చెదిరిన జీవిత చిత్రం | The Girl Left Hind You | Sakshi
Sakshi News home page

చెదిరిన జీవిత చిత్రం

Nov 5 2018 12:14 AM | Updated on Nov 5 2018 12:18 AM

The Girl Left Hind You - Sakshi

‘ద గర్ల్‌ యు లెఫ్ట్‌ బిహైండ్‌’ నవల మొదలయ్యేది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పటి 1916లో. ఫ్రెంచ్‌ చిత్రకారుడైన ఇద్వార్డ్, భార్య సోఫీ చిత్రాన్ని వేస్తాడు. యుద్ధానికి వెళ్ళి పట్టుబడినప్పుడు, జర్మన్‌ జైల్లో పెడతారు అతణ్ని. జర్మన్లు ఫ్రాన్సులో చిన్న పల్లెటూరైన, సెయింట్‌ పేహోన్‌ను ఆక్రమించుకుంటారు. అక్కడే సోఫీ కుటుంబం చిన్న హోటెల్‌ నడుపుతుంటుంది. ప్రతీ సాయంత్రం జర్మన్‌ క్యాంప్‌ కమాండంట్‌కూ, సిపాయిలకూ తినుబండారాలు, పానీయాలూ అందించవల్సిన పని తప్పించుకోలేకపోతుంది సోఫీ. కమాండెంట్‌ను మొదట సోఫీ చిత్రం ఆకర్షిస్తుంది. ఆ తరువాత సోఫీ. ‘నేను శత్రుసైన్యం వాడినన్న సంగతి మరచిపో. నువ్వు ప్రతి క్షణం ఆ సైన్యాన్నే ఎలా నష్టపరచాలా అని యోచిస్తున్న స్త్రీవని నేనూ మరచిపోతాను. మనం కేవలం ఇద్దరు మనుష్యులుగా మాత్రమే ఉందాం’ అని సోఫీకి సూచిస్తాడు. ‘ప్రతీ క్షణపు సారాన్నీ ఆస్వాదిస్తూ, అది రుచిగా ఉన్నందుకు సంతోషపడుతూ గడపాలి’ అని భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చిన సోఫీ– ఇద్వార్డును జైలునుండి విడిపించడం కోసం, కమాండంట్‌ షరతును ఒప్పుకుంటుంది. అనుకోకుండా జర్మన్‌ ఆర్మీ ఆమెను అరెస్ట్‌ చేస్తుంది. ఆ తరువాత ఆమె జాడ కనబడదు.

రచయిత్రి జోజో మోయ్స్‌– కథను 90 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళి, నాలుగేళ్ళ కిందట భర్తను కోల్పోయిన, 33 ఏళ్ళ లండన్‌ నివాసి అయిన లివ్‌ వద్దకు చేరుస్తారు. పెళ్ళయిన కొత్తల్లో, భర్త ఆమెకు బహూకరించిన సోఫీ చిత్రమే లివ్‌ గోడమీద వేళ్ళాడుతుంటుంది. ‘కొన్నిసార్లు, జీవితం అడ్డంకుల వరుసలా కనిపిస్తుంది. మరొక అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది’ అనుకుంటూ జీవితం ఈడుస్తున్న స్త్రీ లివ్‌. దొంగిలించబడిన కళాఖండాలను వాటి హక్కుదారులకు అప్పగించే బాధ్యత తీసుకున్న అమెరికన్‌ అయిన పౌల్, పోలీసుగా పని చేసిన తరువాత, తన సొంత ఏజెన్సీ నడుపుతుంటాడు. ఇద్వార్డ్‌ కుటుంబం సోఫీ చిత్రం కావాలని కేసు పెట్టినప్పుడు, ఆ కేసు చూస్తున్నదే పౌలే. లివ్, పౌల్‌ను కలుసుకున్న తరువాత, జీవితం పట్ల ఆమె ఆశ తిరిగి చిగురిస్తుంది. ‘లోకం అంతం అయిందనుకున్నాను. తిరిగి ఎప్పుడూ మంచి జరుగుతుందని ఆశించలేదు. నేను ఇన్నాళ్ళూ ఎక్కువ తినలేకపోయాను. ఎవరినీ కలవాలని ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ బతుకంటే ఇష్టం ఏర్పడింది’ అని పౌలుకు చెప్తుంది. అయితే, చిత్రం గురించి తెలిసిన తరువాత వారిద్దరి సంబంధం బీటు పడుతుంది. ఇద్వార్డ్‌ వేసిన చిత్రాల ధర ఆకాశాన్ని అంటుతోందని తెలియని లివ్, చిత్రాన్ని వదులుకోనంటుంది. అది కమాండెంట్‌కు బహూకరించబడిందని తెలిసిన పౌలు, ‘కేసు గెలవడం కన్నా జీవితంలో మరెంతో ఉంది’ అనుకుని కేసు వదిలేస్తాడు. వాస్తవానికి– సోఫీ భర్తను కలుసుకుని స్విట్జర్లాండ్లో, అతనితో కలిసి సంతోషంగా జీవించిందని ఆఖర్న తెలుస్తుంది.

సోఫీ దృష్టికోణంతో ఉన్న కథ హటాత్తుగా లివ్‌ జీవితానికి చేరిన తరువాత, చాలా త్వరగా– ముందుకీ వెనక్కీ నడుస్తుంది. సోఫీకి ఏమయిందన్న రహస్యాన్ని అన్వేషిస్తూనే, లివ్‌ వద్దనున్న చిత్రం గురించిన ఆసక్తిని హెచ్చిస్తుంటుంది. చిత్రాలను పూర్వస్థితీకరణ చేయడంలో ఉన్న సంక్లిష్టతలను విపులీకరిస్తుంది నవల. యుద్ధకాలంలో దొంగిలించబడిన కళాఖండాల గురించి చెప్తూ కూడా రచయిత్రి– వదంతులు నిజాలని ఎలా కప్పెడతాయో అన్న తన కథనం నుంచి దృష్టి మళ్ళించరు. ‘సరైన కారణాల కోసం ఏదైనా చేసినప్పుడు కూడా అది నమ్మకద్రోహమే అవుతుందా?’ అని కథ ప్రశ్నిస్తుంది. ప్రేమ, త్యాగం, కోల్పోవడం గురించిన పుస్తకంలో యుద్ధపు వివరాలు, అమానుష ప్రవర్తన, విశదమైన లైంగిక వివరాలు ఉంటాయి. వార్తా శీర్షికల వెనకనుండే వ్యక్తిగత కథలను కనబరిచే ఈ నవలను పెంగ్విన్‌ బుక్స్‌ 2014లో ప్రచురించింది.

‘సరైన కారణాల కోసం ఏదైనా చేసినప్పుడు కూడా అది నమ్మకద్రోహమే అవుతుందా?’ అని కథ ప్రశ్నిస్తుంది.  కృష్ణ వేణి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement