రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు
విపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం వేధింపులు
సంబంధం లేని చట్టాలు, సెక్షన్ల ప్రయోగం
సోషల్ మీడియా పోస్టులపై ఇతర చట్టాల కింద అక్రమ కేసులు
చివరకు మహిళ అయిన సుధారాణిపైనా పోక్సో కేసు
సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నందుకు ఆమెపై వేధింపులు
ఇది అత్యంత దారుణ చర్య అంటున్న న్యాయనిపుణులు
రాష్ట్రంలో అనేక మందిపై సంబంధం లేని సెక్షన్ల ప్రయోగం
వ్యవస్థీకృత నేరాలు, పోక్సో, ఎస్సీ–ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధింపుల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. ఇందుకోసం సెక్షన్లు మార్చేస్తోంది. చట్టాల్ని ఏమారుస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు అందుకు ఉద్దేశించిన ఐటీ చట్టం ప్రకారం కాకుండా సంబంధంలేని ఇతర చట్టాల కింద పెడుతుండటం ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శనం.
చివరకు సుధారాణి అనే సోషల్ మీడియా యాక్టివిస్టుపైనా పోక్సో కేసు పెట్టడం ప్రభుత్వ దుర్నీతికి పరాకాష్ట. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ మహిళ మీద పోక్సో కేసు పెట్టడమే అత్యంత దారుణమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని, ఇదే కొనసాగితే ఎవరూ మనుగడ సాగించలేని దుస్థితి వస్తుందని చెబుతున్నారు.
బాధిత బాలికకు అండగా నిలిచినందుకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు పెట్టడం ప్రభుత్వ మరో బరితెగింపునకు నిదర్శనం. ఇలా నిత్యం రాష్ట్రంలో అనేక మందిపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోంది.
ఐటీ చట్టం స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ అక్రమ కేసుల పరంపర
వ్యక్తిగతంగా లేదా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయడం భావ ప్రకటన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే కేంద్ర ఐటీ చట్టం కింద మాత్రమే కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది.
కానీ కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టం కింద కాకుండా ఇతర చట్టాల కింద కూడా కేసులు పెడుతూ పౌర హక్కులను ఉల్లంఘిస్తోంది. బీఎన్‌ఎస్ సెక్షన్ 111, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం.. ఇలా వివిధ చట్టాల కింద కుట్రపూరితంగా కేసులు పెడుతోంది.
అందుకు కొన్ని ఉదాహరణలు..
» ఇప్పటివరకు 30 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టంతోపాటు బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్ వ్యవస్థీకృత నేరాల కట్టడికి ఉద్దేశించింది. అంటే ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు ఉద్దేశించినది. కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం తెగింపు ధోరణే.
» 9 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా అక్రమ కేసులు నమోదు చేశారు. అసలు ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించడం ఎస్సీ, ఎస్టీ వేధింపు ఎలా అవుతుందోనని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
» మరో విడ్డూరం ఏమిటంటే.. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే వారిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టడం. గుంటూరు జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త, మహిళ సుధారాణిపైనా పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. కొద్దిరోజుల క్రితం సుధారాణి దంపతులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు.
దీనిపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో గుంటూరు, ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు షాక్ తగిలింది. దాంతో ఆమెపై ఏకంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వేధింపులకు గురి చేస్తున్నారు.
» చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికపై ఇద్దరు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె కుటుంబం తల్లడిల్లింది. సమాచారం తెలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే ఆయన చేసిన నేరమన్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనపై ఏకంగా పోక్సో కేసు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment