సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సీబీఐ వరుసగా ఇచ్చిన అనేక నోటీసులకు ఆయన స్పందించక పోవడం, విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన్ను మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2019 జూలైలో గాంధీపై తొలిసారిగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ నమోదు చేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.5 కోట్ల లంచం అడిగారన్న ఫిర్యాదుతో 2020 సెప్టెంబర్‌లో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు ఉన్నా ఆయన 2020 డిసెంబర్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి సాధించడం గమనార్హం. అయితే ఆ తరువాత 2021 ఫిబ్రవరి 24న ఆయన్ను సెంట్రల్ జీఎస్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఉత్తర్వులిచ్చింది.
బదిలీలే లేవు..!
సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో 1992లో ఇన్‌స్పెక్టర్‌గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందాడు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోకి డెప్యుటేషన్‌పై వెళ్లి ఏడాదిపాటు అందులో పనిచేశాడు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన బొల్లినేని.. గతంలో ఎన్నడూ, ఎవరూ పనిచేయని స్థాయిలో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా ఈడీ (ఇన్వెస్టిగేషన్)లోనే విధులు నిర్వర్తించాడు. ఇలాంటి పోస్టుల్లో సాధారణంగా ఎవరికైనా రెండేళ్లే అవకాశం ఇస్తారు. మరీ అత్యవసరం అనుకుంటే మరో ఏడాది డెప్యుటేషన్ కొనసాగిస్తారు. అంతే తప్ప 13 ఏళ్లపాటు ఒకేచోట కొనసాగించిన దాఖలాలు లేవని సొంత శాఖ అధికారులే విస్తుపోతున్నారు.
పోస్టింగ్ వెనుక చంద్రబాబు హస్తం..!
నిబంధనలకు విరుద్ధంగా బొల్లినేనికి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైదరాబాద్ జీఎస్టీ, బేగంబజార్ రేంజ్‌కి బొల్లినేనిని సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. అక్కడ కూడా నిబంధనల ప్రకారం అతడికి దర్యాప్తు విభాగంలో పోస్టింగ్ ఇవ్వకూడదు. ఈ సమయాన్ని ‘కూలింగ్ పీరియడ్’ అంటారు. కానీ గాంధీ తనకున్న పరిచయాలతో కూలింగ్ పీరియడ్‌ను తప్పించుకొని యాంటీ ట్యాక్స్ ఎవేషన్ డిపార్ట్‌మెంట్ (బషీర్‌బాగ్)లో పోస్టింగ్ తెచ్చుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసులో బొల్లినేని వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలున్నాయి.
రూ.65 లక్షల జీతం.. రూ.200 కోట్ల ఆస్తులు!
2010–2019 వరకు పదేళ్లలో రూ. 65 లక్షలు జీతంగా అందుకున్న బొల్లినేని తన కుమార్తె మెడికల్ సీటుకే రూ. 70 లక్షలు చెల్లించడం గమనార్హం. ఇక ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ. 3.74 కోట్లు. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో తన ఇంటిని రూ. 1.20 కోట్లతో నిర్మించాడు. 2019 జూలై 8న బొల్లినేనిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, ప్రొద్దుటూరుతోపాటు హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బొల్లినేని భారీగా స్థిరాస్తులు సంపాదించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా గాంధీపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ అధికారులు బొల్లినేనిపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేశారు. భారీ ఎత్తున మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు.
చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం
చదవండి: పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ
బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్
Published Wed, Apr 21 2021 2:36 AM | Last Updated on Thu, Apr 22 2021 1:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment