ఫ్లకార్డును ప్రదర్శిస్తున్న కార్పొరేటర్ వేలూరు సుధారాణి, ఇన్‌సెట్లో.. కార్పొరేటర్ల నిరసన గళంతో చెవులు మూసుకున్న మేయర్
సాక్షి, నెల్లూరు సిటీ: కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ అజీజ్‌కు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, సీపీఎం, బీజేపీ కార్పొరేటర్లతో పాటు సొంత పార్టీ కార్పొరేటర్లు నిప్పో అంశంపై వ్యతిరేక గళం వినిపిస్తూ ముచ్చెమటలు పట్టించారు. ప్రజాసాధికార సర్వేను ఆధారం చేసుకుని ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. తప్పుల తడకగా సర్వేను చేయడం ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లకార్డులతో నిరసన
ప్రజా సమస్యలపై అధికార పార్టీకి చెందిన షేక్ వహిద, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఫ్లకార్డులతో కౌన్సిల్‌లో నిరసన తెలిపారు. సుధారాణి మాట్లాడుతూ లస్సీ సెంటర్‌లో డ్రైనేజీ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. షేక్ వహిద మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే తప్పుల తడకగా చేయడంతో లబ్ధిదారులు ఇళ్లు, పింఛన్లు కోల్పోతున్నారన్నారు. మళ్లీ సర్వే చేయించాలని కోరారు.
డీసీపీని బదిలీ చేయండి
కార్పొరేషన్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్ మండిపడ్డారు. తమ డివిజన్‌లోని అక్రమ భవనాలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. టీడీపీ కార్పొరేటర్ నూనె మల్లికార్జున్‌యాదవ్ మాట్లాడుతూ డీమార్ట్ మాల్ వద్ద సొంతంగా రోడ్డును వేసుకుంటున్నారని, ఎవరు అనుమతులు ఇచ్చారని డీసీపీ సూరజ్‌ను ప్రశ్నించారు. డీసీపీ సమాధానం చెప్పలేకపోవడంతో బదిలీ చేయాలని కోరారు.
ఇళ్ల మంజూరులో స్పష్టత లేదు
హౌస్ ఫర్ ఆల్ పథకం ఇళ్ల మంజూరులో స్పష్టత లేదని వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. 4800 ఇళ్లకు గానూ, 2050 ఇళ్లను మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మిగిలినవి ఎందుకు తిరస్కరించారో స్పష్టత లేకుండా ఉందన్నారు. నగదు చెల్లించినా తిరస్కరించిన విషయం ఆలస్యంగా అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు నష్టపోయారని తెలిపారు. టీడీపీ కార్పొరేటర్ మామిడాల మధు మాట్లాడుతూ పాలకుల వైఫల్యాలతో ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
40శాతం ఇంటి దరఖాస్తులు తిరస్కరణ
40శాతం ఇంటి దరఖాస్తులు తిరస్కరణకు గురైంది వాస్తవమే. సాధికార సర్వేలోని కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. సర్వే తప్పుల తడకగా చేసినట్లుగా ఫిర్యాదులు వస్తున్నందున మళ్లీ పూర్తిస్థాయిలో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– అలీంబాషా, కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment