సోషల్ మీడియా యాక్టివిస్టులపై అరాచకం
రాజమహేంద్రవరం జైలుకు బోరుగడ్డ అనిల్
ఒంగోలు జైలుకు బోడి వెంకటేష్
పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇద్దరి అరెస్టు
నటుడు పోసానిపై అవనిగడ్డలో ఫిర్యాదు
నటి శ్రీరెడ్డిపై గుంటూరులో కేసు నమోదు
సాక్షి నెట్‌వర్క్: సీఎం చంద్రబాబు, మంత్రులు, టీటీడీ చైర్మన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పీటీ వారెంట్‌పై శుక్రవారం అరెస్టు చేసిన ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీసులు శనివారం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్ విధించడంతో మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.
బోరుగడ్డ పోలీసుస్టేషన్‌లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలవారు స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అనిల్ ఫొటోలను వారు చెప్పులతో కొడుతూ దహనం చేశారు. గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న విశాఖపట్నానికి చెందిన బోడి వెంకటేష్‌ను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు పీటీవారెంట్‌పై అరెస్టు చేసి చీరాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయాదికారి రిమాండ్ విధించడంతో వెంకటేష్‌ను ఒంగోలు జైలుకు తరలించారు.
వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఉండి మండలం ఉణుదుర్రు గ్రామానికి చెందిన గొర్రుముచ్చు సుందర్‌కుమార్‌ను శనివారం తెల్లవారుజామున ఉండి పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేశ్‌ను హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రాత్రి వరకు విచారించిన అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కృష్ణాజిల్లా అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు అందింది. సినీనటి శ్రీరెడ్డిపై గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment