ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో భేటీ?
29న టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం
రాజకీయ భవిష్యత్తుకు నిర్ణయం
వరంగల్ : తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న సుధారాణి తెలంగాణ కోటాలోనే రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె పదవీకాలం 2016 జూన్‌లో ముగియనుంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సుధారాణిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే ఆ వర్గం తమవైపు ఉంటుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వరంగల్, భూపాలపల్లి, పరకాల సెగ్మెంట్లలో ఈ సామాజిక వర్గానికి ఎక్కువగా ఓట్లు ఉండడం కలిసివస్తుందని టీఆర్‌ఎస్ ఆశిస్తోంది. ప ద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో కీలక స్థానంలో ఎవరూ లేరు. ఇలా పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆమె రెండు రోజుల్లో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకుంటారని అనుచర వర్గాలు తెలిపాయి. కాగా, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు వచ్చిన కథనాలతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మంగళవారం వరంగల్‌లోని ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఢిల్లీకి వెళ్లారని తెలియడంతో ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు. ఇదే విషయూన్ని ఆయన పార్టీ అగ్రనేతలకు వివరించినట్లు సమాచారం.
ఆది నుంచీ అసంతృప్తే..
తెలుగుదేశం పార్టీలో జిల్లాకు చెందిన ముఖ్యనేతలంతా కీలక సమయంలో తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని సుధారాణి పలుమార్లు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. 1999 వరంగల్ శాసనసభ ఎన్నికల్లో సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయానని అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మొరపెట్టుకున్నా స్పందన లేదు. 2006లో వరంగల్ మేయర్‌గా బరిలో దిగిన ఆమెను గెలిపించేందుకు వ్యూహాలు పన్నకుండా ఇష్టారాజ్యంగా జిల్లా నేతలు పలువురికి కార్పొరేట్ టికెట్లు ఇవ్వడంతో సుమారు వంద ఓట్ల తేడాతో ఏడుగురు ఓడిపోయారు. దీంతో మేయర్ పీఠం సుధారాణి చేజారింది. ఆమె కార్పొరేటర్‌గానే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయూలన్నీ గమనించిన టీడీపీ అధినేత ఆమెను 2011లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేశారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నించగా పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కేలా కొందరు నేతలు పావులు కదపడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు సుధారాణి దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు పలువురు ఆ పార్టీలో చేరారు. తన రాజకీయ ఎదుగుదలకు టీడీపీలో సహకారం అందించిన నేత టీఆర్‌ఎస్‌లో కీలక స్థానంలో ఉండడం.. సుధారాణి చేరికకు అనువుగా మారింది.
‘పుల్లా’ దంపతులు కూడా..
వరంగల్ : కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, సీనియర్ నాయకుడు పుల్లా భాస్కర్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వైఎస్ వర్గంగా పేరుపడిన పుల్లా దంపతులకు కాంగ్రెస్‌లో ఇటీవల ఆదరణ తగ్గగా, వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో వారు టీఆర్‌ఎస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో వారు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
గులాబీ దళంలోకి సుధారాణి
Published Wed, Oct 28 2015 1:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement