
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే.
పేర్ని నాని(Perni Nani) సతీమణి పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమైందన్న అభియోగాలతో కూటమి ప్రభుత్వం కిందటి ఏడాది డిసెంబర్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో జయసుధ పేరును ఏ1గా, ఏ2గా గోదాం మేనేజర్ మానస్ తేజ్, మిల్లు యాజమాని బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను మిగతా నిందితులుగా చేర్చారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజరు కాగా.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే ఈ అభియోగాలను ఖండించిన పేర్ని నాని.. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసేనని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్(Anticipatory Bail) కోసం ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించగా.. చివరకు ఊరట దక్కింది.
వైవీ విక్రాంత్ రెడ్డికి ఊరట
మరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్ రెడ్డి(YV Vikrant Reddy)కి కూడా ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకినాడ పోర్టు, సెజ్ కు సంబంధించి 41 శాతం వాటాలు బలవంతంగా లాగేసుకున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయితే కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనకు సంబంధం లేదని విక్రాంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ మంజూరు అయ్యింది.

Comments
Please login to add a commentAdd a comment