డబ్బు కోసమే హత్య
వీడిన ఎస్వీయూ క్వార్టర్స్‌లో జరిగిన హత్య మిస్టరీ నిందితుడు మరిదే
తిరుపతి క్రైం : ఈనెల 19వ తేదీన ఎస్వీయూనివర్సిటీ క్వార్టర్స్‌లో దారుణహత్యకు గురైన సుధారాణి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను డబ్బుకోసమే హత్యచేసినట్టు నిందితుడు అంగీకరించాడు. తిరుపతి అర్బన్ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల ఎదుట నిందితుని ప్రవేశపెట్టారు. ఏస్పీ త్రిమూర్తులు వివరాలు వెల్లడించారు.
ఎస్వీయూ క్వార్టర్స్ ప్లాట్ నెం. 17లో నివాసం ఉంటున్న శివశంకర్ ఏఈవోగా పనిచేస్తున్నాడు. ఇతనికి అయిదుగురు సోదరులున్నారు. అందరికన్నా చిన్నవాడు శివశంకర్ చింతకాయల వీధిలో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. అన్నదమ్ములందరికీ పూర్వీకుల ఆస్తి ఉంది. దీనిని భాగపరిష్కారం చేయలేదని శివశంకర్ కుటుంబంపై మురళి కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శివశంకర్ 19వ తేదీ ఉదయం 8.30 నిమిషాలకు ఎప్పటిలా డ్యూటీకి వెళ్లాడు. అదే సమయంలో ఆయన కుమారుడు కిషోర్ కూడా స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. శివశంకర్ ఆఖరి తమ్ముడు మురళి సుమారు 10 గంటల సమయంలో అన్న ఇంటికి వచ్చాడు. అన్నదమ్ములకు నచ్చజెప్పి ఆస్తిలో భాగాలు పంచమని ఒదిన సుధారాణిని మురళి కోరాడు. ఖర్చులకు రూ.2 వేలు డబ్బు కావాలని అడిగాడు. సుధారాణి తన దగ్గర డబ్బు లేదని చెప్పింది. మరిదికి టిఫిన్ పెట్టి, కాఫీ ఇచ్చింది. తనకు డబ్బు ఇవ్వకపోవడంతో ఆమెను చంపాలని శివశంకర్ నిర్ణయించుకున్నాడు.
ఇల్లంతా చూపించాలని ఒదినను అడిగాడు. ఆమె పూజగదిలోకి వెళ్లింది. ఆ సమయంలో వంటగదిలోని చపాతి కర్రను తీసుకుని దాచుకున్నాడు. ఆమెతో పాటు ఇల్లు చూస్తూ మొదటి అంతస్తులోకి వెళ్లాడు. బాల్కనీ తలుపులు తెరుస్తుండగా సుధారాణి తలపై వెనకనుంచి చపాతికర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఆమె ఎదపై విచక్షణా రహితంగా కొట్టాడు. తన వద్ద ఉన్న చిన్న కత్తితో గొంతు కోశాడు. అప్పటికీ ఆమె చనిపోకపోవడంతో ఇంట్లో ఉన్న దుస్తులు తీసి ఆమె మెడపై వేసి కాలితో ఊపరాడకుండా తొక్కాడు. దీంతో సుధారాణి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు మంగళసూత్రం, కమ్మలు, ముక్కుపుడక, నల్లపూసల దండ, రెండు ఉంగరాలు తీసుకుని పారిపోయాడు. ఈ కేసును ఛేదించడంలో యూనివర్సిటీ సీఐ రామకృష్ణ ఎంతో కృషి చేశారని ఏఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు రవిశంకర్ రెడ్డి, కొండారెడ్డి, యస్‌ఐ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.