
అదే రోజు ఉదయం వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు
కేసులు నమోదవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయసహాయం
16 నాటికి పార్టీ మండల కమిటీల నియామకాలు పూర్తిచేయండి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయా వర్గాల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 12న అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు ర్యాలీలను, జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అదే రోజున వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..
» నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి మోసగించిన వైనం, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం ఇలా విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయా వర్గాల పక్షాన పోరుబాటకు సిద్ధమయ్యాం. ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం. యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, యువకులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలి.
» కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ.. రైతులకు అండగా నిలుస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. ఆ తర్వాత విద్యుత్ చార్జీలపై చేసిన కార్యక్రమం కూడా అదే స్థాయిలో విజయవంతమైంది. జిల్లాల పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ మూడో కార్యక్రమాన్నీ(యువత పోరు) విజయవంతం చేయాలి.
» యువత పోరుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. జిల్లా స్థాయిలో జరుగుతున్న కార్యక్రమమైనందున ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విజయవంతం చేయాలి.
» 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి చోటా ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి, మన పార్టీపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి. ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే పూర్తి చేసుకుని అనంతరం యువత పోరు కార్యక్రమం నిర్వహించాలి. యువత పోరు కార్యక్రమం ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ రోజు యధావిధిగా కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచించారు. అంతేకాక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాల నుంచి రాష్ట్రస్థాయి వరకూ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి.
» సోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు. వారికి న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్ధంగా ఉంది. ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి.
» వైఎస్సార్‌సీపీ మండల స్థాయి వరకూ కమిటీల నియామకం కూడా ఈ నెల 16 నాటికి పూర్తి చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. అవసరమైతే రాష్ట్ర స్థాయి నాయకుల సహకారం తీసుకుని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment