మిగతా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ‘స్థానిక’ కోటా ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ మిగిలిన అయిదుగురు అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె. కేశవరావు.. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డి.శ్రీనివాస్, మంత్రి జూపల్లి కృష్ణారావులతో కలసి విలేకరులతో మాట్లాడారు. పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఆదివారం ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ నాయకత్వం, మిగిలిన ఐదు స్థానాలకు మంగళవారం అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, రంగారెడ్డిలో రెండు స్థానాలకు గాను సిట్టింగ్ ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మహబూబ్‌నగర్‌లో రెండు స్థానాలకు గాను సిట్టింగ్ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిల పేర్లను కేశవరావు ప్రకటించారు.
అన్ని స్థానాలూ మావే: డీఎస్
స్థానిక కోటాలో ఎన్నికలు జరిగే 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డి.శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు, ఇతర పార్టీలు ఒక అవగాహనకు వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని, టీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం లేదన్నారు. టీఆర్‌ఎస్‌పై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం ఉందని వరంగల్ ఉప ఎన్నిక ఫలితం రుజువు చేసిందన్నారు. పార్టీ విజయావకాశాలను అంచనా వేసుకునే అభ్యర్థులను ఎంపిక చేశామని ఎంపీ కేకే వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న పార్టీ తమదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులకు కేకే, డీఎస్, జూపల్లి కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.