ప్రత్యామ్నాయ విధానాలపై సీపీఎం కసరత్తు
మేధావులు, సామాజిక సంఘాలతో సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యామ్నాయంగా అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన విధానాలను రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీపీఎం నిర్ణయించింది. విస్తృత పరిధిలో అవసరమైన కార్యాచరణను రూపొందించేందుకు కలిసొచ్చే ఇతర వామపక్షాలు, సామాజిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు, మేధావులతో చర్చిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు సంప్రదాయబద్ధ, మూస ధోరణిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని సీపీఎం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వాటికి భిన్నంగా అణగారిన, అట్టడుగు వర్గాలకు అన్నిరంగాల్లో అభివృద్ధిఫలాలు సమానంగా అందేలా సీపీఎం ప్రణాళికలను రూపొందిస్తోంది. 4 వేల కిలోమీటర్ల మేర నిర్వహించిన పాదయాత్రకు సహకరించిన పార్టీలు, సంఘాలతో విడతలవారీగా చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రజా గాయకుడు గద్దర్, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్, ఆర్.కృష్ణయ్య, చెరుకు సుధాకర్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ తదితరులతో తొలి విడత చర్చలు పూర్తి చేసింది.
సీపీఎం రూపొందించుకున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ముసాయిదాను వారి ముందుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటోంది. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, ఎంబీసీ, మైనారిటీ సంఘాలతో కూడా సమావేశాలను కొనసాగిస్తోంది. కార్మిక సంఘాలతో ఇదివరకే భేటీ అయింది. ఈ క్రమంలో త్వరలోనే వీరందరికి అంగీకారమైన ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించేందుకు సీపీఎం నాయకత్వం కసరత్తు చేస్తోం ది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మహాజన పాద యాత్రలో దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలపై ఉద్యమిం చాలని ఈ సందర్భంగా సీపీఎం నిర్ణయించింది.