మేయర్ X కార్మికులు
-
279 జీఓపై కార్మికుల నిరసన
-
మేయర్‌ను కార్పొరేషన్‌లోకి వెళ్లనీయకుండా అడ్డగింత
-
కార్మికులు, పోలీసుల మధ్యన తోపులాట
-
జారి కింద పడిన మేయర్
-
ఓ కార్మికుడికి తీవ్రగాయాలు
-
వామపక్షాల నిరసన
నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ కార్యాలయం శుక్రవారం నిరసనలతో అట్టుడికింది. కార్మికుల పొట్టకొట్టేలా ఉన్న జీఓ 279ను రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద , కార్పొరేషన్ రిజర్వుడు స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై వామపక్షాలు ప్రధాన గేటు ఎదుట నిరసనకు దిగాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు కార్యాలయానికి హాజరయ్యేందుకు కారులో వచ్చిన మేయర్‌ను తొలుత ప్రధాన గేటు వద్ద వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా సుమారు 20 నిమిషాల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు మేయర్ కారును లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కార్యాలయంలో ఆందోళన చేస్తున్న కార్మికులు మేయర్ కారును మరోసారి అడ్డగించారు. మేయర్ కార్మికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటకీ ఫలితం లేకుండాపోయింది. మేయర్ మాటను కార్మికులు లెక్కచేయకపోగా, అడ్డగించడంతో విధిలేని పరిస్థితిలో మేయర్ అజీజ్ కార్యాలయం వెనుకగా ఉన్న మరోమార్గం గుండా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు ఆ మార్గాన్ని అడ్డగించారు.మేయర్, పోలీసులు ఎంత నచ్చజేప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. కార్మికులను పక్కకు నెట్టివేయాలని మేయర్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా కార్మికుల అరుపులు, కేకలతో కార్యాలయం దద్దరిల్లింది. మేయర్ పోలీసుల సహకారంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా తోపులాటలో కిందపడ్డారు. పోలీసులు, మేయర్ వర్గీయులు అజీజ్‌కు వలయంలా ఏర్పడి లోపలికి తీసుకెళ్లారు.
కార్మికుడిని కాలితో తన్నిన కార్పొరేటర్
కార్యాలయంలోకి మేయర్ అజీజ్ వెళుతున్న సమయంలో తోపులాటలో మేయర్ కిందపడ్డారు. దీంతో మేయర్ వర్గానికి చెందిన కార్పొరేటర్ ప్రశాంతి కుమార్ కాలితో జయకుమార్ అనే కార్మికుడిని తన్నాడు. దీంతో జయకుమార్ తీవ్రంగా గాయపడగా, సహచర కార్మికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో కార్మిక సంఘాలు మేయర్, మేయర్ వర్గం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చోద్యం చూసిన టీడీపీ కార్పొరేటర్లు
మేయర్ అజీజ్‌ను కార్మికులు అడ్డుకుని నిరసన తెలుపుతున్నా టీడీపీ కార్పొరేటర్లు ఎవరూ అనుకూలంగా మద్దతు తెలిపేందుకు రాలేదు. మేయర్ కిందపడిన విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్ మాత్రం అజీజ్‌కు జరిగిన సంఘటనపై మాట్లాడారు. ఘటనపై పాలక వర్గంలోని అందరూ ఖండించాల్సి ఉందన్నారు.