సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
తిరస్కరించిన చైర్మన్.. చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుం పట్టు
పోడియం వద్ద నిరసన.. న్యాయం కావాలి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పలువురు యువకులను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు.. దీనిపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేసిన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స
కొద్దిసేపు స్తంభించిన కార్యకలాపాలు.. సభ వాయిదా
అంతకు ముందు బడ్జెట్‌పై చర్చను అడ్డుకున్న మంత్రులు
హామీలపై తమ బండారం బయటపడుతుందని అడుగడుగునా ఆటంకాలు.. సూపర్ సిక్స్ పథకాలు, కేటాయింపులపై నిలదీసిన వైఎస్సార్‌సీపీ
బడ్జెట్‌పై చర్చ పక్కదోవ.. అధికార పార్టీ సభ్యుల తీరు మారకపోవడంతో సభ వాయిదా.. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే వైఖరి కొనసాగింపు
రికార్డులో లేని అంశాలు, వ్యక్తుల పేర్లను లోకేశ్ ప్రస్తావించడంపై బొత్స అభ్యంతరం.. డీఎస్సీ జాప్యంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం సైతం తిరస్కరణ
గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేసిన చైర్మన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై శాసన మండలి అట్టుడికింది. కూటమి సర్కారు నిరంకుశ వైఖరి, అరాచక విధానాలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను అరికట్టాలి.. నిరంకుశ రాజ్యం నశించాలి.. ఉయ్ వాంట్ జస్టిస్.. సేవ్ డెమొక్రసీ అంటూ నినదించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కూటమి పార్టీలకు చెందిన కొందరు పెట్టిన అభ్యంతరకర పోస్టుల ప్లకార్డులను ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రదర్శించారు. యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ అరెస్టులపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, తుమాటి మాధవరావు, పి.రామసుబ్బారెడ్డి వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా మరో ఫార్మాట్‌లో తేవాలంటూ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు.
దీనిపై చర్చకు అనుమతించాలంటూ పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, తలశిల రఘురాం, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, మహ్మద్ రుహుల్లా తదితరులు పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, మండలి చీఫ్‌విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు దీనిపై జోక్యం చేసుకుంటూ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు పట్టుబట్టడం సరికాదన్నారు.
దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అనేక మంది యువకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, దీనిపై సభలో ఖచ్చితంగా చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. చర్చ కోసం వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసన తెలపడంతో సభ 34 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో చైర్మన్ మోషేన్‌రాజు సభను కొద్దిసేపు వాయిదా వేసి మళ్లీ కొనసాగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కాలయాపనపై చర్చించేందుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా మండలి చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు.
సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చకు డిమాండ్ చేస్తున్న సభ్యులు
మా రాజీనామాలు ఆమోదించండి..
సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ సభ్యులు కలసి వారిని ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. ఆ ముగ్గురూ పోడియం పైకి వెళ్లి చైర్మన్‌ను కలసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞాపన పత్రాలు అందించారు. మీ రాజీనామాల అంశం పరిశీలనలో ఉందని, వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ స్పష్టం చేశారు.
బడ్జెట్‌పై చర్చను అడ్డుకున్న మంత్రులు
శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు బడ్జెట్‌పై మాట్లాడుతున్న సమయంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు పదేపదే అడ్డుపడి రభస సృష్టించారు. వైఎస్సార్‌సీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి బడ్జెట్‌పై చర్చను ప్రారంభించగానే మంత్రులు, కూటమి సభ్యులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చర్చ పక్కదారి పడుతోందని, బడ్జెట్‌పైనే మాట్లాడాలంటూ చైర్మన్ సహనంతో పలుమార్లు కోరినా మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి, అనిత, సవిత పదేపదే అడ్డు తగులుతూ చర్చ కొనసాగనివ్వకుండా చేశారు.
విధిలేని పరిస్థితుల్లో చైర్మన్ పది నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు అదే ధోరణి కొనసాగించారు. చర్చ పూర్తిగా తప్పుదోవ పట్టి గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
సర్వనాశనం చేసింది బాబే: బొత్స
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని, మళ్లీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాష్ట్రాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాశనం చేశారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో అందుకు అనుగుణంగా కేటాయింపులు జరపలేదన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు కోరటాన్ని తప్పుబడితే ఎలా? అని ప్రశ్నించారు. హామీలు ఎలా అమలు చేస్తారు? ఎప్పుడు నెరవేరుస్తారు? అని అడిగితే అందులో తప్పు ఏముందన్నారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక చర్చను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
ఏం జరిగిందంటే..?
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పారీ్టలు హామీ ఇచ్చినట్లుగా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు.. రైతులకు రూ.20,000, మహిళలకు నెలకు రూ.1,500 లాంటి పథకాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే బడ్జెట్‌లో ఈ పథకాలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని చెబుతుండగా.. మంత్రి సవిత, అనిత, పయ్యావుల కేశవ్ ఆమెను పదేపదే అడ్డుకున్నారు.
సభ్యులు ప్రసంగించకుండా మంత్రులు ఈ విధంగా పదేపదే అడ్డుపడటం సరికాదని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సభ్యుల ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే వాటిని నోట్ చేసుకొని సమాధానం ఇచ్చే సమయంలో వివరణ ఇస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా సభలో ఏ విధంగా నడుచుకోవాలి? ఎలా మాట్లాడాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
అనంతరం వరుదు కళ్యాణి తిరిగి చర్చను ప్రారంభిస్తూ దీపం–2 పథకం కింద మూడు ఉచిత సిలెండర్లకు రూ.3,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో కేవలం రూ.800 కోట్లే కేటాయించారని ప్రస్తావిస్తుండగా.. మంత్రి అనిత నిలబడి ఆమెను అడ్డుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని కళ్యాణి మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా వీరాంజనేయస్వామి లేచి నిలబడి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
మీ నాయకుడు పారిపోయి ఇంట్లో పడుకున్నారు..! త్వరలో మీరూ పారిపోతారంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులను రెచ్చగొట్టడంతో సభలో అలజడి చెలరేగింది. ఇంతలో హఠాత్తుగా నారా లోకేశ్ లేచి నిలబడి అసందర్భ చర్చను తెరపైకి తెచ్చారు. గౌరవ సభలో మా తల్లిని అవమానించారని, అందుకే ఆగ్రహంతో మాట్లాడుతున్నాం అంటూ ఊగిపోయారు. అయితే రికార్డుల్లో లేని విషయాలు, సభలో లేని వ్యక్తులను ప్రస్తావించి చర్చ చేయడం సరికాదంటూ బొత్స వారించారు. ఇరుపారీ్టల సభ్యులు వాగ్యుద్ధానికి దిగడంతో చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment