
బరితెగించిన టీడీపీ నేతలు
తీవ్ర ఒత్తిడితో తుని మున్సిపల్ చైర్‌పర్సన్ రాజీనామా
సహచర కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకాండను చూడలేకే నిర్ణయం
టీడీపీ దాష్టికాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది..
మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి
తుని: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరో మెట్టు దిగజారింది. తెలుగుదేశం పార్టీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో గెలుపొందిన ఓ ప్రజాప్రతినిధిపై దారుణంగా ఒత్తిళ్లుతెచ్చారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ‘రాష్ట్రంలో తునికి ఉన్న మంచి పేరును టీడీపీ ప్రభుత్వం కాలరాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లను పోలీసుల సహకారంతో చిత్రహింసలకు గురి చేసింది.
సహచర కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకాండను చూడలేక కలత చెంది చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని ఆమె ఉద్వేగంతో చెప్పారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు. గత ఎన్నికల్లో తుని మున్సిపాలిటీ 30కి 30 వార్డులనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుందని తెలిపారు.
ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నిక కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే.. టీడీపీ గూండాలు కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించి అడ్డుకున్నారని, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, అధికారులు టీడీపీకి వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతియుత వాతావరణంలో వైస్ చైర్మన్ ఎన్నిక జరిపించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక పోలీసులను కోర్టు ఆదేశించినా.. అధికారులు అధికార పార్టీకి వంతపాడటంతో టీడీపీ దాష్టికాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. వీరి దారుణాల కారణంగా వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి కూడా వాయిదా పడిందని చెప్పారు.
కౌన్సిలర్లకు భద్రత కల్పించిన తనపై, తమకు అండగా నిలిచిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేయక తప్పడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సహచర కౌన్సిలర్లు 15 మందితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, కమిషనర్ వెంకట్రావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు.
మున్సిపల్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్‌గా కొనసాగుతానన్నారు. మహిళలతో కన్నీరు పెట్టించిన టీడీపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాగా తుని చైర్‌పర్సన్ రాజీనామా ఉదంతం రాష్ట్రంలో దిగజారిన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజీనామా నిర్ణయం తీసుకునేలా చేశారంటే ఎంత ఒత్తిడి చేశారో, ఎంతకు బరి
తెగించారో అర్ధం చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.
ప్రాణంపోయినా వైఎస్సార్‌సీపీని వీడేది లేదు : కౌన్సిలర్ జ్యోతి
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు టీడీపీ నాయకులు ఆదివారం రాత్రంతా నరకం చూపారని ఒకటో వార్డు కౌన్సిలర్ వారాధి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఇనుగంటి సత్యనారాయణ, మళ్ల గణేష్, డి.శ్రీనివాసరాజు తదితరులు తనను ఇంటి నుంచి బలవంతంగా బయటకు లాకెళ్లి వైఎస్సార్‌సీపీలోంచి టీడీపీలోకి చేరాలంటూ బెదిరించారని.. ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. ఈ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని, అదే జరిగితే దానికి టీడీపీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment