sudharani
-
జనం గుండెల్లో కట్టబొమ్మన్ ముద్ర
కొరుక్కుపేట: 200 ఏళ్లు దాటినా.. జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని హైదరాబాద్ చెందిన రచయిత్రి డాక్టర్ సగిలి సుధారాణి వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో నెలనెలా వెన్నెల నెట్ ఇంట్లో కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. దక్షిణాది తెలుగు సంస్థానాలు అనే అంశంపై రచయిత్రి డాక్టర్ సగిలి సుధారాణి వక్తగా పాల్గొని ప్రసంగించారు. దక్షిణాది తెలుగు సంస్థానాలు పాలించిన చోట నాటి రాజభవనాలు చాలావరకు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, ముఖ్యంగా చాళుక్య, చోళ, శాతవాహనులు, విజయనగరరాజుల ప్రతినిధులుగా సామంతులు, నాయకరాజులు ఇప్పటి తమిళప్రాంతాన్ని ఏలారని తెలిపారు. వీరి ప్రభావం సింహళానికి విస్తరించిందని చెప్పారు. ఆంగ్లేయులకాలంలో భారతదేశంలో వ్యాపారానికి వచ్చి, మనదేశాన్నే ఆక్రమించుకొని, మనవారిపైనే పన్నులు విధించారు. ఆ సమయంలో బ్రిటీష్ వారిపై దేశంలో అనేక చోట్ల తిరుగుబాట్లు జరిగాయన్నారు. భారతదేశ తొట్టతొలి స్వాతంత్య్ర సమర యోధురాలు రాణి వేలు నాచ్చియార్’, ఈమె రామనాథపురం కోటకు యువరాణి, శివగంగ సీమకు రారాణి అని తెలిపారు. అలాగే తొలి స్వాతంత్య్ర సమరయోధుడు (1755-1801) కట్టబొమ్మన్ తెలుగువాడు కావడం గొప్ప విషయం అన్నారు. వీరి వంశం పోరాటానికి పెట్టింది పేరని, కట్టబొమ్మన పూర్వులు పరాయి పాలనను ఎదురొడ్డి నిలిచారన్నారు. భవిష్యత్తు తరాల వారికి ఈ స్ఫూర్తిని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఆమె కొనియాడారు. 200 ఏళ్ల క్రితం ఉరితీయబడ్డా.. జనం గుండెల్లో చిరంజీవిగా ఉన్న కట్టబొమ్మన్నకు సమున్నత గౌరవ స్థానాన్ని తమిళనాడు ప్రభుత్వం అందించి, ఆ మహనీయునికి స్మృతిచిహ్నంగా స్థూపాన్ని కైయత్తార్ ప్రతిష్టించిందన్నారు. -
బొల్లినేని శ్రీనివాస గాంధీపై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కమిషనరేట్‌లో అవినీతి అధికారులను సీబీఐ పట్టుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబధించి జీఎస్టీ అవకతవకలను సరి చేయడానికి తెలంగాణ జీఎస్టీ కమిషనరేట్ ఉద్యోగులు సీహెచ్ సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. బొల్లినేని శ్రీనివాస గాంధీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇన్స్పెక్టర్గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్‌లో పోస్టింగ్ పొందారు. 2003లో డిప్యుటేషన్‌పై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్)కి వెళ్లారు. 2004లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత 2017లో జీఎస్టీకి బదిలీ అయ్యారు. గాంధీ దాదాపు 13ఏళ్ల పాటు ఈడీలో పనిచేశారు. ఈ సమయంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. (ఎల్లో మీడియా దుష్ప్రచారంపై రజత్ భార్గవ్ స్పష్టత) తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పని చేశారు. కేంద్ర మాజీమంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీలాండరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులను గాంధీ ఉద్దేశ్యపూర్వకంగా బుట్ట దాఖలు చేశారు. పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. బాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో అమరావతి ప్రాంతంలో భూమిని కూడా కట్టబెట్టినట్లు సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. -
కడచూపూ దక్కలేదు
ప్రకాశం, పొన్నలూరు: గుండెపోటుతో మృతి చెందిన వివాహిత భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకురాలేని విషాద ఘటన ఇది.. మండలంలోని కొత్తశింగరబొట్లపాలేనికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అప్పనబోయిన సుధారాణి (36) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో ఉంటోంది. ఆమె భర్త గోవిందరావు అక్కడే ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన సుధారాణికి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె భౌతిక కాయాన్ని కొత్తశింగరబొట్లపాలెం తీసుకొచ్చేందుకు అనుమతి లేక తిరుపతిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుటుంబ సభ్యులకు సెల్ఫోన్లో మృతదేహాన్ని, అంత్యక్రియల దృశ్యాన్ని చూపించి దహనం చేశారు. సుధారాణిని చివరిచూపు చూడలేక ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
మేయర్‌కు ముచ్చెమటలు పట్టించిన కార్పొరేటర్లు
సాక్షి, నెల్లూరు సిటీ: కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ అజీజ్‌కు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సీపీఎం, బీజేపీ కార్పొరేటర్లతో పాటు సొంత పార్టీ కార్పొరేటర్లు నిప్పో అంశంపై వ్యతిరేక గళం వినిపిస్తూ ముచ్చెమటలు పట్టించారు. ప్రజాసాధికార సర్వేను ఆధారం చేసుకుని ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. తప్పుల తడకగా సర్వేను చేయడం ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో నిరసన ప్రజా సమస్యలపై అధికార పార్టీకి చెందిన షేక్ వహిద, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఫ్లకార్డులతో కౌన్సిల్లో నిరసన తెలిపారు. సుధారాణి మాట్లాడుతూ లస్సీ సెంటర్లో డ్రైనేజీ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. షేక్ వహిద మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే తప్పుల తడకగా చేయడంతో లబ్ధిదారులు ఇళ్లు, పింఛన్లు కోల్పోతున్నారన్నారు. మళ్లీ సర్వే చేయించాలని కోరారు. డీసీపీని బదిలీ చేయండి కార్పొరేషన్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్ మండిపడ్డారు. తమ డివిజన్లోని అక్రమ భవనాలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. టీడీపీ కార్పొరేటర్ నూనె మల్లికార్జున్‌యాదవ్ మాట్లాడుతూ డీమార్ట్ మాల్ వద్ద సొంతంగా రోడ్డును వేసుకుంటున్నారని, ఎవరు అనుమతులు ఇచ్చారని డీసీపీ సూరజ్‌ను ప్రశ్నించారు. డీసీపీ సమాధానం చెప్పలేకపోవడంతో బదిలీ చేయాలని కోరారు. ఇళ్ల మంజూరులో స్పష్టత లేదు హౌస్ ఫర్ ఆల్ పథకం ఇళ్ల మంజూరులో స్పష్టత లేదని వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. 4800 ఇళ్లకు గానూ, 2050 ఇళ్లను మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మిగిలినవి ఎందుకు తిరస్కరించారో స్పష్టత లేకుండా ఉందన్నారు. నగదు చెల్లించినా తిరస్కరించిన విషయం ఆలస్యంగా అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు నష్టపోయారని తెలిపారు. టీడీపీ కార్పొరేటర్ మామిడాల మధు మాట్లాడుతూ పాలకుల వైఫల్యాలతో ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 40శాతం ఇంటి దరఖాస్తులు తిరస్కరణ 40శాతం ఇంటి దరఖాస్తులు తిరస్కరణకు గురైంది వాస్తవమే. సాధికార సర్వేలోని కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. సర్వే తప్పుల తడకగా చేసినట్లుగా ఫిర్యాదులు వస్తున్నందున మళ్లీ పూర్తిస్థాయిలో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – అలీంబాషా, కమిషనర్ -
ఏబీకే ప్రసాద్‌కు సతీవియోగం
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ సతీమణి సుధారాణి కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలకు ఆమె మృతి చెందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రుకు చెందిన సుధారాణిని, కృష్ణా జిల్లా ఉప్పులూరుకు చెందిన ఏబీకే ప్రసాద్ 1955లో వివా హం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు హేమలత, స్వర్ణలత, విశ్వభారతి, రాధి క ఉన్నారు. ఏబీకే ప్రసాద్ భార్య సుధారాణితో కలసి కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లోని వృద్ధాశ్రమంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. నివాళులర్పించిన ప్రముఖులు కిమ్స్ ఆస్పత్రి నుంచి మంగళవారం ఉదయం సుధారాణి భౌతికకాయాన్ని సీఆర్ ఫౌండేషన్‌కు తీసుకొచ్చారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వర్దెల్లి మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, వార్త ఎడిటర్ సాయిబాబా, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ, ఇతర పాత్రికేయ ప్రముఖులు నివాళులర్పించారు. ఏబీకే ప్రసాద్‌ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధారాణి చితికి నిప్పంటించిన సోదరుడు ఏబీకే ప్రసాద్ సతీమణి సుధారాణి అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. సుధారాణి చితికి ఆమె సోదరుడు చలసాని వేణుదుర్గాప్రసాద్ నిప్పంటించారు. సుధారాణి మృతితో చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వృద్ధాశ్రమంలోని పలువురు ప్రముఖులు సుధారాణికి నివాళులర్పించారు. ఆప్తురాలిని కోల్పోయామని కన్నీళ్లపర్యంతమయ్యారు. -
గులాబీ దళంలోకి సుధారాణి
ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో భేటీ? 29న టీఆర్ఎస్లో చేరే అవకాశం రాజకీయ భవిష్యత్తుకు నిర్ణయం వరంగల్ : తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న సుధారాణి తెలంగాణ కోటాలోనే రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె పదవీకాలం 2016 జూన్‌లో ముగియనుంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సుధారాణిని టీఆర్ఎస్లో చేర్చుకుంటే ఆ వర్గం తమవైపు ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వరంగల్, భూపాలపల్లి, పరకాల సెగ్మెంట్లలో ఈ సామాజిక వర్గానికి ఎక్కువగా ఓట్లు ఉండడం కలిసివస్తుందని టీఆర్ఎస్ ఆశిస్తోంది. ప ద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేతలు టీఆర్ఎస్లో కీలక స్థానంలో ఎవరూ లేరు. ఇలా పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆమె రెండు రోజుల్లో టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తీసుకుంటారని అనుచర వర్గాలు తెలిపాయి. కాగా, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్లో చేరనున్నట్లు వచ్చిన కథనాలతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మంగళవారం వరంగల్‌లోని ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఢిల్లీకి వెళ్లారని తెలియడంతో ఫోన్లో సంప్రదించేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు. ఇదే విషయూన్ని ఆయన పార్టీ అగ్రనేతలకు వివరించినట్లు సమాచారం. ఆది నుంచీ అసంతృప్తే.. తెలుగుదేశం పార్టీలో జిల్లాకు చెందిన ముఖ్యనేతలంతా కీలక సమయంలో తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని సుధారాణి పలుమార్లు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. 1999 వరంగల్ శాసనసభ ఎన్నికల్లో సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయానని అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మొరపెట్టుకున్నా స్పందన లేదు. 2006లో వరంగల్ మేయర్‌గా బరిలో దిగిన ఆమెను గెలిపించేందుకు వ్యూహాలు పన్నకుండా ఇష్టారాజ్యంగా జిల్లా నేతలు పలువురికి కార్పొరేట్ టికెట్లు ఇవ్వడంతో సుమారు వంద ఓట్ల తేడాతో ఏడుగురు ఓడిపోయారు. దీంతో మేయర్ పీఠం సుధారాణి చేజారింది. ఆమె కార్పొరేటర్‌గానే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయూలన్నీ గమనించిన టీడీపీ అధినేత ఆమెను 2011లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేశారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నించగా పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కేలా కొందరు నేతలు పావులు కదపడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు సుధారాణి దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు పలువురు ఆ పార్టీలో చేరారు. తన రాజకీయ ఎదుగుదలకు టీడీపీలో సహకారం అందించిన నేత టీఆర్ఎస్లో కీలక స్థానంలో ఉండడం.. సుధారాణి చేరికకు అనువుగా మారింది. ‘పుల్లా’ దంపతులు కూడా.. వరంగల్ : కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, సీనియర్ నాయకుడు పుల్లా భాస్కర్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వైఎస్ వర్గంగా పేరుపడిన పుల్లా దంపతులకు కాంగ్రెస్‌లో ఇటీవల ఆదరణ తగ్గగా, వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో వారు టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో వారు టీఆర్ఎస్లో చేరనున్నారు. -
డబ్బు కోసమే హత్య
వీడిన ఎస్వీయూ క్వార్టర్స్‌లో జరిగిన హత్య మిస్టరీ నిందితుడు మరిదే తిరుపతి క్రైం : ఈనెల 19వ తేదీన ఎస్వీయూనివర్సిటీ క్వార్టర్స్‌లో దారుణహత్యకు గురైన సుధారాణి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను డబ్బుకోసమే హత్యచేసినట్టు నిందితుడు అంగీకరించాడు. తిరుపతి అర్బన్ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల ఎదుట నిందితుని ప్రవేశపెట్టారు. ఏస్పీ త్రిమూర్తులు వివరాలు వెల్లడించారు. ఎస్వీయూ క్వార్టర్స్ ప్లాట్ నెం. 17లో నివాసం ఉంటున్న శివశంకర్ ఏఈవోగా పనిచేస్తున్నాడు. ఇతనికి అయిదుగురు సోదరులున్నారు. అందరికన్నా చిన్నవాడు శివశంకర్ చింతకాయల వీధిలో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. అన్నదమ్ములందరికీ పూర్వీకుల ఆస్తి ఉంది. దీనిని భాగపరిష్కారం చేయలేదని శివశంకర్ కుటుంబంపై మురళి కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శివశంకర్ 19వ తేదీ ఉదయం 8.30 నిమిషాలకు ఎప్పటిలా డ్యూటీకి వెళ్లాడు. అదే సమయంలో ఆయన కుమారుడు కిషోర్ కూడా స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. శివశంకర్ ఆఖరి తమ్ముడు మురళి సుమారు 10 గంటల సమయంలో అన్న ఇంటికి వచ్చాడు. అన్నదమ్ములకు నచ్చజెప్పి ఆస్తిలో భాగాలు పంచమని ఒదిన సుధారాణిని మురళి కోరాడు. ఖర్చులకు రూ.2 వేలు డబ్బు కావాలని అడిగాడు. సుధారాణి తన దగ్గర డబ్బు లేదని చెప్పింది. మరిదికి టిఫిన్ పెట్టి, కాఫీ ఇచ్చింది. తనకు డబ్బు ఇవ్వకపోవడంతో ఆమెను చంపాలని శివశంకర్ నిర్ణయించుకున్నాడు. ఇల్లంతా చూపించాలని ఒదినను అడిగాడు. ఆమె పూజగదిలోకి వెళ్లింది. ఆ సమయంలో వంటగదిలోని చపాతి కర్రను తీసుకుని దాచుకున్నాడు. ఆమెతో పాటు ఇల్లు చూస్తూ మొదటి అంతస్తులోకి వెళ్లాడు. బాల్కనీ తలుపులు తెరుస్తుండగా సుధారాణి తలపై వెనకనుంచి చపాతికర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఆమె ఎదపై విచక్షణా రహితంగా కొట్టాడు. తన వద్ద ఉన్న చిన్న కత్తితో గొంతు కోశాడు. అప్పటికీ ఆమె చనిపోకపోవడంతో ఇంట్లో ఉన్న దుస్తులు తీసి ఆమె మెడపై వేసి కాలితో ఊపరాడకుండా తొక్కాడు. దీంతో సుధారాణి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు మంగళసూత్రం, కమ్మలు, ముక్కుపుడక, నల్లపూసల దండ, రెండు ఉంగరాలు తీసుకుని పారిపోయాడు. ఈ కేసును ఛేదించడంలో యూనివర్సిటీ సీఐ రామకృష్ణ ఎంతో కృషి చేశారని ఏఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు రవిశంకర్ రెడ్డి, కొండారెడ్డి, యస్ఐ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య
ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ ఉద్యోగుల జంట మండలంలోని మావల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆదిలాబాద్‌లో కలకలం రేపింది. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ ఏఎస్సై పొచ్చన్న, ప్రత్యక్ష సాక్షి శ్రీకాంత్ కథనం ప్రకారం.. బోథ్ మండలం కౌట(బి) గ్రామానికి చెందిన రావుల తిరుపతిరెడ్డి కూతురు సుధారాణికి నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ఊరుర్ గ్రామానికి చెందిన సాయరెడ్డితో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సాయరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ డిపో-2లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుధారాణి కొంతకాలంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. పట్టణంలోనే నివాసం ఉంటోంది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన దార్ష రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్ ఆర్టీసీ అద్దె బస్సుపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య నుంచి విడాకులు పొందడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్(38), సుధారాణి(26)ల మధ్య ఏర్పడిన పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు తెలుస్తోంది. బుధవారం వారిద్దరూ కలిసి సీతాగొంది జాతీయ రహదారిపై ఉన్న దాబాలో భోజనం చేశారు. అక్కడి నుంచి సుధాకర్ స్నేహితుడు శ్రీకాంత్‌తో కలిసి మోటారు సైకిల్‌పై మావల చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్దకు వెళ్లిన తర్వాత శ్రీకాంత్ తమ ఆత్మహత్యను అడ్డుకుంటాడనే ఉద్దేశంతో వారు అతడిని చెరువు ఇవతలి వైపు తోసేశారు. ఆ తర్వాత సుధాకర్, సుధారాణి కలిసి చెరువులో దూకారు. శ్రీకాంత్ ఫిర్యాదుతో పోలీసులు వారి మృతదేహాలను వెలికి తీయించారు. వివాహేతర సంబంధం బయటకు పొక్కడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వివరించారు. సుధారాణి మృతదేహాన్ని తండ్రి తిరుపతిరెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. ఏదేమైనా ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య అటు కుటుంబాలతోపాటు డిపోలో విషాదాన్ని మిగిల్చింది.