సినీనటుడు పోసానిపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు
శ్రీరెడ్డిపై కేసుల నమోదు, ఇద్దరు సోషల్‌మీడియా యాక్టివిస్టుల అరెస్టు
మరో ఇద్దరిని జైలుకు తరలించిన పోలీసులు
సజ్జల భార్గవ్ సహా ముగ్గురిపై అట్రాసిటీ కేసు
సాక్షి నెట్‌వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్‌పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
నటుడు పోసానిపై..
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్‌టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
నటి శ్రీరెడ్డిపై..
సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు.
ఇద్దరికి రిమాండ్
తిరుపతి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్‌రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు.
ఇద్దరి అరెస్టు
కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు
జనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్‌లో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, సిరిగిరి అర్జున్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment