
టీఆర్‌ఎస్, టీడీపీ ఎంపీల వాగ్వాదం
వ్యక్తిగత ఎజెండాతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆగ్రహం ..
న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ కేశినేని నానికి బదులుగా ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా సభలో కొంత గందరగోళం చోటుచేసుకుంది. గల్లా జయదేవ్ ప్రసంగంపై టీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అప్రజాస్వామికంగా విభజించారని, తెలంగాణ కొత్త రాష్ట్రం కాదని, ఏపీ మాత్రమే కొత్త రాష్ట్రమని, విభనతో తెలుగు తల్లిని రెండుగా చీల్చారని ఆయన వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం నెలకొంది.
ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు గల్లా జయదేవ్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, వ్యక్తిగత ఎజెండాతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సమయం ఇచ్చినప్పుడు మీ వాదన వినిపించండి అని స్పీకర్ సుమిత్ర మహాజన్ సూచించడంతో వెనక్కు తగ్గారు. జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం మరోసారి గల్లా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో టీఆర్‌ఎస్ ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.