లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను మంగళవారం ఆమె కార్యాలయంలో కలసి అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా చూడాలని అభ్యర్థిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు మూడోసారి కూడా లోక్‌సభలో చర్చకు నోచుకోలేదు. సభ ఆర్డర్‌లో లేదన్న కారణంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అనుమతించలేదు. మంగళవారం నాటి సభా కార్యక్రమాల జాబితాలో చేర్చాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహం సోమవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమైన నిమిషానికే సభను స్పీకర్ 12 గంటల వరకు వాయిదా వేశారు. ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లో ఉండి ఆందోళన చేయడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభం కాగానే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాక్‌లో భారతీయుల హత్యలపై ప్రకటన చేసేందుకు లేచి నిల్చున్నారు. ఆ ప్రకటన చేయనివ్వకుండా విపక్ష సభ్యులు తమ స్థానాల్లోనే ఉండి నినాదాలు ప్రారంభించారు. అప్పటివరకు వెల్‌లో ఉండి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులు సుష్మాస్వరాజ్ ప్రకటన చేస్తుండగా మౌనంగా నిలుచున్నారు. దీంతో ఆ రెండు పార్టీల తీరును విపక్షాలు తప్పుపట్టాయి. అవిశ్వాస తీర్మానం నోటీసులు ప్రస్తావనకు వస్తే గొడవకు దిగుతూ, ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించాయి. అయితే, ఈ గందరగోళం మధ్య ఇరాక్‌లో భారతీయుల హత్యలపై ప్రకటన చేయలేనని సుష్మా స్వరాజ్ తేల్చిచెప్పారు. దీంతో సభాపతి విపక్షాల తీరును తప్పుపట్టారు. ‘‘మీలో మానవత్వం సన్నగిల్లిందా? ఇలా చేయడం సరైంది కాదు. ఇది మన ప్రతిష్టను దెబ్బతీస్తుంది’’ అని పేర్కొన్నారు.
మళ్లీ అదే తీరు
సరిగ్గా మధ్యాహ్నం 12.13 గంటలకు సభాపతి తన వద్దకు వచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో ప్రస్తావించారు. ‘‘కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి నుంచి, తోట నర్సింహం నుంచి నోటీసులు అందాయి. ఈ నోటీసులను సభ ముందుంచడం నా బాధ్యత. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు వారి స్థానాల్లో లేచి నిలుచుంటే వారిని లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. అప్పుడే నేను వారిని లెక్కించి ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించగలను. అందువల్ల సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలి’’ అని సూచించారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు ప్రస్తావన రాగానే విపక్షాల సభ్యులంతా దానికి మద్దతుగా లేచి నిలబడ్డారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ తదితర విపక్షాల సభ్యులంతా అవిశ్వాస తీర్మానం నోటీసులకు మద్దతుగా సభలో లేచి నిలుచున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతుగా సభలో లేచి నిల్చోవాలని వైఎస్సార్‌సీపీ తన పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. అయితే, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత స్పీకర్ అవిశ్వాస తీర్మానం ప్రస్తావన తెచ్చినప్పుడు సభలో కూర్చునే ఉన్నారు. అవిశ్వాస తీర్మానాల నోటీసులను ప్రస్తావిస్తూ వెల్‌లో ఉన్న సభ్యులను తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరినప్పటికీ వారు వినకపోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ సభ సజావుగా సాగకపోవడంతో అవిశ్వాస తీర్మానాలను నేను సభ ముందుకు తీసుకురాలేకపోతున్నాను’’ అని పేర్కొంటూ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతిని తోసిపుచ్చారు. సభను బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహం నాలుగోసా రి నోటీసు ఇచ్చారు. మంగళవారం మధ్యా హ్నం ఈ నోటీసులను లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు అందజేశారు.
సహకరించాలని ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్‌కు వినతి
అంతకుముందు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘‘కేంద్రంపై మేము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు సభలో అన్ని ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వినిపించేందుకు సహకరించాలని కోరుతున్నాం. ఇదివరకే వారిని కలిసి అడిగాం. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సభలో మీరు మౌనంగా ఉంటే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని విన్నవిస్తున్నాం. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకోవాలని టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. టీడీపీ ఇతర పార్టీలతో చేరి సభను జరగనివ్వకుండా చేస్తోంది’’ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ధర్నా అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఆమె కార్యాలయంలో కలిశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేందుకు వీలుగా దానిని ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న ఏఐఏడీఎంకే సభ్యులను వైఎస్సార్‌సీపీ సభ్యులు కలిశారు. చేతులు జోడించి నమస్కారం చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తమకు సహకరించాలని కోరారు. అలాగే మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడను పార్లమెంట్‌లో కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని అభ్యర్థించారు. అటు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా ప్లకా>ర్డును ప్రదర్శిస్తూ వెల్‌లో నిరసన తెలిపారు. కాగా ఆవిశ్వాసంపై పార్లమెంట్‌లో చర్చ జరిపేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని వైఎస్సార్ సీపీ ఎంపీలు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment