ఆమె భర్త, పిల్లలను కూడా పోలీసు స్టేషన్లు తిప్పారు
దంపతులను చిత్రహింసలకు గురిచేశారు
హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో 8న జడ్జి ముందు హాజరుపరిచారు
శరీరంపై గాయాలను మేజిస్ట్రేట్‌కు చూపించిన సుధారాణి
గాయాలున్నట్లు వైద్యులూ సర్టిఫికెట్ ఇచ్చారు
41 ఏ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలన్న నిబంధనలు ఉల్లంఘించారు
ఆమె భర్తపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని అనుమానం
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు వెల్లడి
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, రోజులతరబడి ఆమెపైన, ఆమె భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా, మానసికంగా వేధించారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, వినయ్ కుమార్ చెప్పారు.\
వారు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదు రోజుల కిందట తెలంగాణలో గుడికి వెళ్లిన సుధారాణిని ఆమె భర్త, పిల్లలతో సహా పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలూరిపేటకు తీసుకొచ్చారని తెలిపారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టాల్సింది పోయి వారి నిర్బంధంలోనే ఉంచుకొని, చిత్ర హింసలకు గురి చేశారని చెప్పారు. ఆమెపై 6 అక్రమ కేసులు బనాయించారన్నారు. ఏ సంబంధం లేని ఆమె భర్తపైన కూడా కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. తాము హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో 8వ తేదీ సాయంత్రం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి, అక్కడి నుంచి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని చెప్పారు.
మేజిస్ట్రేట్‌కు గాయాలు చూపించిన సుధారాణి
పోలీసులు శారీరకంగా వేధించి, గాయపర్చారని సుధారాణి మేజిస్ట్రేట్‌కు ఓపెన్ కోర్టులో చెప్పారని, ఆ గాయాలను కూడా చూపించారని ఆమె తరఫు న్యాయవాది వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి చెప్పారు. తనను, భర్త వెంకటరెడ్డిని, పిల్లలను చిలకలూరిపేటకు తీసుకెళ్లారని, పిల్లలను వేరు చేసి భర్తతో పాటు తనను ఒంగోలు వన్‌టౌన్ పీఎస్‌కు తరలించినట్టు ఆమె మేజిస్ట్రేట్‌కు చెప్పారన్నారు. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేసినట్లు చెప్పారు. ఒంగోలు ఎస్పీ, ఒంగోలు సీఐ చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టారని సుధారాణి చెప్పడంతో చికిత్స, మెడికల్ రికార్డుల కోసం ఆమెను గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారన్నారు.
శరీరంపై గాయాలున్నట్టు వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో సుధారాణిని పోలీసులు హింసించినట్టు తేలిందని తెలిపారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడి, సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యవహరించడం దారుణమని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులపై ఏ బుక్స్ రాసుకోవాలో తమకు తెలుసని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేసి న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment