వర్రా రవీందర్‌రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం
మీరేమో ఇంకెక్కడో ఆయన్ను హాజరుపరిచారు
ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి
దీనిపై వివరణ ఇవ్వండి.. పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ 20కి వాయిదా
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్‌రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తెలిపింది. రవీందర్‌రెడ్డిని తమ ముందు (హైకోర్టు) హాజరుపరచాలని ఆదేశిస్తే, పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
అలాగే, ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీందర్‌రెడ్డి సతీమణిని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ పిటిషన్..
తన భర్త వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్భంధంపై అతని భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా ఈ వ్యాజ్యం ఈనెల 9న విచారణకు వచ్చింది. అప్పుడు, వర్ర రవీందర్‌రెడ్డిని తాము అరెస్టుచేయలేదని, అతను తమ నిర్బంధంలో లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం, వర్రా రవీంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ భాస్కర్‌రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
ఈనెల 12న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, రవీందర్‌రెడ్డి తదితరులను అరెస్టుచేసినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా పోలీసులు వర్రాను కొట్టారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని రవీంద్రరెడ్డి న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే.
పోలీసులది కోర్టు ధిక్కారమే..
ఈ నేపథ్యంలో.. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. రవీందర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ధర్మాసనం ఆదేశించిన మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈనెల 9న జరిగిన విచారణలో రవీంద్రరెడ్డి తమ నిర్బంధంలో లేరని చెప్పారని, కానీ 12న అతన్ని సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచారని తెలిపారు.
తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించడమేకాక.. 12న రవీందర్‌రెడ్డి తదితరులను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు కింది కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు. అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీంద్రరెడ్డిని కొట్టారని తెలిపారు. వాస్తవానికి.. రవీందర్‌రెడ్డిని పోలీసులు ఈనెల 8నే తమ అదపులోకి తీసుకున్నారని నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంతమాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణనన్నారు. హైకోర్టు ముందు హాజరుపరచకుండా వారిని కింది కోర్టులో హాజరుపరచడం అంటే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని.. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. 48 గంటలకు మించి అక్రమంగా నిర్బంధించడం ద్వారా పోలీసులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించారన్నారు.
పోలీసులను ఇలాగే వదిలేస్తే..
పోలీసులు చాలా అక్రమంగా వ్యవహరిస్తున్నారని, వీటిని ఇలాగే వదిలిస్తే రేపు ఓ 100 మందిని అక్రమంగా నిర్బంధించి, వారిని కొట్టి, వారితో కావాల్సిన ప్రతిపక్ష నేతల పేర్లు చెప్పించే పరిస్థితి వస్తుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, పోలీసులు తమ ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది.
ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని, అక్కడ సీసీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని నిరంజన్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. టోల్‌ప్లాజా జాతీయ రహదారుల సంస్థ అధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కళ్యాణికి ధర్మాసనం సూచించి తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment