గత పదేళ్లలో ఒకటి కన్నా ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలి..
వాటిని తప్పనిసరిగా కోర్టు విచారణకు స్వీకరించాలి
అటువంటి వారిపైనే వ్యవస్థీకృత నేరం కింద కేసు పెట్టొచ్చు
బీఎన్‌ఎస్ సెక్షన్ 111పై ఒకింత స్పష్టతనిచ్చిన హైకోర్టు
ఒక అంశంలోని కొన్ని భాగాల ఆధారంగా అసభ్యతను నిర్ధారించకూడదు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ శివశంకర్‌రెడ్డి కేసులో స్పష్టంచేసిన హైకోర్టు
ముందస్తు బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరమంటూ కొందరిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న అడ్డగోలు కేసుల విషయంలో హైకోర్టు ఒకింత స్పష్టతనిచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లను కించపరిచేలా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివశంకర్‌రెడ్డి ఫేస్బుక్లో పోస్టులు పెట్టారంటూ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పులి శ్రీనివాసరావు గత నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శివశంకర్‌రెడ్డిపై పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్... బీఎన్‌ఎస్ సెక్షన్ 111 గురించి కొంతమేర స్పష్టతను ఇస్తూ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు.
‘ఏవరైనా ఒక వ్యక్తిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే... అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలి. వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి. బీఎన్‌ఎస్ సెక్షన్ 111 మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టంతోపాటు గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాలను పోలి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ చట్టాలు ఏ సందర్భాల్లో వర్తిస్తాయో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది.
ఆ చట్టాలు కూడా నిందితునిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలని, వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి అని చెబుతున్నాయి. కేరళ హైకోర్టు సైతం ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.’ అని స్పష్టంచేశారు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు బీఎన్‌ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందా? లేదా? అన్నది దర్యాప్తు అధికారి తన విచారణలో తేల్చాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.
ఐటీ యాక్ట్ సెక్షన్–67 పైనా స్పష్టత...
ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఏ సందర్భంలో వర్తిస్తుందన్న విషయంలోను న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. ‘అసభ్యంగా ఉన్న దాన్ని ఎల్రక్టానిక్ రూపంలో ప్రచురించడం, ప్రసారం చేయడం చేశారంటూ ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. ఏది అసభ్యత కిందకు వస్తుందన్న దాన్ని తేల్చే ముందు సమకాలీన విలువలను, జాతీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాలే తప్ప, సున్నిత మనసు్కలతో కూడిన సమూహం నిర్దేశించిన ప్రమాణాలను కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
అసభ్యతను నిర్ధారించే ముందు విషయం మొత్తాన్ని చూడాలే తప్ప, అందులో ఓ భాగం ఆధారంగా అసభ్యతను నిర్ణయించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది’అని జస్టిస్ హరినాథ్ తన తీర్పులో గుర్తుచేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పిటిషనర్ పెసల శివశంకర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.10వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని అతన్ని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment