కొనసాగుతున్న అరాచకపర్వం | Harassment of social media activists | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అరాచకపర్వం

Published Thu, Nov 14 2024 5:20 AM | Last Updated on Fri, Nov 15 2024 11:14 AM

Harassment of social media activists

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు 

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదు 

పోలీసుల అదుపులో పలువురు 

కుటుంబసభ్యులకు వివరాలు చెప్పని వైనం 

మఫ్టీలో ముట్టడించి ప్రసాద్‌రెడ్డిని తీసుకెళ్లిన రాయదుర్గం పోలీసులు 

సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్‌ నిమిత్తం జైళ్లకు తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు.. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. అనే విషయాలను కుటుంబసభ్యులకు కూడా చెప్పడంలేదు. 

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు అత్యుత్సాహంగా కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రిమాండ్‌ నిమిత్తం జైళ్లకు తరలించారు.

ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన కాపారపు వెంకటరమణను అరెస్టు చేసిన సీఐ శ్రీనివాస్‌రావు కాకినాడ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించారు. 

పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిలను మంగళవారం ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్‌ నిమిత్తం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సబ్‌జైలుకు తరలించారు. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన పఠాన్‌ అయూబ్‌ఖాన్, పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన అన్నంగి నరసింహస్వామి, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన జనికుల రామాంజనేయులుపై కందుకూరులోను, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కురమయ్యగారి హనుమంతరెడ్డిపై నెల్లూరు జిల్లా సంగం పోలీస్‌స్టేషన్‌లోను కేసులు నమోదు చేశారు. రాయవరం ప్రాంతానికి చెందిన ఖండవిల్లి సునీల్‌కుమార్, కోరుకొండకు చెందిన లగవత్తుల శివసత్యకుమార్, కనిగిరికి చెందిన హరీశ్వర్‌రెడ్డి, కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కాకరపర్తి శ్రీనివాస్‌పై విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. 

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన ప్రసాద్‌రెడ్డిని బుధవారం మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్టు చేసిన నకిరేకల్‌కు చెందిన పి.రాజశేఖర్‌రెడ్డిని నూజివీడు తరలించారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా పశ్చిమగోదావరి జిల్లా కో–కన్వినర్లు పాటూరి దొరబాబు, కమతం మహేష్‌లకు 41ఏ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.  



శ్రీరెడ్డిపై కేసు నమోదు
టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్‌ మీడియా యాక్టివిస్ట్, సినీనటి మల్లిడి శ్రీరెడ్డిపై మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని బొమ్మూరు పొలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌ కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి మరో ఫిర్యాదు చేశారు. 

రాంగోపాల్‌వర్మకు నోటీసులు 
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ శివరామయ్య బుధవారం హైదరాబాద్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు అందించారు. ఈనెల 19న మద్దిపాడు స్టేషన్‌­కు రావాల్సిందిగా అందులో కోరారు. వ్యూహం చిత్రం నిర్మించే సమయంలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్, బ్రాహ్మణిని అవమానించేలా పోస్టింగ్‌లు పెట్టారంటూ రెండురోజుల కిందట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. 

పోసానిపై ఫిర్యాదులు
సినీనటుడు పోసాని కృష్ణమురళీ టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడును అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ నేతలు బాపట్ల సీఐ అహ్మద్‌జానీకి ఫిర్యాదు చేశారు. సీఎం తదితరులపై అసభ్య పోస్టులు పెట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు గుంటూరు, నరసరావుపేటల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement