
హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న దాచేపల్లి పోలీసులు
గురజాల కోర్టులో హాజరు
దాచేపల్లి: రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేసిన ఓ సోషల్ మీడియా పోస్టుపై నడికుడికి చెందిన టీడీపీ నేత చిలుమూల దుర్గారావు మార్చి 1న చేసిన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేసినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు. కృష్ణవేణిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పలు పత్రాలపై కృష్ణవేణితో సంతకాలు చేయించుకున్నట్లు తెలిసింది.
రాత్రంతా ఆమెను దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. గురువారం సాయంత్రం అరెస్ట్ చూపి.. గురజాల ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గురజాల కోర్టులో హాజరుపరచగా ఆమెకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా, కృష్ణవేణిని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు, న్యాయవాది రొళ్ల మాధవి పరామర్శించారు.
కృష్ణవేణి అరెస్టు విషయం తెలియడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు కోట కృష్ణ, షేక్ సుభానీ, కందుల జాను, తండా అబ్దుల్‌సత్తార్, మందపాటి రమేశ్‌రెడ్డి, కొప్పుల సాంబయ్య, షేక్ జాకీర్ హుస్సేన్, కుందురు తిరుపతిరెడ్డి, షేక్ ఇమామ్‌వలి తదితరులు పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు.