచార విభాగంలో పని చేసిన మహా రచయితల పేర్లు రహస్యంగా ఉంచారు. 1935 తరువాత గానీ ఈ సంగతి వెలుగు చూడలేదు. యుద్ధం ముగిశాక వాళ్లలో వచ్చిన మార్పు, జీవితాల మీద అది వేసిన ముద్ర, వాళ్ల కుటుంబాలకు పంచిన విషాదం మళ్లీ ఓ పెద్ద గ్రంథం. - డా॥నారాయణరావు -
సంగ్రామం: బారులు తీరిన అబద్ధాలు
‘యుద్ధంలో చేరండహో!’ అని పోలీసు, మిలటరీ బ్యాండ్లు మోగిస్తూ ఊరేగింపులు జరిగాయట. క్రొయడాన్లోనే మిష్రామ్ రోడ్డులో ఉన్న బ్యారెక్స్‌కు వెళ్లాడు కూపర్డ్. వేల సంఖ్యలో, కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నారు జనం. తీరా, ‘‘పందొమ్మిదేళ్లు రావాలి! రేపు రా! వస్తాయేమో!’’ అన్నాడట సార్జెంట్. ‘అబద్ధాలాడే అబ్బాయిలు ఎక్కడికి వెళతారో తెలుసా?’ వ్యంగ్య చిత్రంలో సైనికాధికారి అడుగుతున్న ప్రశ్న. ఇందుకు ఆ బాలుడి సమాధానం- ‘ఫ్రంట్కే సార్!’ మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల ఎంపిక తీరుతెన్నులు ఎంతటి ప్రహసన ప్రాయమో చెప్పడానికి ‘పంచ్’ కార్టూన్ పత్రిక (1841-2002) ప్రచురించిన (ఆగస్టు 11, 1916) ఈ ఒక్క కార్టూన్ చాలు. ఎఫ్.హెచ్. టౌన్సెండ్ గీసిన ఆ వ్యంగ్య చిత్రం ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నాటి ఇంగ్లండ్ యుద్ధ కండూతికి గీటురాయి. అబద్ధాలాడితే నరకానికి పోతారన్న నీతిని బోధించడం ఆ అధికారి ఉద్దేశం. తన వయసు 13 సంవత్సరాలయితే, ఆ కుర్రాడు పదహారు అని అబద్ధం ఆడాడు. అప్పటిదాకా అక్కడ జరిగినదంతా అబద్ధాల కవాతే. దానిని బట్టి ఆ కుర్రాడు, సార్జెంట్ ప్రశ్నకు జవాబుగా నరకం అని చెప్పకుండా, ‘ఫ్రంట్కే సార్!’ అన్నాడు. ఫ్రంట్ అంటే, వెస్ట్రన్ ఫ్రంట్. బెల్జియం- ఫ్రాన్స్ దేశాల మధ్య దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల యుద్ధభూమి. నిజానికి వెస్ట్రన్ ఫ్రంట్ నరకానికి నకలేనని కొద్ది రోజుల్లోనే సైనికులందరికీ అనుభవానికి వచ్చింది. బ్రిటిష్ సైన్యంలో చేరడానికి నిబంధనలు కఠినంగా ఉండేవి. ఐదడుగుల ఆరు అంగుళాల పొడవు తప్పనిసరి. ఛాతీ చుట్టుకొలత 35 అంగుళాలు ఉండాలి. పద్దెనిమిది నిండితేనే సైన్యానికి ఎంపిక చేసేవారు. కానీ విదేశాలలో జరిగే యుద్ధానికి వెళ్లాలంటే పందొమ్మిదేళ్లు తప్పనిసరి. మోన్స్ యుద్ధంలో ఇంగ్లండ్ పలాయనం తరువాత ఎంపిక నిబంధనలన్నీ సడలిపోయాయి. ఐదడుగుల ఆరు అంగుళాలు కాస్తా, ఐదూ మూడుకూ, ఆ పై ఐదడుగులకూ కుదించారు. వీళ్లనే బంటామ్ దళం అనేవారు. అంటే పొట్టివాళ్ల సైన్యం. కనీస వయో పరిమితిని పందొమ్మిదేళ్ల నుంచి పదిహేనుకు తగ్గిం చారు. గరిష్ట వయో పరిమితి 40 సంవత్సరాలకి పెంచారు. ఇన్ని సడలింపులతో కొత్తగా ఐదు లక్షల మందిని చేర్చుకున్నారు. యుద్ధ కార్యదర్శి హెచ్ హెచ్ కిష్నర్ లక్ష్యం పూర్త యింది. ఏడు లక్షలున్న ఇంగ్లండ్ సైన్యం అప్పటికి పదమూడు లక్షలకు చేరింది. కవులు, చిత్రకారులు, ఆటగాళ్లు ఎవరూ బయట మిగలలేదు. ఒక్కొక్క దళం పేరుతో యుద్ధంలో చేరారు. ఆర్టిస్ట్స్ రైఫిల్స్ ఇందుకు మంచి ఉదాహరణ. ఆగస్టు 4, 1914న జర్మనీ మీద ఇంగ్లండ్ యుద్ధం ప్రకటించి, మొదటి ప్రపంచ యుద్ధంలో అడుగు పెట్టింది. తటస్థ దేశం బెల్జియం మీద జర్మనీ దాడిని ఖండిస్తూ ఇంగ్లండ్ ఆ దేశం మీద యుద్ధం ప్రకటించింది. కానీ ఆగస్టు 14నే జర్మనీ, ఇంగ్లండ్ సేనలు మొదటిగా మోన్స్లో తలపడ్డాయి. ఇంగ్లండ్ మొదటి అడుగే తడబడింది. దీనితో ఆ జాతి కుంగిపోయింది. దీనికి తోడు పోస్టర్లు, తెల్ల ఈకలతో కుర్రాళ్లు సొంతూళ్లలో ఉండడానికి భయపడిపోతూ సైనిక ఎంపిక కేంద్రాల వైపు పరుగులు తీశారు. 1914 సెప్టెంబర్ మొదటి వారంలోనే ఇంగ్లండ్‌లో రెండు లక్షల మంది సైన్యంలో చేరిపోయారు. ఒక్క లండన్ నగరంలోనే 21,000 మంది చేరారు. నిజానికి శాంతి వేళ ఒక సంవత్సరానికి ఇంగ్లండ్‌లో 25,000 నుంచి 30,000 మందిని చేర్చుకునేవారు. బ్రిటన్ వలస దేశాలలో కూడా ఈ హడావుడి నియామకాలు జరిగాయి. ఆస్ట్రేలియా, కెనడా, భారత్‌లలో ఇది చూడొచ్చు. భారతదేశంలో పంజాబ్ మొదటి ప్రపంచ యుద్ధం మీద మోజు పెంచుకుని, శ్వేత పాలన పట్ల వీరభక్తిని ప్రదర్శించింది. 1910 ప్రాంతానికి 69,458 మంది పంజాబీలు బ్రిటిష్ ఇండియా సైన్యంలో పని చేస్తున్నారు. ఈ సంఖ్య యుద్ధారంభానికి 3,62,027కు (రెండు కోట్ల జనాభాలో 1.8 శాతం) చేరుకుంది. ఇలాగే దేశమంతా ప్రత్యేక నియామకాలు జరిగాయి. ఆ యుద్ధం కోసం ఫ్రాన్స్‌కు 1,38,000, మెసపటోమియాకు 6,75,000 మంది, ఈజిప్ట్‌కు 1,44,000 మంది భారత సైనికులు వెళ్లారు. ఇంగ్లండ్ చేర్చుకున్న ఐదు లక్షల మంది స్వచ్ఛంద సైనికులలో సగం మంది బాలురే. ఇంగ్లండ్‌లోనే కాదు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీలలో కూడా పెద్ద సంఖ్యలో బాలురు చేరారు. ఇంగ్లండ్ బాలలు ఎలాంటి అబద్ధాలు చెప్పారో తరువాత వారు రాసుకున్న లేఖలతో, జీవిత చరిత్రలతో, ఆ సైనికుల కుటుంబ సభ్యుల ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. పిల్లలు చెబుతున్నది పచ్చి అబద్ధమని సైనికాధికారులకి పూర్తిగా తెలుసు. హ్యారీ పాచ్ అనే అబ్బాయి ఎంపిక కేంద్రానికి వెళ్లాడు. వయసు అడిగితే చటుక్కున ‘పదహారు’ అని నిజం చెప్పేశాడు. దీనితో ఎంపిక అధికారి, ‘పద్దెనిమిది నిండాక మళ్లీ రా!’ అని చెప్పి పంపేశాడు. అలాగే వచ్చాడు పాచ్- అదే క్యూలో వెనుక నిలబడి. పద్దెనిమిదేళ్లు అని చెబితే, వెంటనే అదే అధికారి చేర్చుకున్నాడు. టామీ గ్రే అని మరో బాలుడి అనుభవం ఇంకా నవ్వు తెప్పిస్తుంది. పదహారేళ్ల టామీ తడుముకోకుండా ‘పద్దెనిమిది’ అని చెప్పాడు. దానికి అధికారి, ‘సైన్యంలో చేరేవాళ్లు ఎలా ఉండాలని మేం అనుకుంటామో, అలాగే ఉన్నావ్!’ అంటూ ఎంపిక చేసుకున్నాడు. ఇలా ఎంపికై యుద్ధరంగానికి వచ్చిన బాలురలో అతి పిన్న వయస్కుడు జార్జి మాహెర్. ఇతడి వయసు కేవలం పదమూడేళ్లు. సొమ్మె అనే చోట జరిగిన ఒక యుద్ధంలో ఇతడు పాల్గొ న్నాడు. నిజానికి, హోరెస్ అనే ఇంకో బాలుడి రికార్డుని బద్దలుకొట్టి మాహెర్ చరిత్రలో నిలిచాడు. హోరెస్ వయసు పద్నాలుగేళ్లే. మాహెర్ తన 91వ ఏట 1999లోనే కన్నుమూశాడు. 1917లో రాయల్ లాంకాస్టర్ రెజిమెంట్‌లో చేరిన మాహెర్ అసలు వయసు యుద్ధభూమిలో బయటపడింది. ఒక షెల్ దగ్గరగా వచ్చి పడడంతో ‘అమ్మా!’ అంటూ బావురుమన్నాడట మాహెర్. దీనితో ఇంటికి పంపేశారు. మాహెర్ తన రికార్డును బద్దలుకొట్టే ఇంకో వాస్తవం బయటపెట్టాడు. ఇలాంటి పిల్లలే ఐదురుగురుని రెలైక్కించి లండన్ పంపారట. ఆ ఐదుగురిలో ఒక బాలుడి వయసు కేవలం పన్నెండేళ్లు. ‘ట్రెంచ్ బయట ఏం జరుగుతోందో నిన్ను ఎత్తుకుని చూపించేవారా?’ అంటూ మిగిలిన పిల్లలు రైల్లో జోక్ చేశారట. రిచర్డ్ డిక్ట్రాఫోర్డ్ అనే మరో బాల సైనికుడి కథ ఇంకా చిత్రం. ఇతడి వయసు పదిహేనేళ్లే. కానీ పద్దెనిమిదేళ్లని చెప్పాడు. నాకు నమ్మకం లేదన్నాడు అధికారి. కావాలంటే బర్త్ సర్టిఫికెట్ తీసుకువస్తానని దబాయించాడు రిచర్డ్. దానితో పక్కనే ఉన్న అధికారి ఆ కుర్రాడి మాటే చాలు ఎంపిక చెయ్యమన్నాడు. బెల్జియం తమాషా, ఇంకొకటి- ‘క్షమించాలి! నీ పండ్లు సరిగ్గా లేవు. నిన్ను సైన్యానికి ఎంపిక చెయ్యలేను!’ అన్నాడట సార్టెంట్. అందుకు చేరడానికి వచ్చిన ఆ యువకుడు ‘నేను జర్మన్లని కొరికి చంపక్కర్లేదు. కాల్చి చంపుతాను’ అన్నాడట. జార్జి కూపర్డ్ అనే పదహారేళ్ల అబ్బాయి క్రొయడాన్ అనే చోట, అప్పటి తన అనుభవాన్ని ఒక ఉత్తరంలో వర్ణించాడు. సరాయేవోలో ఫెర్డినాండ్, సోఫీల హత్య, యుద్ధం మొదలు కావడం, మోన్స్ యుద్ధం వంటి సంగతులన్నీ కూడళ్లలో ప్లకార్డుల మీద దర్శనమిచ్చేవట. అన్నింటికీ మించి సైన్యంలో చేరి ‘హూణుల’ (జర్మన్లు) పీచమణచాలని తహతహలాడిపోయిన పిల్లలు ఎంపిక కేంద్రాల దగ్గర ఎన్ని ఇక్కట్లు పడ్డారో కూడా ఇతడి ఉత్తరంతో తెలుస్తుంది. ‘యుద్ధంలో చేరండహో!’ అని పోలీసు, మిలటరీ బ్యాండ్లు మోగిస్తూ ఊరేగింపులు జరిగాయట. దీనితో సైన్యం ఎంపిక కేంద్రానికి పరుగులు తీశానని కూపర్డ్ రాసుకున్నాడు. క్రొయడాన్లోనే మిష్రామ్ రోడ్డులో ఉన్న బ్యారెక్స్‌కు వెళ్లాడు. కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నారు జనం. తీరా, ‘‘పందొమ్మిదేళ్లు రావాలి! రేపు రా! వస్తాయేమో!’’ అన్నాడట సార్జెంట్. ఇతడు ఠంచనుగా మరునాడు వెళితే ఎంపిక చేశారు. వీళ్లలో చాలామంది పేర్లు తప్పు చెప్పారు. దొంగ చిరునామాలు ఇచ్చారు. అందుకే చాలామంది ఆచూకీ తరువాత లభించలేదు. తమ పిల్లల ఆచూకీ కోసం జీవితాంతం ఎదురుచూసిన తల్లిదండ్రులు ఎందరో! - డా॥గోపరాజు నారాయణరావు -
సంగ్రామం: యుద్ధం ప్రేమతో మొదలైంది!
మొదటి ప్రపంచ యుద్ధానికి ఈ ఏడాదితో నూరేళ్లు. కానీ వెయ్యేళ్లకు సరిపడా భావోద్వేగాలను ఈ యుద్ధం ఎగజిమ్మింది. అందులో చిందిన ప్రతి రక్త బిందువూ ఒక వ్యథకు, హృద్యమైన ఓ కథకు కేంద్రబిందువు. ఈవారం నుంచి ‘ఫన్డే’ మీకా వ్యథల్ని, కథల్ని వారానికొకటిగా అందించబోతోంది. ఆ వరుసలో మొదటిదే... ఫ్రాంజ్ ఫెర్డినాండ్-సోఫీల ప్రేమగాథ. ఆ ప్రేమకావ్యంలో తుది వాక్యమే రక్తకాసారాలని సృష్టించిన ఓ మహా యుద్ధ చరిత్రకు తొలి వాక్యమయిందంటే నమ్మ శక్యంకాదు. కానీ నిజం. రోమియో- జూలియెట్, లైలా-మజ్నూ, అనార్-సలీం వంటి ప్రేమకథల సరసన చేరుతుందంటారు ఫ్రాంజ్ ఫెర్డినాండ్- సోఫీ చోటెక్ ప్రేమగాథ. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆ ప్రేమ జంట హత్యే(జూన్ 28, 1914). ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నాటి ప్రపంచంలో మూడో పెద్ద రాజ్యం ఆస్ట్రియా-హంగెరీ వారసుడు, హాబ్స్బర్గ్ వంశీయుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఈ ప్రేమకథలో నాయకుడు. ఆస్ట్రియా-హంగెరీ చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ తమ్ముడి కొడుకు ఫెర్డినాండ్. ఆయన ప్రేయసి సోఫీ పేదరాలు కాదుగానీ, కులీన కుటుంబం నుంచి వచ్చిన చెక్ జాతీయురాలు. చిన్న వయసులోనే ఫెర్డినాండ్ ఆస్ట్రియా-హంగెరీ సైన్యాల తనిఖీ అధికారి అయ్యాడు. గొప్ప వరంలా భావించిన సోఫీ వంటి చెలి, ప్రపంచానికి ఘోర శాపంలా పరిణమించిన చావూ- రెండూ ఆ పదవి కారణంగానే ఫెర్డినాండ్‌ను వరించాయి. సోఫీ ఆ కాలపు యూరప్ అందగత్తెలలో ఒకరు. కన్యలు ఉన్న యూరప్ పాలక వంశాలన్నీ ఫెర్డినాండ్ కరుణ కోసం చూసేవి. అతడేమో వేటనీ, గులాబీలనీ సమంగా ప్రేమిస్తాడు. లేత వేసవి ఎండలాంటి ఫెర్డినాండ్, చిరుజల్లులాంటి సోఫీల మధ్య విరిసిన ప్రేమ అనే ఇంద్రధనుస్సు ప్రపంచం ముందు ఆవిష్కృతం కావడానికి రెండేళ్లు పట్టింది. ఆ తరువాత ఇద్దరూ పెళ్లి కోసం ఎనిమిదేళ్లు ఆగారు. ప్రాగ్‌లోనే ఓ విందు నృత్యంలో 1888 ప్రాంతంలోనే యువరాజు సోఫీని చూసి, ప్రేమలో పడ్డాడు. సోఫీ బొహిమియా ప్రాంత సైన్యాధ్యక్షుడు ఫ్రెడ్రిక్ మారియా భార్య ఇసబెల్లా ప్రధాన చెలికత్తె మాత్రమే. అక్కడ ‘లేడీ ఇన్ వెయిటింగ్’ అంటారు. కౌంట్ బొహుస్లా చోటెక్ వాన్ చోటెకోవ్ ఓజ్నిన్ కూతురు సోఫీ. తల్లి కిన్స్కీ వాన్ చినిట్జ్. ఆస్ట్రియా-హంగెరీ రాజ్యానికి కౌంట్ బొహుస్లా ఒకప్పుడు అశ్వ విభాగం అధిపతి. తరువాత దౌత్యవేత్త. హాబ్స్బర్గ్ పాలక వంశీయుల వివాహం యూరప్‌కే చెందిన మరో పాలక వంశీయులతో జరగాలి. అందుకే చక్రవర్తి మారు మాట లేకుండా ఈ ప్రేమను వ్యతిరేకించాడు. ప్రాగ్లో కొన్నిసార్లు కలుసుకున్నా ఎక్కువ కాలం ఆ ప్రేమికులిద్దరూ ఎక్కడెక్కడో ఉండవలసి వచ్చింది. రాజరికం మీద అలకతో ఫెర్డినాండ్ వియన్నాకు దూరంగా వెళ్లిపోయాడు. మొదట బొహిమియా అడవులలో కొన్ని రోజులు వేట వ్యసనంలో మునిగి తేలాడు. ఆ విరహంలో అక్షరాలా వందల జంతువులను చంపాడు. అదీ విసుగనిపించింది. ఆపై ప్రపంచ పర్యటనకు వెళ్లిపోయాడు. అప్పటికే అతని వయస్సు ఇరవై ఎనిమిదేళ్లు. ఉత్తర అమెరికాకు వెళుతూ భారతదేశం చూశాడు. హిమాలయాల అందానికి పరవశించి, గానం చేశాడు. కలకత్తా చూశాడు. బెంగాల్ టైగర్ని వేటాడాడు. నిజాం ఆతిథ్యం తీసుకున్నాడు. ఢిల్లీ చూశాడు. నేపాల్, సిలన్ కూడా వెళ్లాడు. కానీ యాత్ర మధ్యలోనే ఆరోగ్యం దెబ్బతింది. పది మాసాల తరువాత వియన్నా వెళ్లిపోయాడు. తన ప్రేమ పట్ల రాజరికపు వైఖరిలో ఏ మార్పూ లేదు. అప్పుడే తన వ్యక్తిగత వైద్యుడు ఇచ్చిన మందు వికటించి, క్షయ సోకింది. మారుటితల్లి మేరియా థెరిసా మినహా అంతా తనని శత్రువులా చూడడం భరించలేకపోతున్నాడు. వైద్యం కోసం లోషీన్కు వెళ్లిపోవడం మంచిదనిపించింది.లోషీన్- నీలి సంద్రంలో ఆకుపచ్చ స్వర్గం. టీబీ శానెటోరియంకు ప్రసిద్ధి. అడ్రియాటిక్ సముద్రంలో ఉత్తర దిశగా ఉన్న క్రెస్-లోషీన్ ద్వీపసమూహంలోనిది. ప్రతి ద్వీపం పైన్ చెట్ల నీడలో సేద తీరుతున్నట్టే ఉంటుంది. పలచటి కెరటాల సముద్రంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి అక్కడి బాటిల్‌నోస్ డాల్ఫిన్లు. మందులు వాడుతూ, వ్యాయామం కోసం తీరాలలో నడుస్తూ ఉండేవాడు ఫెర్డినాండ్. అప్పుడు సోఫీ రాసిన లేఖలు అతడికి గొప్ప సాంత్వన. బంధం బలపడింది. ఆరోగ్యం కుదుటపడి, వియన్నా వచ్చాక సోఫీని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోననీ, రాజ్యం అక్కరలేదనీ తెగేసి చెప్పేశాడు ఫెర్డినాండ్. దీనితో జర్మనీ చాన్సలర్ విల్హెల్మ్, రష్యా చక్రవర్తి నికోలస్, పోప్ లియో కల్పించుకుని చక్రవర్తి జోసెఫ్‌కు నచ్చ చెప్పారు. ఫెర్డినాండ్ సవతితల్లి మేరియా థెరిసా రాయబారం నడిపింది. చివరికి జూన్ 28, 1900 సంవత్సరంలో వారసత్వ నిరాకరణ ప్రమాణం (మోర్గనాటిక్ ఓత్)చేయించారు. దీని ప్రకారం ఫెర్డినాండ్‌తో పెళ్లి జరిగినా సోఫీకి రాణి హోదా ఇవ్వరు. ఏ ఉత్సవంలోను ఫెర్డినాండ్ వెంట ఉండరాదు. భవిష్యత్తులో పిల్లలకు సింహాసనం మీద హక్కు రాదు. జూలై 1న సవతి తల్లి థెరిసా సొంత భవనం రీచ్స్టాడ్లో పెళ్లయింది. రాచరికం ఆరళ్లతో సోఫీ రహస్యంగా ఎంత కన్నీరు కార్చిందో ఆమె జేబురుమాళ్లకే తెలుసు. ముగ్గురు పిల్లలు పుట్టినా అవే అవమానాలు. కానీ భర్త సమక్షంలో ముఖం మీద చిరునవ్వు చెరగనీయలేదు. ఫెర్డినాండ్ ప్రేమ వ్యవహారానికే కాదు, రాజకీయ చింతనకి కూడా ఆస్ట్రియా రాచరికం బద్ధ వ్యతిరేకం. అతడు రష్యాతో మైత్రిని కోరేవాడు. అంటే రష్యా అండ ఉన్న సెర్బులతో - దక్షిణాది స్లావ్లు- రాజీ పడాలనుకుంటున్నాడు. ఆస్ట్రియా-హంగెరీని ఆనుకుని ఉన్న బోస్నియా,హెర్జిగోవినా ప్రాంతాలని చక్రవర్తి ఆక్రమించడానికి కూడా ఫెర్డినాండ్ వ్యతిరేకమని చెబుతారు. బోస్నియా రాజధాని సరాయేవోలో సైనిక తనిఖీకి వెళ్లవలసి వచ్చినపుడు అతడు తీవ్రంగానే కలత పడ్డాడు. చావును ముందే ఊహించాడు కూడా. 14వ శతాబ్దం నుంచి టర్కీ పాలనలో ఉన్న బోస్నియా -హెర్జిగోవినాలనే 1908లో జోసెఫ్ ఆక్రమించాడు. అప్పటికే అక్కడ సెర్బియా అండతో స్లావ్లు, క్రొయేట్లు ఉద్యమిస్తున్నారు. ఏ గోడమీద చూసినా ‘బ్లాక్ హ్యాండ్’ పేరుతో, ‘యూనియన్ ఆర్ డెత్’ పేరుతో ఆస్ట్రియా రాజవంశీకులని చంపుతామంటూ నినాదాలు దర్శనమిచ్చేవి. ఒక గవర్నర్ మీద హత్యాయత్నం జరిగింది. జూన్ 25, 1914న ఫెర్డినాండ్, సోఫీ బోస్నియా వచ్చారు. అంతకు ముందే అక్కడి వీధులలో ఆస్ట్రియా పతాకాన్ని ఎవరో తగులబెట్టారు కూడా. అలాంటి చోటికి ఫెర్డినాండ్ సోఫీతో వెళ్లాడు. ప్రధాన కారణం- చక్రవర్తి ఆదేశం. బోస్నియా గవర్నర్ ఆస్కార్ పొటియోరిక్ విన్నపం. ఇంకొకటి, వియన్నాలో సోఫీకి దక్కని రాణి మర్యాద అక్కడ దొరకుతుంది. కానీ నాలుగో బిడ్డకు తల్లి కాబోతున్న సోఫీకి సరాయేవో (బోస్నియా ప్రాంత రాజధాని)లో రాణి మర్యాద మాటేమో కానీ మృత్యువు ఎదురైంది. విశాల సెర్బియా ఆశయానికి పూర్తి అండగా ఉన్న సెర్బియా దేశం ప్రోద్బలంతో సెర్బు జాతి యువ కుడు గవ్రిలో ప్రిన్సిప్ ఆ ఇద్దరినీ మిల్జాకా నది ఒడ్డున, లాటిన్ బ్రిడ్జి దగ్గర కాల్చి చంపాడు. ముందు ఫెర్డినాండ్, ఆపై సోఫీ అరగంట తేడాలో చనిపోయారు. మరణానంతరం కూడా సోఫీ పట్ల రాచరికం కరుణ చూపలేదు. ఆమె శవపేటిక మీద గ్లోవ్స్ పెట్టి, ఒకప్పుడు ఆమె ప్రధాన చెలికత్తె అన్న విషయాన్ని రాచరికం గుర్తుకు తెచ్చింది. ముగ్గురు పిల్లలకు కడసారి చూపూ దక్కలేదు. ఆ చిన్నారులు పంపిన పుష్పగుచ్ఛాలు మాత్రం భౌతికకాయాల మీద ఉంచారు. వియన్నాలోని కేపూచిన్ చర్చి దగ్గరి స్మశానం హాప్స్‌బర్గ్ వంశీయులకు ప్రత్యేకం. కానీ ఆర్ట్స్టెటెన్లో తన భౌతికకాయాన్ని ఖననం చేయాలని ఫెర్డినాండ్ ముందే చెప్పేశాడు. పాలక కుటుంబానికి ప్రత్యేకించిన స్మశానంలో సోఫియా మృతదేహాన్ని అనుమతించరు. ఆమె మృతదేహాన్ని ఆర్ట్స్టెటెన్ స్మశాన వాటికకే తరలిస్తారు. మరణం తరువాత కూడా కలిసి ఉండాలన్న వెర్రి ప్రేమతో తన మృతదేహాన్ని కూడా ఆర్ట్స్టెటెన్లోనే ఖననం చేయాలని ఫెర్డినాండ్ కోరుకున్నాడు. కానీ వారి భౌతికకాయాలను వేర్వేరుగానే ఖననం చేశారు. జర్మనీ మద్దతుతో ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. వరసగా ఇంగ్లండ్, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, 33 దేశాలు యుద్ధంలో దిగాయి. చిన్న రివాల్వర్- బ్రౌనింగ్ సెమీ ఆటోమాటిక్ పిస్టల్. ఎం 1910 మోడల్, సీరియల్ నెంబరు 19074తో సెర్బు జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ కాల్చినవి రెండు బులెట్లే. కానీ అవే, ఐదు వారాల తరువాత కొన్ని లక్షల విస్ఫోటనాలై భూగోళమంతా ప్రతిధ్వనించాయి. - డా॥గోపరాజు నారాయణరావు