మానవ హక్కులను హరిస్తూ.. అక్రమ కేసులతో వేధిస్తూ.. | Government illegal cases against social media activists | Sakshi
Sakshi News home page

మానవ హక్కులను హరిస్తూ.. అక్రమ కేసులతో వేధిస్తూ..

Nov 22 2024 6:09 AM | Updated on Nov 22 2024 6:09 AM

Government illegal cases against social media activists

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ దాష్టీకం

ఒక్కొక్కరిపై లెక్కకుమించి అక్రమ కేసులు 

పలు పోలీస్‌స్టేషన్లు, జైళ్లు చుట్టూ తిప్పుతూ వేధింపులు

అక్రమ నిర్బంధాలపై కోర్టును ఆశ్రయిస్తే మరింతగా కక్షసాధింపు

ప్రభుత్వ కుట్రకు కొమ్ముకాస్తూ పేట్రేగిపోతున్న పోలీసులు

ఇదీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ దమననీతి

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అధికా­రిక గూండాగిరి వెర్రితలలు వేస్తోంది. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో రోజురోజుకీ మరింతగా పేట్రేగిపోతోంది. ఉగ్రవాదులపట్ల కూడా వ్యవహరించనంత కాఠిన్యంతో పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మానవ హక్కులను నిర్భీతిగా కాలరాస్తున్నారు. ఒక్కొక్కరిపై నాలు­గైదు అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుచేస్తున్న పోలీసులు వారు రిమాండ్‌లో ఉండగానే వారికి తెలియకుండానే మరిన్ని కేసులు పెడుతున్నారు. 

అరెస్టయిన వారిని రాష్ట్రంలోని జైళ్లకు తిప్పుతూ వారి కుటుంబ సభ్యు­లను కూడా కలవనీయకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో భాగస్వామిగా మారిన పోలీసు వ్యవస్థ కూడా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ.. పౌర హక్కుల­ను మంటగలుపుతూ పేట్రేగిపోతోంది. 

ఇక అక్రమ నిర్బంధాలను సవాల్‌చేస్తూ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేస్తుంటే పోలీసులు మరింతగా చెలరేగిపోతున్నారు. వారిపై మరిన్ని అక్రమ కేసులు బనాయించి బెంబేలెత్తిస్తుండటం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. న్యాయ వ్యవస్థ ఆదేశాల స్ఫూర్తిని సైతం ఉల్లంఘిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అరాచకం ఎలా ఉందంటే..

ఎడాపెడా అక్రమ కేసులు..
చంద్రబాబు ప్రభుత్వం సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగ హక్కు­లను కాలరాస్తోంది. ఇప్పటివరకు ఏకంగా 178 అక్రమ కేసులు నమోదు చేసినట్లు లెక్కతేలగా.. వాటికి అదనంగా గత రెండ్రోజుల్లోనే మరో 100 వరకు అక్రమ కేసులు నమో­దు చేసినట్లు సమాచారం. ఓ కేసులో అరెస్టుచేసిన సోషల్‌ మీడియా యాక్టివిస్టు రిమాండ్‌లో ఉండగానే ఆయనపై మరి­న్ని అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ఇలా ఒకొక్కరిపై కనీ­సం నాలుగైదు అక్రమ కేసులు నమోదు చేస్తోంది. 

ఓ కేసులో బెయిల్‌పై బయటకు రాగానే మరో కేసులో అరెస్టుచేసి మరో జైలుకు తరలిస్తోంది. దీంతో అసలు ఎవరిపై ఎన్ని కేసులు నమోదు చేశారన్న కనీస సమాచారం కూడా తెలియని­వ్వకుండా పోలీసులు బరితెగించి వేధిస్తున్నారు. అరెస్టు చేసినవారి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్న రాజ్యాంగప­రమైన బాధ్యతను కూడా పోలీసులు బేఖా­తరు చేస్తున్నారు. దీంతో తమ వారిని అదపు­లోకి తీసుకుంది పోలీసులో, ప్రైవేటు గూండా­లో తెలీక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నా­రు. వారి ఆచూకి కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

హైకోర్టును ఆశ్రయిస్తే మరిన్ని కేసులు..
ఇక సోషల్‌ మీడియా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచికంగా వ్యవ­హ­రిస్తుండడంతో వారి ఆచూకి కోసం కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేస్తూ తమ వారి ఆచూకీ చెప్పాలని వేడుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం మరింతగా పేట్రేగిపోతోంది. ఎవరి ఆచూకీ కోసం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేశారో వారిని విడుదల చేస్తూనే ఆ వెంటనే వారిపై ఐదారు అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తోంది.

ఇంటూరి ఎక్కడో?
తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు
వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌ను అక్రమ కేసులో అరెస్టుచేసి చిత్రహింసలకు గురిచేసినా ప్రభుత్వ కక్ష చల్లారలేదు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో ఆయన్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తరువాత కూడా వేధిస్తుండడం విస్మయం కలిగి­స్తోంది. 

రవికిరణ్‌ను కలిసేందుకు ఆయన సతీమణి విశాఖ నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వచ్చారు. కానీ, ఆయన్ని విశాఖ జైలుకు తరలించిన­ట్లు అక్కడి జైలు అధికారులు చెప్పా­రు. దాంతో ఆమె విశాఖ జైలుకు వెళ్లారు.కానీ, తన భర్తను కలి­సేందుకు ఆమెకు అవకాశమివ్వలేదు. రెండ్రోజులు ప్రయత్నించిన మీదట జైలు అధికా­రులు అంగీకరించడంతో ఆమె జైలుకు వెళ్లారు. 

తీరా ఆమె వెళ్లేసరికి రవికిరణ్‌ను విజయనగరం జైలుకు తీసుకు­పోయా­రు. అక్కడికి వెళ్తే అక్కడా లేరని.. శ్రీ­కాకుళం జైలుకు తరలించారని చెప్పారు. తీరా ఆమె గురు­వారం శ్రీకాకుళం జైలుకు వెళ్లేసరికి అక్కడ నుంచి పల్నాడు జిల్లా మాచర్లకు తరలించేశారు. ఇక రవికిరణ్‌ను శుక్రవారం మరో జైలుకు తరలిస్తారని తెలుస్తోంది. ఇలా రవికిరణ్‌ను ఆయన కుటుంబీకులు కలవనీయకుండా పోలీసులు చేస్తున్నారు.

మహిళ పట్లా అత్యంత కర్కశంగా..
సుధారాణిని వేధిస్తున్న ప్రభుత్వం
మహిళ అనే కనీస కనికరం కూడా లేకుండా సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అయిన సుధారాణిపట్ల కూడా కక్షతో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే అవకాశమున్న కేసుల్లో రిమాండ్‌ విధించకుండా వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలి. సుధారాణిపై నమోదైన కేసులన్నీ ఇలాంటివే. కానీ, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే సమయంలో వివిధ సెక్షన్లు జోడిస్తూ పోలీసులు కనికట్టు చేశారు. 

సుధారాణి, ఆమె భర్త వెంకట్రామిరెడ్డిలను అరెస్టుచేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. సుధారాణి ఇద్దరు పిల్లలు తల్లిని చూడాలని ఏడుస్తుండటంతో ఆమె తండ్రి వారిని తీసుకుని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వచ్చారు. వారు వచ్చేసరికే ఆమెను విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

తీరా విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకు వెళ్లేసరికి అక్కడి నుంచి శ్రీకాకుళం జైలుకు తీసుకుపోయారు. ఆమె తండ్రి తన ఇద్దరు మనవలతో కలిసి ఎంతో వ్యయ ప్రయాసలు పడి గురువారం శ్రీకాకుళం వెళ్లేసరికి ఆమెను గుంటూరు జైలుకు తరలించేశారు. అక్కడి నుంచి ఆమెను ఒంగోలు జైలుకు తీసుకుపోయారు. ఇక సుధారాణి భర్త వెంకట్రామిరెడ్డి ఎక్కడ ఉన్నారన్నది అంతుచిక్కడంలేదు. 

రాజమహేంద్రవరం టు బి.కొత్తకోట..
శ్రీనాథ్‌రెడ్డి పట్ల ప్రభుత్వ వేధింపులు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకకు చెందిన శ్రీనాథ్‌ రెడ్డిపట్ల కూడా ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్య­వ­హరిస్తోంది. ఆయన్నిసోషల్‌ మీడియాలో పోస్టులు పె­ట్టా­రని అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగానీ అరెస్టు చేసి­నట్లు­గానీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. శ్రీనాథ్‌రెడ్డిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తర­లించారు. 

ఆయన ఎక్కడున్నారనే విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. కానీ, ఆయన్ని అప్పటికే శ్రీకాకుళం జైలు­కు తరలించేశారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం వెళ్లారు. తీరా వారు అక్కడికి వెళ్లేసరికి.. శ్రీనాథ్‌రెడ్డికి శ్రీకాకుళం నుంచి ఏకంగా 900 కి.మీ.దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోటకు తరలించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హతాశుల­య్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement