Mayor Aziz
-
మేయర్‌కు ముచ్చెమటలు పట్టించిన కార్పొరేటర్లు
సాక్షి, నెల్లూరు సిటీ: కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ అజీజ్‌కు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సీపీఎం, బీజేపీ కార్పొరేటర్లతో పాటు సొంత పార్టీ కార్పొరేటర్లు నిప్పో అంశంపై వ్యతిరేక గళం వినిపిస్తూ ముచ్చెమటలు పట్టించారు. ప్రజాసాధికార సర్వేను ఆధారం చేసుకుని ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. తప్పుల తడకగా సర్వేను చేయడం ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో నిరసన ప్రజా సమస్యలపై అధికార పార్టీకి చెందిన షేక్ వహిద, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఫ్లకార్డులతో కౌన్సిల్లో నిరసన తెలిపారు. సుధారాణి మాట్లాడుతూ లస్సీ సెంటర్లో డ్రైనేజీ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. షేక్ వహిద మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే తప్పుల తడకగా చేయడంతో లబ్ధిదారులు ఇళ్లు, పింఛన్లు కోల్పోతున్నారన్నారు. మళ్లీ సర్వే చేయించాలని కోరారు. డీసీపీని బదిలీ చేయండి కార్పొరేషన్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్ మండిపడ్డారు. తమ డివిజన్లోని అక్రమ భవనాలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. టీడీపీ కార్పొరేటర్ నూనె మల్లికార్జున్‌యాదవ్ మాట్లాడుతూ డీమార్ట్ మాల్ వద్ద సొంతంగా రోడ్డును వేసుకుంటున్నారని, ఎవరు అనుమతులు ఇచ్చారని డీసీపీ సూరజ్‌ను ప్రశ్నించారు. డీసీపీ సమాధానం చెప్పలేకపోవడంతో బదిలీ చేయాలని కోరారు. ఇళ్ల మంజూరులో స్పష్టత లేదు హౌస్ ఫర్ ఆల్ పథకం ఇళ్ల మంజూరులో స్పష్టత లేదని వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. 4800 ఇళ్లకు గానూ, 2050 ఇళ్లను మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మిగిలినవి ఎందుకు తిరస్కరించారో స్పష్టత లేకుండా ఉందన్నారు. నగదు చెల్లించినా తిరస్కరించిన విషయం ఆలస్యంగా అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు నష్టపోయారని తెలిపారు. టీడీపీ కార్పొరేటర్ మామిడాల మధు మాట్లాడుతూ పాలకుల వైఫల్యాలతో ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 40శాతం ఇంటి దరఖాస్తులు తిరస్కరణ 40శాతం ఇంటి దరఖాస్తులు తిరస్కరణకు గురైంది వాస్తవమే. సాధికార సర్వేలోని కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. సర్వే తప్పుల తడకగా చేసినట్లుగా ఫిర్యాదులు వస్తున్నందున మళ్లీ పూర్తిస్థాయిలో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – అలీంబాషా, కమిషనర్ -
మైనార్టీ కార్పొరేషన్ ఈడీకి అవమానం
నెల్లూరు(సెంట్రల్): సాక్షాత్తూ మైనార్టీ కార్పొరేషన్ ఈడీ షంషుద్దీన్‌కు మేయర్ అబ్దుల్ అజీజ్ సమక్షంలో అవమానం జరిగింది. ఈడీ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమంలో టీడీపీ చోటా నేతలను కూర్చోబెట్టి ఈడీని కింద కూర్చోమనడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురుయ్యారు. వివరాలు.. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి, అదే విధంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఈడీ షంషుద్దీన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ – 2 సాల్మన్ రాజ్‌కుమార్, మేయర్ అజీజ్ హాజరయ్యారు. ముందు జేసీలిద్దరూ, మేయర్ స్టేజీ మీద కూర్చున్న తర్వాత ఈడీ వెళ్లగా అజీజ్ మనుషులు, చోటా టీడీపీ నాయకులు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఈడీని కింద కూర్చోమనే విధంగా మేయర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈడీ కూర్చోవాల్సిన స్థానంలో టీడీపీ చోటా నాయకులు కూర్చున్నారు. దీంతో ఈడీ తీవ్ర మనస్తాపంతో వేదిక ముందు అందరి మధ్యలోనే కూర్చోవాల్సి వచ్చింది. అదే విధంగా కార్యక్రమానికి అధికారికంగా వచ్చిన జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ మహ్మద్ హుస్సేన్, డిప్యూటీ డీఈఓ షా మహ్మద్ కూడా స్టేజీ మీద చోటు లేకపోవడంతో వేదిక ముందే కూర్చోవాల్సి వచ్చింది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులను అవమానించిన మేయర్ తీరును పలువురు విమర్శించారు. -
మేయర్‌కు తగిన గుణపాఠం చెపుతాం
సీఐటియూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు నెల్లూరు(సెంట్రల్): తమ సమస్యలు పరిష్కరించమని అడిగిన కార్మికులను పోలీసులతో కొట్టించిన కార్పొరేషన్ మేయర్ అబ్దుల్‌అజీజ్‌కు తగిన గుణపాఠం చెపుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు హెచ్చరించారు. కార్పొరేషన్లో కార్మికులపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా నగరంలోని గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ పాలన చూస్తుంటే తనమాట కాదన్నవారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ నిరంకుశంగా వ్యవరిస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టినా లాఠీచార్జీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేషన్ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని, ఆయన అవినీతిని పక్కన పెట్టి కార్మికులపై ప్రతాపం చూపించడం సిగ్గు చేటన్నారు. కాగా గాంధీబొమ్మ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టడం గమనార్హం. -
మేయర్ X కార్మికులు
279 జీఓపై కార్మికుల నిరసన మేయర్‌ను కార్పొరేషన్లోకి వెళ్లనీయకుండా అడ్డగింత కార్మికులు, పోలీసుల మధ్యన తోపులాట జారి కింద పడిన మేయర్ ఓ కార్మికుడికి తీవ్రగాయాలు వామపక్షాల నిరసన నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ కార్యాలయం శుక్రవారం నిరసనలతో అట్టుడికింది. కార్మికుల పొట్టకొట్టేలా ఉన్న జీఓ 279ను రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద , కార్పొరేషన్ రిజర్వుడు స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై వామపక్షాలు ప్రధాన గేటు ఎదుట నిరసనకు దిగాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు కార్యాలయానికి హాజరయ్యేందుకు కారులో వచ్చిన మేయర్‌ను తొలుత ప్రధాన గేటు వద్ద వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా సుమారు 20 నిమిషాల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు మేయర్ కారును లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కార్యాలయంలో ఆందోళన చేస్తున్న కార్మికులు మేయర్ కారును మరోసారి అడ్డగించారు. మేయర్ కార్మికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటకీ ఫలితం లేకుండాపోయింది. మేయర్ మాటను కార్మికులు లెక్కచేయకపోగా, అడ్డగించడంతో విధిలేని పరిస్థితిలో మేయర్ అజీజ్ కార్యాలయం వెనుకగా ఉన్న మరోమార్గం గుండా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు ఆ మార్గాన్ని అడ్డగించారు.మేయర్, పోలీసులు ఎంత నచ్చజేప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. కార్మికులను పక్కకు నెట్టివేయాలని మేయర్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా కార్మికుల అరుపులు, కేకలతో కార్యాలయం దద్దరిల్లింది. మేయర్ పోలీసుల సహకారంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా తోపులాటలో కిందపడ్డారు. పోలీసులు, మేయర్ వర్గీయులు అజీజ్‌కు వలయంలా ఏర్పడి లోపలికి తీసుకెళ్లారు. కార్మికుడిని కాలితో తన్నిన కార్పొరేటర్ కార్యాలయంలోకి మేయర్ అజీజ్ వెళుతున్న సమయంలో తోపులాటలో మేయర్ కిందపడ్డారు. దీంతో మేయర్ వర్గానికి చెందిన కార్పొరేటర్ ప్రశాంతి కుమార్ కాలితో జయకుమార్ అనే కార్మికుడిని తన్నాడు. దీంతో జయకుమార్ తీవ్రంగా గాయపడగా, సహచర కార్మికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో కార్మిక సంఘాలు మేయర్, మేయర్ వర్గం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చోద్యం చూసిన టీడీపీ కార్పొరేటర్లు మేయర్ అజీజ్‌ను కార్మికులు అడ్డుకుని నిరసన తెలుపుతున్నా టీడీపీ కార్పొరేటర్లు ఎవరూ అనుకూలంగా మద్దతు తెలిపేందుకు రాలేదు. మేయర్ కిందపడిన విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్ మాత్రం అజీజ్‌కు జరిగిన సంఘటనపై మాట్లాడారు. ఘటనపై పాలక వర్గంలోని అందరూ ఖండించాల్సి ఉందన్నారు. -
ఉన్నోళ్లకు ఒక న్యాయం.. లేనోళ్లకు ఒక న్యాయమా?
మేయర్‌ను నిలదీసిన మన్సూర్‌నగర్ వాసులు నెల్లూరు, సిటీ: ఉన్నోళ్లకు ఒకన్యాయం.. లేనేళ్లకు ఒక న్యాయమా అంటూ మన్సూర్‌నగర్ వాసులు మేయర్ అజీజ్‌ను నిలదీశారు. నగరంలోని మన్సూనగర్ ప్రాంతంలో బుధవారం టౌన్‌ప్లానింగ్ అధికారులు కాలువపై ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అధికారులు తిరిగి వెళ్లారు. గురువారం ఉదయం మేయర్ అజీజ్ ఆ ప్రాంత ప్రజలకు ఆక్రమణలు విషయంపై సర్దిచెప్పేందుకు వెళ్లారు. దీంతో ఆ ప్రాంత వాసులు భారీగా చేరుకుని మేయర్‌ను నిలదీశారు. తాము ఓట్లు వేసి గెలిపిస్తే తమ ఇళ్లు కూలుస్తారా అంటూ ఆందోళనకు దిగారు. నగరంలో భారీ కాంప్లెక్స్‌లు, షాపులు కాలువల పై నిర్మాణం మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తమ ఇళ్లు కూల్చే ముందు బడాబాబులు భవనాలు కూల్చిన తరువాతే జరగాలన్నారు. ప్రత్యామ్నాయం లేకుండా ఇళ్లు కూలిస్తే సహించం మా ఇళ్లు కాలువకు ఆనుకుని ఉన్నప్పటికీ పట్టా కాగితాలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లు కూలిస్తే సహించేది లేదన్నారు. ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
నిబంధనలతో నాకేం పని..
ఈ–పేపర్ ఎడిటర్‌కి రూ.50వేలు జీతం అధికారులకు మేయర్ అజీజ్ ఆదేశాలు నెల్లూరు సిటీ : నెల్లూరు మేయర్ తాను అనుకున్నదే చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా నిబంధనలను పక్కనపెట్టి తన సొంత మనిషిని కార్పొరేషన్ ఈ–పేపర్ ఎడిటర్‌గా నియమించుకుని రూ.50 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం షేక్ మహ్మద్ రఫీని ఈ–పేపర్ ఎడిటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈవ్యవహారంపై ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటు సొంత పార్టీ టీడీపీ కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత వచ్చినా మేయర్ ఏ మాత్రం చలించలేదు. నిబంధనలు తనకు కాదన్నట్లుగా రఫీకి నియామకపత్రం అందజేశారు. దీనిపై కార్పొరేషన్ అధికారుల్లో తీవ్ర చర్చజరుగుతోంది. ప్రజలు పన్నుల రూపంలో కార్పొరేషన్‌కు కట్టిన ధనాన్ని, సొంత మనుషుల కోసం ఖర్చు చేయడంపై అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఓ అధికారి కూడా మేయర్‌కు అంతమొత్తంలో చెల్లించడంపై విమర్శలు వస్తాయని సలహా ఇచ్చారు. అయితే మేయర్ అజీజ్ మాత్రం అవేం పట్టించుకోలేదు. -
40 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదు
మేయర్ అబ్దుల్ అజీజ్ మహ్మదాపురంలో వాటర్ ప్రాజెక్టు పరిశీలన నెల్లూరు సిటీ: నగర ప్రజలకు రాబోయే 40 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. సంగం మండలం మహ్మదాపురంలో రూ.580 కోట్లతో నిర్మిస్తున్న వాటర్ ప్రాజెక్టును గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకు గానూ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని చెప్పారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పైప్‌లైన్ ద్వారా మహ్మదాపురం నుంచి నీటి సరఫరా అవుతుందన్నారు. అమృత్ నిధుల ద్వారా వచ్చే నిధులను మంచినీటికి, డ్రైనేజీ నిర్మాణానికి వాడాల్సి ఉండగా, ఆ నిధులను హడ్కోకు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్, ఈఈ శ్రీనివాసులు, టీడీపీ కార్పొరేటర్లు మన్నెం పెంచలనాయుడు, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, వహీదా, బొల్లినేని శ్రీవిద్య, పొత్తూరు శైలజ, మల్లికార్జున్‌యాదవ్, ప్రశాంత్‌కిరణ్, నాయకులు షంషుద్దీన్, జహీర్, నన్నేసాహెబ్, తదితరులు పాల్గొన్నారు. 33 మందిలో ఏడుగురు కార్పొరేటర్లే హాజరు కార్పొరేషన్‌తో 33 మంది టీడీపీ కార్పొరేటర్లకు గానూ ఏడుగురే పరిశీలన నిమిత్తం మేయర్‌తో కలిసి వెళ్లారు. మేయర్‌పై వారిలో ఉన్న అసంతృప్తి మరోసారి రుజువైంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టు సందర్శనార్థం గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ఆపరేటర్‌కు చెందిన రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లందరూ హాజరవుతారని భావించిన మేయర్‌కు ఏడుగురే హాజరవడంతో చుక్కెదురైంది. అక్కడ ఉన్న కార్పొరేటర్లు మేయర్‌పై అసమ్మతి చల్లారినట్లు లేదని చర్చించుకున్నారు. తప్పని పరిస్థితుల్లో మేయర్ ఒక బస్సును వెనక్కి పంపారు. ఒక బస్సులో మీడియా ప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పయనమయ్యారు. -
హడ్కో రుణాన్ని గ్రాంట్‌గా మారుస్తాం
నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ పరిధిలోని భూగర్భడ్రైనేజీ, తాగునీటి పథకాలకు సంబంధించి హడ్కో రుణాలను గ్రాంట్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రజలపై భారం లేకుండా చేస్తామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ విభాగం ఎస్ఈ మోహన్, ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో భూగర్భ, తాగునీటి పథకాలకు సంబంధించి 10శాతం పనులు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. సంగం బ్యారేజీ నుంచి నీటిని పైప్లైన్ల ద్వారా నీటిని తీసుకువచ్చి శుద్ధిచేసి నగర ప్రజలకు అందజేస్తున్నామన్నారు. నగరంలో 32 ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే ఏడు ట్యాంకులు ప్రారంభించినట్లు తెలిపారు. ‘సాక్షి’లో ‘రుణమా..సాయమా’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం వరకు ఆర్థిక భారం భరిస్తుందని, ప్రజలపై ఎటువంటి భారం లేకుండా చేస్తున్నామన్నారు. హడ్కో రుణాలను గ్రాంటు క్రింద మార్చేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పిన, అభివృద్ధికి రూ.ఐదు కోట్లను కేటాయిస్తున్నట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ పాఠశాలల్లో వసతుల కల్పనపై ప్రాథమిక అంచనాలను రూపొందిస్తున్నామన్నారు. కార్పొరేట్‌కు దీటుగా మున్సిపల్ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వినాయకులనే పూజిద్దాం
జేవీవీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ నెల్లూరు(అర్బన్): మానవాళి ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టివిగ్రహాలనే పూజిద్దామని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జిల్లా కాలుష్యనియంత్రణ మండలి సహకారంతో స్థానిక ఫత్తేఖాన్‌పేటలోని రైతు బజార్లో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ మాట్లాడారు. రసాయనాలు వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జలచరాలు మరణిస్తున్నాయన్నారు. ఆ నీటిని తాగిన ప్రజలకు కేన్సర్ వస్తుందన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఉచితంగా 10వేల మట్టి విగ్రహాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ప్రజాసైన్సువేదిక రాష్ట్ర నాయకుడు నూనె నారాయణ మాట్లాడుతూ మన దేశ సంప్రదాయానికి అనుగుణంగా మట్టి వినాయకులనే పూజిద్దామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రమోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో రూ.15 విలువైన మట్టి విగ్రహాలను రూ.5కే రైతుబజార్లో అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, న్యాయవాది నన్నేసాహెబ్, కార్పొరేటర్లు రాజేష్, రాజానాయుడు, నూనె మల్లికార్జున, పెంచలయ్య, నాగేశ్వరరావు, జేవీవీ నాయకులు గాలిశ్రీనివాసులు, శ్రీధర్, చక్రపాణి పాల్గొన్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించాలి
నెల్లూరు సిటీ: కెరీర్ ఫౌండేషన్ కోర్సుల్లో చేరి కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులు ఫలితాలను సాధించాలని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వెంగళరావునగర్‌లోని నగరపాలక ఉన్నత పాఠశాలను గురువారం పరిశీలించారు. త్రిపుల్ ఐటీకి పాఠశాల నుంచి ఎంపికైన విద్యార్థి భానుప్రసాద్‌కు రూ.ఐదు వేలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 415 మంది విద్యార్థులకు గానూ 13 మందే ఉపాధ్యాయులు ఉన్నారని, త్వరలో విద్యావలంటీర్లను నియమించనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్లు పెంచలనాయుడు, రాజానాయుడు, పిట్టి సత్యనాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఇక నేనెందుకు?
నగరపాలనలో మంత్రి పెత్తనంపై మేయర్ అసహనం సాక్షి ప్రతినిధి నెల్లూరు : ‘కార్పొరేషన్లో పరిపాలన మొత్తం మీ చేతుల్లోకి తీసుకుంటే నేనుండటమెందుకు.. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. రాజీనామా చేసేస్తా.. ’ అని మేయర్ అబ్దుల్ అజీజ్ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణతో తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతకాలంగా మంత్రి నారాయణతో మేయర్ అజీజ్‌కు ఏర్పడిన అభిప్రాయ భేదాలు, అంతర్గత గొడవలుగా మారాయి. ఒకరి వ్యవహార తీరుపై మరొకరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల కార్పొరేషన్లో ఏసీబీ దాడులు జరిగిన అనంతరం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న గొడవలు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహించారు. సొంత జిల్లాలోనే కార్పొరేషన్‌ను సక్రమంగా నడిపించలేకపోతే రాష్ట్రం మొత్తాన్ని ఎలా నడిపిస్తారని మంత్రి నారాయణ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్ పనితీరు పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నారాయణ దీన్ని అవకాశంగా తీసుకొని కార్పొరేషన్ మీద తన పట్టు పెంచుకోవడానికి పావులు కదిపారు. మేయర్ అజీజ్‌ను డమ్మీ చేస్తూ కార్పొరేషన్లో జరిగే ప్రతి వ్యవహారం తనకు తెలియాలని, తనతో సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కమిషనర్‌తో పాటు ఇతర అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మేయర్‌ను ఏమాత్రం లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత కోసం మంత్రి నారాయణ మేయర్‌కు తెలియకుండానే ప్రత్యేక బృందాలను పంపారు. మేయర్‌కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆ బృందాలు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు దిగడంతో పెద్ద దుమారం రేపింది. మేయర్ చేతకానితనంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా విమర్శలు చేశారు. పరిపాలన వ్యవహారంలో భాగంగా కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లను లాటరీ పద్ధతిలో ఇటీవల బదిలీ చేశారు. సుదీర్ఘకాలం ఒకేచోట ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అధికారపార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు మింగుడు పడలేదు. తన సోదరుడు మాల్యాద్రిని బదిలీ చేయడం టీడీపీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ బదిలీ ఆపాలని మేయర్ మీద ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేకపోయింది. దీంతో తన రాజకీయ గురువు ఆనం వివేకానందరెడ్డి ద్వారా మంత్రి నారాయణ మీద ఒత్తిడి తెచ్చి ఆయనను తిరిగి పాత స్థానానికే బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేయడం అజీజ్‌కు ఆగ్రహం తెప్పించింది. అలాగే టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురిని తనకు తెలియకుండా సస్పెండ్ చేయడం అజీజ్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ సస్పెన్షన్లు ఆపివేయాలని కొత్తగా వచ్చిన వారిని వదిలేసి పాతవారిని మాత్రమే సాగనంపుదామని మేయర్ మంత్రి నారాయణ మీద తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేకపోయింది. ఈ వ్యవహారాలన్నింటిపై ఆందోళనతో ఉన్న అజీజ్ శనివారం సాయంత్రం మంత్రి నారాయణకు ఫోన్ చేశారు. కార్పొరేషన్ వ్యవహారాలన్నీ తనకు తెలియకుండా జరిగిపోతుంటే తానెందుకు పదవిలో ఉండాలని అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రి మేయర్ అజీజ్‌కు తెగేసి చెప్పారని తెలిసింది. ఈ వ్యవహారం నడుస్తుండగానే టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ బదిలీ గురించి మేయర్‌కు ఫోన్ చేశారు. కార్పొరేషన్లో అన్నీ తనకు తెలిసే జరుగుతున్నాయా.. మంత్రిని అడిగి బదిలీ చేయించుకోండని అజీజ్ ముంగమూరు మీద కోపం ప్రదర్శించారు. దీంతో శ్రీధరకృష్ణారెడ్డి తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలిసింది. కార్పొరేషన్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ రాజకీయ పరిణామాలు తెలుగుదేశంపార్టీలోనూ, కార్పొరేషన్ ఉద్యోగుల్లోనూ హాట్‌టాపిక్‌గా మారాయి. మంత్రితో విభేదాలు లేవు: మేయర్ అజీజ్ తనకు మంత్రి నారాయణతో ఎలాంటి విభేదాలు లేవని మేయర్ అబ్దుల్ అజీజ్ సాక్షి ప్రతినిధికి చెప్పారు. తాను రాజీనామా చేస్తానని మంత్రికి చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తినంత మాత్రాన విభేదాలున్నట్లుగా పరిగణించకూడదని మేయర్ పేర్కొన్నారు. -
కార్పొరేషన్లో తారస్థాయికి రచ్చ
అంతర్గత బదిలీల్లో రాజకీయం మేయర్‌ను వ్యతిరేకిస్త్తున్న ఓ వర్గం ఆనం పాత్ర ఉందంటూ మేయర్ వర్గం ఆరోపణ నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థలో రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది. ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరుతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇద్దరు అధికారపార్టీ నేతల మధ్య రేగిన వివాదం రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చుపెడుతోంది. నెల్లూరు కార్పొరేషన్లో శానిటరీ సూపర్వైజర్, ఇన్స్పెక్టర్ల అంతర్గత బదిలీల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారింది. మేయర్ అజీజ్ వ్యవహారంపై ఓ సామాజికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ వర్గాన్ని అణిచేస్తున్నారని మండిపడుతున్నారు. మేయర్‌పై మంత్రి నారాయణకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఆనం వివేకా హస్తం ఉందంటూ మేయర్ వర్గం ఆరోపిస్తోంది. కార్పొరేషన్లో పట్టు కోసం సామాజికవర్గాలను రెచ్చగొడుతున్నారని మేయర్ వర్గం విమర్శలు చేస్తోంది. కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ మాల్యాద్రిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే మేయర్, వివేకా మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో ఓ సామాజికవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి ఆనం వర్గీయుడు పిండి సురేష్ హాజరయ్యారు. ఆరోజు మేయర్ వ్యవహారంపై సుదీర్గంగా చర్చించారు. మంత్రి లేదంటే.. సీఎంను కలిసి వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదేక్రమంలో గురువారం ఆనం వర్గీయులైన కిన్నెర మాల్యాద్రి, రంగమయూర్‌రెడ్డి అనుచరులు కమిషనర్‌ను కలిసి బదిలీ విషయాన్ని ప్రస్తావించారు. అయితే కమిషనర్ మాత్రం బదిలీలను నిబంధనల మేరకే చేశామని చెప్పారు. సామాజికవర్గాన్ని రెచ్చగొడుతున్న వైనం : కార్పొరేషన్ పరిధిలో ఇటీవల జరిగిన టెండర్ల రద్దు.. అధికారుల బదిలీలను అస్త్రాలుగా చేసుకుని ఆనం ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్లో పనిచేసే అధికారులకు ఈ విషయం తెలియడంతో వణికిపోతున్నారు. ఆ ఇద్దరు నాయకుల మధ్య వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనం వివేకా ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని తెలుసుకున్న మేయర్ తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. అందులో భాగంగా గురువారం రాత్రి అదే సామాజిక వర్గానికి చెందిన మరో వర్గం మేయర్ అజీజ్‌ను కలవడం గమనార్హం. అయితే ఈ విషయంలో మేయర్ వర్గానికి చెందిన కొందరు కార్పొరేషన్ ఉద్యోగులను కలిసి ఈ విషయంలో తలదూర్చవద్దని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మొన్నటి వరకు కలిసి ఉన్న కొందరు ఉద్యోగులు ఆ వర్గంతో దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఆనం, మేయర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు సామాజిక వర్గాన్ని బలిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
ఎలాగైనా పంపాలని..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ అజీజ్, కమిషనర్ చక్రధర్బాబుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. తనకు అనుకూలమైన కమిషనర్‌ను నియమించుకునేందుకు మేయర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చక్రధర్‌బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మేయర్‌కు ఆయనకు మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. అవి కాస్త పెద్దవయ్యాయి. చివరకు మున్సిపల్‌శాఖ ద్వారానే కమిషనర్ చక్రధర్‌బాబును నెల్లూరు నుంచి పంపించేందుకు ప్రతిపాదనలు తెప్పించే ప్రయత్నాలు మేయర్ అబ్దుల్ అజీజ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ స్థానంలో గతంలో పనిచేసిన జాన్శ్యాంసన్ను తిరిగి నెల్లూరుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ చక్రధర్ మేయర్‌ను పట్టించుకోకుండా పాలనపై దృష్టిసారించారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. హెల్త్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయడం, విధినిర్వహణలో అలసత్వం వహించిన వారిపై కఠినంగా వ్యహరించడం లాటివి చేశారు. వారందరూ మేయర్‌కు మొరపెట్టుకున్నారు. అయితే మేయర్ సూచనలను కమిషనర్ పట్టించుకోలేదు. దీనికి తోడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియను తనకు తెలియకుండానే ఖరారు చేయడం మేయర్‌కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. కనీసం కమిషనర్‌ను తన కన్నుసన్నల్లో ఉంచుకొని అనుకున్న పనులను చేసుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మేయర్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చక్రధర్‌ను తప్పించాలనే ఉద్దేశంతో నేరుగా మున్సిపల్‌శాఖ ద్వారానే ప్రతిపాదనలు తెప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ మున్సిపల్‌శాఖ కార్యాలయానికి ప్రతిపాదనల నివేదికను చేర్చినట్టు తెలిసింది.