టీడీపీ, కాంగ్రెస్‌ వ్యూహంలో చిక్కుకోవద్దనే.. | Kcr meet the governor esl narasimhan at rajbhavan | Sakshi
Sakshi News home page

టీడీపీ, కాంగ్రెస్‌ వ్యూహంలో చిక్కుకోవద్దనే..

Published Mon, Jul 23 2018 3:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kcr meet the governor esl narasimhan at rajbhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, పరిపాలన అంశాలను గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, తదనంతర పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్టు సమచారం. అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో పాల్గొనకుండా టీఆర్‌ఎస్‌ ఎంపీలు గైర్హాజరైన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఆచరణ సాధ్యం కాదని తెలిసినా టీడీపీ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.

టీడీపీ, కాంగ్రెస్‌ల రాజకీయ వ్యూహంలో చిక్కుకోవద్దన్న ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు గవర్నర్‌తో సీఎం అన్నట్టు తెలిసింది. ఇలాంటి మూస రాజకీయాలతో ప్రయోజనం ఉండదనే గుణాత్మక మార్పు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి మిషన్‌ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికి రక్షిత తాగునీటి సరఫరా ప్రారంభిస్తామని, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని గవర్నర్‌కు తెలిపారు.

రైతుబంధు పథకానికి అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న ప్రశంసలు, ఆగస్టు 15న ప్రారంభించనున్న రైతు జీవిత బీమా పథకాల విశేషాలను వివరించారు. కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్‌ భవ జీవిత బీమా పథకం మార్గదర్శకాల్లో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు గవర్నర్‌కు తెలిపారు. సమాచార హక్కు కమిషనర్లుగా రాజా సదారాం, బుద్ధా మురళీ నియామకాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కూడా గవర్నర్‌తో సీఎం చర్చించారు. వరుసగా రెండో ఆదివారం గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ కావడం విశేషం.

సీజేని కలిసిన సీఎం
గవర్నర్‌ నరసింహన్‌తో భేటీకి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement