సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కమిషనరేట్‌లో అవినీతి అధికారులను సీబీఐ పట్టుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబధించి జీఎస్టీ అవకతవకలను సరి చేయడానికి తెలంగాణ జీఎస్టీ కమిషనరేట్ ఉద్యోగులు సీహెచ్ సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకు సంబంధించిన పలు డాక్యుమెంట్‌లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. బొల్లినేని శ్రీనివాస గాంధీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్‌లో పోస్టింగ్ పొందారు. 2003లో డిప్యుటేషన్‌పై డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్)కి వెళ్లారు. 2004లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత 2017లో జీఎస్‌టీకి బదిలీ అయ్యారు. గాంధీ దాదాపు 13ఏళ్ల పాటు ఈడీలో పనిచేశారు. ఈ సమయంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. (ఎల్లో మీడియా దుష్ప్రచారంపై రజత్ భార్గవ్ స్పష్టత)
తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పని చేశారు. కేంద్ర మాజీమంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీలాండరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులను గాంధీ ఉద్దేశ్యపూర్వకంగా బుట్ట దాఖలు చేశారు. పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. బాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో అమరావతి ప్రాంతంలో భూమిని కూడా కట్టబెట్టినట్లు సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment