దళితులంటే ఇంత చిన్నచూపా? | Illegal cases against social media activists | Sakshi
Sakshi News home page

దళితులంటే ఇంత చిన్నచూపా?

Published Thu, Dec 5 2024 5:13 AM | Last Updated on Thu, Dec 5 2024 4:00 PM

Illegal cases against social media activists

అక్రమ కేసులతో ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు ప్రభుత్వం

రాజమహేంద్రవరంలో కాలనీ సమస్యపై పోస్టు పెట్టిన దళిత యువకుడు సాగర్‌పై అమానుషం

పోలీసుస్టేషన్‌లో అర్ధ నగ్నంగా నిలబెట్టి తీవ్ర దుర్భాషలు, బెదిరింపులు 

కొవ్వుపట్టి కొట్టుకుంటున్నావురా నా..కొ.. అంటూ రెచ్చిపోయిన సీఐ 

పందిలా ఉన్నావు.. నిన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తే దిక్కెవరు? 

నీ గొంతుకోసి గోదావరిలో పడేస్తే శవం కూడా దొరకదని బెదిరింపులు

ఇంత అవమానం జరిగాక బతకాలనిలేదని వాపోయిన బాధితుడు

కూటమి ప్రభుత్వ కక్షసాధింపుపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు మార్గాని భరత్, సుధాకర్‌బాబు, కొమ్మూరి కనకారావు

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ హామీల అమలుపై నిలదీస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను తుంగలో తొక్కుతూ అక్రమ కేసులతో వేధిస్తోంది. 

సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు ఎవరిపైనైనా కేసు నమోదు చేస్తే.. ముందు 41ఏ నోటీసు జారీ చేయాలి. ఆ తర్వాత నిందితుడి నుంచి పోలీసులు సమాధానం తీసుకోవాలి. నిందితుడిపై నమోదైన అభియోగాలతో మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెంది, అనుమతి ఇస్తేనే అరెస్టు చేయాలి. కానీ.. పోలీసులు చట్టాన్ని యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. 

రాజమహేంద్రవరంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించానంటూ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై దళిత యువకుడు పులి సాగర్‌ స్పందిస్తూ.. తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్‌ చర్చి ప్రాంతాల్లో వరద నీళ్లు ఇంకా నిల్వ ఉన్నాయని, ఇతర సమస్యలు అలాగే ఉన్నాయని పోస్టు పెట్టారు. దీనిపై గత నెల 30న పోలీస్‌స్టేషన్‌కు రావాలని రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్‌ స్టేషన్‌ పోలీసులు ఆదేశిస్తే.. ఈ నెల 2న పులి సాగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. 

రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును ప్రశ్నించిన దళితయువకుడిని..

అక్కడ పోలీసులు అతడిని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ బెదిరించారు. అంతేకాకుండా బీఎస్సీ, బీఈడీ చదివిన తనను సెల్‌లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ బాజీలాల్‌ తన పట్ల దురుసుగా వ్యవహరించి గొంతుకు రాయికట్టి గోదావరిలో పడేస్తానని బెదిరించారని బుధవారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. 

కొవ్వుపట్టి కొట్టుకుంటున్నావురా నా..కొ.. అంటూ రెచ్చిపోయారని, పందిలా ఉన్నావు.. నిన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తే దిక్కెవరని బెదిరించారని చెప్పారు. స్థానిక సమస్యపై సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన పాపానికి దళిత యువకుడినైన తన ఆత్మగౌరవాన్ని పోలీసులు దెబ్బతీసి అమానవీయంగా వ్యవహరించడమే కాక నోటికొచి్చనట్లు అసభ్యంగా మాట్లాడారని పులి సాగర్‌ వాపోయాడు. 

ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలు మార్గాని భరత్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాదిగ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు తీవ్రంగా స్పందించారు. బాధిత యువకుడు పులి సాగర్‌తో కలిసి వీరు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటనను మీడియాకు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement