‘‘మా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా?..’’ 680 మందికి నోటీసులు.. 147 అక్రమ కేసులు.. 49 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చంద్రబాబు సర్కారు వికటాట్టహాసం చేస్తోంది. అక్రమ కేసులతో వేధించడంతో పాటు అడ్డగోలుగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తోంది.మమ్మల్నే ప్రశ్నిస్తారా?.. అంటూ వైఎస్సార్సీపీ సో.మీ. కార్యకర్తలను, మద్దతుదారులను, సాధారణ ప్రజలనూ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. కూటమి పార్టీల మనుషులే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. వాళ్లే ఫిర్యాదులు చేసి వైఎస్సార్సీపీ వాళ్లను అరెస్టులు చేయిస్తున్నారు. మరోవైపు.. జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ నేతలపైనా నీచంగా పోస్టులు పెట్టినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.కూటమి అరాచక పాలనలో గత వారం రోజుల్లోనే 147 అక్రమ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 680 మందికి నోటీసులు జారీ చేశారు. మరో 49 మంది అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కొందరు పోలీసులు కూడా అతి చేష్టలకు దిగుతున్నారు.నెట్టింట కూటమి ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో ప్రశ్నించేవారిని, నిలదీసేవారిని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను ఇలా పోలీసులు ఇబ్బంది పెడుతున్న వైనాన్ని ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది వైఎస్సార్సీపీ. రెండ్రోజులు గడువు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కోర్టులకు వెళ్లాలని, రూల్స్‌కు వ్యతిరేకంగా వెళ్తున్న పోలీసులపై ప్రైవేట్ కంప్లయింట్లు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు..ఆ పార్టీ నేతలు జాతీయ మానవహక్కుల సంఘానికి వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెబుతున్నారు. న్యాయసహాయంతో పాటు అన్నిరకాలుగా సాయం అందించేందుకు విభాగాలను ఏర్పాటు చేయించారు.