ప్రజలు టీఆర్‌ఎస్ బలోపేతాన్ని కోరుకుంటున్నారు
అధికార పార్టీలోకి చేరికల సందర్భంగా సీఎం కేసీఆర్
- ఖమ్మం జిల్లా మధిర నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు
- కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నేతలకు గులాబీ కండువాలు కప్పిన సీఎం
- అధికారిక నివాసంలో కార్యక్రమం... తుమ్మల, ఈటల హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్వరాష్ట్రంగా ఒక ప్రత్యేక రాజకీయ సందర్భంలో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ ఆలోచనా సరళిని ప్రస్ఫుటం చేశాయని, టీఆర్‌ఎస్ బలోపేతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, కౌన్సిలర్లు శుక్రవారం సీఎం అధికారిక నివాసంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘మదిర నియోజకవర్గ ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని రాజకీయంగా భావించడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా కలసి పోరాడదామని పిలుపునిచ్చాను. తెలంగాణను నిలబెట్టుకోవాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాలి. తెలంగాణ అంటే ఏందో దేశానికి అర్థం కావాలే. ఇప్పటికే మనం ఆ దిశగా ప్రయాణం సాగిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల నీటి అవసరాల కోసం మున్నేరు వాగుపై కనీసం చెక్‌డ్యాం కూడా కట్టుకోనీయకుండా కట్టడి చేసిన ఆంధ్రా పాలకులు... గోదావరి జలాలనూ వాడుకోనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి జలాలను అవసరమైతే కృష్ణా ఆయకట్టుకూ వాడుకునేలా సీతారామ ప్రాజెక్టు (దుమ్ముగూడెం) ఖమ్మానికి వరదాయినిగా నిలవనుందన్నారు. త్వరలో మధిర నియోజకవర్గ పర్యటనకు వస్తానన్నారు. చేరికల కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.