సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎడాపెడా కేసులు పెడుతున్నారు
ప్రజల విమర్శలను ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు
అందుకే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు
హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది శ్రీరాం
సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం తప్పుకాదన్న సీజే ధర్మాసనం
న్యాయమూర్తులపై కూడా గతంలో అసభ్య పోస్టులు పెట్టారని గుర్తుచేసిన ధర్మాసనం
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పెద్దలను సంతోష పెట్టేందుకు రాష్ట్రంలో పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయడంలో ప్రభుత్వ విధానమే అణచివేత ధోరణిలా ఉందని, దానినే పోలీసులు అనుసరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదుచేసి అరెస్టుచేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంలో పోలీసులపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు పోలా విజయ్‌బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. మతం, కులం, లింగం, పుట్టిన ప్రాంతం తదితరాల ఆధారంగా వర్గాల మధ్య శతృత్వం సృష్టిస్తూ సెక్షన్–153ఏ కింద కేసులు పెడుతున్నారన్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చెల్లదని.. ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజల విమర్శలను తట్టుకోలేక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని శ్రీరాం వివరించారు.
ప్రజల హక్కులను కాలరాస్తున్నారు..
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. కేసులపై అభ్యంతరం ఉంటే దానిపై న్యాయపోరాటం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఆ పనే చేస్తున్నారని, పోలీసుల అక్రమ నిర్బంధాలపై హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని శ్రీరాం తెలిపారు. తప్పుడు కేసుల ద్వారా ప్రజల హక్కులను పోలీసులు హరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రజలు భయపడేలా చేస్తున్నారని వివరించారు.
ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ దన్నుతోనే పోలీసులు ఇంత అరాచకానికి పాల్పడుతున్నారని ఆయన ధర్మాసనానికి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో తప్పుపట్టిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత పోలీసులు నిర్ధిష్టంగా ఒకే తరహా కేసులు పెడుతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కేసుల నమోదు తప్పుకాదు..
ధర్మాసనం స్పందిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం తప్పుకాదని హైకోర్టు అభిప్రాయపడింది. తమపై (న్యాయమూర్తులు) కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తుచేసింది. ఇలాంటి వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను నియంత్రించలేమని తెలిపింది. సోషల్ మీడియా ఉన్నది ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి, పోస్టులు పెట్టడానికి కాదని వ్యాఖ్యానించింది.
అలాంటి పోస్టులు పెట్టే వారిని చట్టం ముందు నిలబెట్టడంలో తప్పేముందని ప్రశ్నించింది. కేసులపై అభ్యంతరం ఉంటే వాటిని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించింది. అంతేతప్ప.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీచేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment