రాజకీయం అంటే నాలుక మడతేయడమేనా? బాబు మార్కు రాజకీయాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం.. అధికారంలోకి రాగానే అవన్నీ మరచిపోయి సుద్దులు చెప్పడం! ఈ విషయంలో ఇప్పుడు బాబుకు పవన్ తోడైనట్టు కనిపిస్తోంది. నేనంటే నేను అన్న చందంగా మాటమార్చే విషయంలో ఇరువురూ పోటీ పడుతున్నారు కూడా. రాష్ట్రంలో అరాచకాలను కట్టడి చేయాల్సిన వీరే వాటిని ఉసిగొలుపుతున్నట్లుగా ఉందీ ప్రస్తుతం పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్ట్‌లు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసు అధికారులను తమ చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్న బాబు అండ్ కో చట్టాలను అతిక్రమిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేసులు, అరెస్ట్‌లను దాటి పోలీసులు వీరిపై నీచాతినీచంగా బూతులు తిడుతున్నారన్న వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబుల వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత జగన్ తాము మళ్లీ అధికారంలోకి వస్తామని అప్పుడు ఇలా అకృత్యాలకు పాల్పడ్డ పోలీసు అధికారులు చట్ట ప్రకారం శిక్షకు గురవుతారని హెచ్చరించారు. కానీ.. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వక్రీకరించి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఐపీఎస్ అధికారులనే బెదిరిస్తున్నారా? అంటూ పవన్ జగన్‌ను విమర్శించే ప్రయత్నం చేశారు. సూమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు కూడా.
సినీ నటుడిగా పవన్ పౌరుల హక్కుల కోసం పోరాడే హీరో పాత్రలో బోలెడు పోషించారు పవన్. రాజకీయ జీవితంలో మాత్రం వాటిని హరించేలా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు అల్లర్లు చేసినా, దొమ్మీలకు పాల్పడ్డ అసలు ఎలాంటి చర్యలూ తీసుకోరాదన్నట్టు వపన్ మాట్లాడిన విషయం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి మంత్రి రోజాపై జనసేన కార్యకర్తల దాటికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకుంటే పవన్ చేసిన హడావుడిని అందరూ చూసే ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్‌కు మద్దతుగా నిలిచారు.
మంత్రిపై దాడి జరగడం ప్రభుత్వ తప్పు అన్నట్లు ప్రచారం చేశారు. ఇక స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బాబుకు పవన్ వత్తాసు పలకడం.. శాంతి భద్రతల సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ఆయన్ను అడ్డుకుంటే రోడ్డుపై పడుకుని యాగీ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉండే ఉంటుంది. ఒక దశలో చంద్రబాబు పోలీసులనే నేరుగా సంఘ విద్రోహశక్తులన్నట్టు చిత్రీకరించారు. వారిని బెదిరించిన సందర్భాలైతే లెక్కలేనన్ని. తండ్రి తీరు ఇలా ఉంటే.. ఆయన కుమారుడు లోకేష్ రెడ్‌బుక్ అంటూ పోలీసు అధికారులను పేర్లు చెప్పి మరీ బెదిరించిన వైనం చూశాం. పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు దొమ్మీకి దిగి పోలీసు వాహనాన్ని దగ్ధం చేయడమే కాకుండా.. వారిపై రాళ్లూ విసిరారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. అంత జరిగినా అప్పట్లో పవన్ పోలీసులపై కనీస సానుభూతి చూపలేదు. అప్పట్లో ఈనాడు వంటి మీడియా సంస్థలు ఏ చిన్న గొడవ జరిగినా చిలువలు పలువలుగా చేసి కథనాలు రాయడం.. వాటిని అందుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోవడం మనం చూశాం. ఎక్కడైనా మానభంగాలు జరిగితే ప్రభుత్వంపై వారు అప్పట్లో దారుణమైన విమర్శలు చేసేవారు.
2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్యోదంతం ఇందుకు ఒక ఉదాహరణ. తాము అధికారంలోకి వస్తే ఈ కేసురె మొదటగా తీసుకుంటామని నాటకీయంగా చెప్పారు. పవర్‌లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ కేసును ఏమి చేశారో తెలియదు. రాష్ట్రంలో 35 వేల మంది మహిళలు తప్పిపోయినా ప్రభుత్వం ఏం చేస్తోందని, పోలీసులు ఏమయ్యారని కూడా అప్పట్లో పవన్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఊసే ఎత్తడం లేదు.
మంగళిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో రోడ్ల ఆక్రమణలు తొలగింపుపై నిరసన తెలిపేందుకు పవన్ వెళుతూండగా పోలీసులు వారించారు. అయినాసరే ఆయన కారుపై కూర్చుని మరీ నాటకీయ ఫక్కీలో అలజడి సృష్టించారు. అయినా ఆనాటి ప్రభుత్వం పవన్ పై ఎప్పుడూ కేసులు పెట్టలేదు. అలాగే పోలీసులను పలుమార్లు దూషించిన చంద్రబాబు, లోకేష్‌లను కూడా ఏమీ చేయలేదు. ప్రస్తుత మంత్రి అచ్చన్నాయుడు గతంలో పోలీసులను ఎంత నీచంగా దూషించారో వినాలన్నా ఇప్పుడు సిగ్గేస్తుంది.
ఇప్పుడు వీరందరికి అధికారం దక్కిందో లేదో.. స్వరం మార్చారు. పోలీసు శాఖలో ఎవరైనా రూల్ ప్రకారం వెళితే ఊరుకోవడం లేదు. వెంటనే బదిలీ చేస్తున్నారు. కడప ఎస్పి బదిలీనే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు నెల రోజులలో పోలీసులను సెట్ చేస్తానంటే ఇదా అని అంతా విస్తుపోతున్నారు. ఇప్పటికి 680 మందికి నోటీసులు ఇవ్వడం, 147 మందిపై కేసులు పెట్టడం, 49 మందిని అరెస్టు చేయడం అసాధారణ చర్యగా కనిపిస్తుంది. మరి వైసీపీ నేతలను దూషిస్తూ కామెంట్లు పెట్టిన ఒక్కరిపై కూడా కేసు రాలేదు. అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చని ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని, విద్యార్ధినులు, మహిళలపై దాడులను సమాజమే ఎదుర్కోవాలని ఆయన సూక్తి ముక్తావళి వల్లిస్తున్నారు. ఒకపక్క వైసీపీ వారిపై ఇంత అక్రమ కేసులు పెడుతూ, అత్యాచారాలు చేసిన వారిని పట్టుకోలేమన్న సంకేతం ఇచ్చే విధంగా పవన్ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈయన హోం మంత్రి అయితే మాత్రం ఒరిగేది ఉంటుంది? వైసీపీ పాలన అయితే ఏమి జరిగినా జగన్ బాధ్యత వహించాలి. కూటమి పాలనలో మాత్రం సమాజమే రక్షించుకోవాలన్న మాట. అధికారులను బెదిరిస్తే కేసులు అని అంటున్న పవన్ కళ్యాణ్ ముందుగా గతంలో తనతోసహా చంద్రబాబు, లోకేష్‌లు చేసిన దూషణలకు సుమోటోగా కేసు పెట్టించుకుంటారా? అంతెందుకు ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని చెప్పిన సందర్భంలో పోలీసులను ఉద్దేశించి ఆయన ఏమన్నారో మర్చిపోతే ఎలా? చిన్నపిల్లలపై అత్యాచారం కేసులో పోలీసులు కులం చూసి చర్య తీసుకోవడం లేదని అన్నారంటే ఆ పోలీసు అధికారికి ఎంత అవమానం? కూటమి ప్రభుత్వానిది ఎంత అసమర్థత?
వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి పచ్చ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు చేస్తోంది అన్నది వాస్తవం. తప్పు ఎవరు చేసినా తప్పే అన్నట్లు కాకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎదురయ్యే పరిణామాలకు ఆ శాఖ బాధ్యత కూడా వహించదా? ఒక మోసకారి నటి వ్యవహారంలో తప్పుడు కేసులు పెట్టారంటూ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా పోలీసు అధికారులు ఇష్టారీతిన దౌర్జన్యాలకు దిగుతుంటే, బూతులు తిడుతుంటే, దానిపై ప్రతిపక్షంగా వైసీపీ అధినేత జగన్ స్పందించకుండా ఎలా ఉంటారు? మాట్లాడకపోతే ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం నిలబడుతుంందా? వైసీపీ నేత పేర్నినాని ఓపెన్ గా తుళ్లూరు డీఎస్పీ పేరు చెప్పి మరీ ఆయన చేస్తున్న ఘాతుకాలను మీడియాకు తెలిపారు.
దానికి ఆ అధికారి ఏమి జవాబు ఇస్తారు? అలాగే ఆరబ్ దేశాలలో ఫలానా శిక్ష వేస్తారని చెబుతూ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన మరో ఐపీఎస్ అధికారికి నాని సవాల్ విసిరారు. చట్ట ఉల్లంఘన చేసే పోలీసు అధికారులకు కూడా ఆయా దేశాలలో ఉరి శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ సోషల్ మీడియాను అంతం చేయడానికి, వారిని భయభ్రాంతులను చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతాయని మరో నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
గతంలో ఒక నాయకుడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ టీవీలలో రోజూ మాట్లాడుతుంటే పోలీసులు కేసు పెట్టారు. ఆయనను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో తనను పోలీసులు హింసించారని ఆయన ఆరోపించి, అసలు కేసును పక్కదారి పట్టించారు. నిజంగానే అప్పుడైనా ఆయనపై పోలీసులు దౌర్జన్యం చేసి ఉంటే ఎవరూ సమర్థించరాదు. అప్పట్లో ఒక నాయకుడికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టి నానా అల్లరి చేసిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఇన్ని వందల మంది మీద పోలీసులతో ఎలా దౌర్జన్యాలు చేయిస్తారు? దూషణలు చేయిస్తారు? అంటే ఈ దేశంలో పలుకుబడి, డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యుడికి మరో న్యాయం అన్నది మరోసారి రుజువు కావవడం లేదా? ఆయా వ్యవస్థల్లో ఇంతగా వివక్ష ఉంటే ఈ సమాజంలో అశాంతి ప్రబలకుండా ఉంటుందా? విద్వేషాలు మరింతగా పెరగవా? వాటి పరిణామాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించవా? ఒక్కసారి కట్టు తప్పితే ఎంత ప్రమాదమో సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడుకు తెలియకుండా ఉంటుందా? బహుశా ఈ పరిణామాలు, ఇన్ని విషయాలు సినీ నటుడు కూడా అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియకపోవచ్చు. అందుకే ఆయన తన అధికారంతో ఎవరిని ఏమైనా చేయవచ్చని భ్రమపడుతున్నారు.నిజంగానే పవన్ అలా అరాచకంగా ప్రవర్తిస్తే, భవిష్యత్తులో తన మెడకే గుదిబండలు అవుతాయని గ్రహిస్తే మంచిది.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment