టీడీపీ పెద్దల డైరక్షన్.. పోలీసుల యాక్షన్!
పార్టీ ప్రధాన కార్యాలయం నుంచే కుట్ర రచన
అక్రమ కేసులు, అసభ్య పోస్టులు పోలీసుల నిర్వాకమే
చంద్రగిరిలో బాధిత బాలిక తండ్రి పేరుతో తప్పుడు ఫిర్యాదు
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై తప్పుడు పోక్సో కేసు
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వెనుకా పోలీసుల పాత్ర
రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై వందలాదిగా నమోదు చేస్తున్న అక్రమ కేసుల వెనుక ఉన్న అసలు పన్నాగం ఏమిటన్నది కూడా స్పష్టమైంది. అక్రమ కేసులతో వేధింపులు.. అక్రమ నిర్బంధాలతో రోజుల తరబడి థర్డ్ డిగ్రీతో సృష్టిస్తున్న అరాచకం.. వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నదాష్టీకం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందని నిగ్గు తేలుతోంది.
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ కేసుల కుట్ర బట్టబయలైంది. పోలీసులను పాత్రధారులుగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా సాగిస్తున్న అరాచక పర్వం గుట్టు ఆధారాలతో సహా రట్టు అయింది. బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలిచారన్న ఒకే ఒక్క కారణంతో మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏకంగా అక్రమంగా పోక్సో కేసు పెట్టేంతగా బరితెగించిన పోలీసు వ్యవస్థ బండారం బయట పడింది.
తెల్ల కాగితాలపై సంతకం చేయించుకుని పోలీసులే తప్పుడు ఫిర్యాదు రాసి అక్రమ కేసు నమోదు చేసేంతగా దిగజారారన్న నిజం విభ్రాంతి కలిగించింది. ఓ మాజీ శాసనసభ్యుడిపై అక్రమ కేసు నమోదు చేసేందుకే అంతటి కుతంత్రం పన్నిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు వత్తాసు పలికిన పోలీసు వ్యవస్థ తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ప్రకాశం జిల్లాలో మరో నిర్వాకం
విశాఖపట్నానికి చెందిన ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు నవంబరు 4న అక్రమంగా అదపులోకి తీసుకుని, దర్శి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నవంబరు 5న ఆయన సెల్ ఫోన్‌ను అన్‌లాక్ చేయించి, స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారు. ఆయనపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఆయన మొబైల్ ఫోన్ నుంచి ఓ అసభ్యకర పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ తర్వాత ఆ పోస్టు ఎందుకు పెట్టావని ఆయన్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో ఆ బాధితుడు ఎదురు తిరిగాడు. తన మొబైల్ ఫోన్ నవంబరు 5 నుంచి పోలీసుల జప్తులోనే ఉంటే.. తాను నవంబరు 11న ఎలా పోస్టు పెట్టగలనని ప్రశ్నించారు. ఇంతలో ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు వెంటనే అతన్ని విశాఖపట్నం తరలించారు. అక్కడ నుంచి అనకాపల్లి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.
చివరికి ఏదో పాత అంశాన్ని సాకుగా చూపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించారు. కాగా, టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసిన రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు సూత్రధారులుగా.. రాష్ట్రంలోని పోలీసు అధికారులు పాత్రధారులుగా ఈ అక్రమ కేసుల కుతంత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నారన్నది స్పష్టమైంది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
తెల్ల కాగితాలపై సంతకాలతో కుట్ర
రెడ్‌బుక్ రాజకీయ కుట్రలను అమలు చేయడంలో తాము నాలుగాకులు ఎక్కువే చదివామంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. అందుకోసమే గతంలో చంద్రబాబు వద్ద భద్రతా అధికారిగా పని చేసిన పోలీసు అధికారిని ప్రత్యేకంగా తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై తెప్పించుకుని తిరుపతిలో కీలక పోస్టింగ్ ఇచ్చారు. ఆయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసు వ్యవస్థ ప్రతిష్టనే పణంగా పెట్టేశారు.
ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికను కొందరు దుండగులు అపహరించుకుపోయి వేధించారు. దాంతో ఆ బాలిక తండ్రి ఆవేదనతో తమకు న్యాయం చేయాలని బోరుమన్నాడు. విషయాన్ని చెవిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి బాలిక తండ్రికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు.
ఉదాసీనతపై సర్వత్రా నిరసన
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. పోలీసు వ్యవస్థ చేతగానితనం, ప్రభుత్వ పెద్దల ఉదాసనీతపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుతోంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో బాలికపై జరిగిన దాడిని వక్రీకరించి ఏకంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి వేధించాలని ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. దాన్ని అమలు చేసే బాధ్యతను తిరుపతి జిల్లా పోలీసులు భుజానికెత్తుకున్నారు.
బాధిత బాలికకు న్యాయం చేస్తామని మాయ మాటలు చెప్పి, ఆమె తండ్రితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత తమ కుట్రను అమలు చేశారు. బాధిత బాలిక తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు ఆ తెల్లకాగితాలపై పోలీసులు రాసేశారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతరులపై అక్రమ కేసు పెట్టి ఏకంగా పోక్సో చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, కేంద్ర ఐటీ చట్టంలతోపాటు ఏకంగా 11 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాస్త ఆలస్యంగా వాస్తవాన్ని గుర్తించిన బాధిత బాలిక తండ్రి పోలీసుల కుట్రను ఆదివారం బట్టబయలు చేశారు. తాను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపైగానీ, ఇతరులపైనా గానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులే ఇదంతా చేశారని కుండబద్దలు కొట్టారు. దాంతో తిరుపతి జిల్లా పోలీసుల కుట్ర బట్టబయలైంది.
Comments
Please login to add a commentAdd a comment