సమస్యలు పట్టించుకోని కార్పొరేషన్
-
ఏడాది తర్వాత కౌన్సిల్ సమావేశం
-
అధికార పక్షం అవినీతి, అక్రమాలపై ప్రశ్నించనున్న వైఎస్సార్‌సీపీ
-
మీడియాపై ఆంక్షలు, పాస్‌లు లేకుండా అనుమతి లేదంటున్న అధికారులు
నెల్లూరు సిటీ:
ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే నెల్లూరు నగర పాలక వర్గం ఏమీ పట్టనట్టు వ్యవహరించింది. నగర పాలక సంస్థ చరిత్రలో ఏడాది తరువాత కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించనుంది. గత ఏడాది నవంబర్ 3వ తేదీన కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, ప్రజల సమస్యల పై చర్చించాల్సిన అవసరం ఉందని పలుమార్లు వైఎస్సార్‌సీపీ కమిషనర్ వెంకటేశ్వర్లును కోరింది. అయినప్పటికీ నగర మేయర్ అజీజ్ కౌన్సిల్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో వైఎస్సార్‌సీ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎట్టకేలకు కౌన్సిల్ సమావేశం నేడు నిర్వహిస్తున్నారు.
కౌన్సిల్ అజెండాలో 44అంశాలు
కౌన్సిల్ అజెండాలో 37అంశాలు పొందుపరచగా, సప్లిమెంటరీ అజెండాలో మరో ఏడు అంశాలు ఉంచారు. మొత్తం 44 అంశాలను కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు.
-
ఉదయం 11గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది.
-
ప్రజల సమస్యలను అజెండాలో ప్రస్తావించని అధికార పక్షం.
-
కేవలం ఆర్థిక లావాదేవీలకే పెద్దపీట వేశారు.
సమస్యలు ఇవీ..
-
నగరంలో పందులు, కుక్కలు ఎక్కువయ్యాయి. కుక్కల నియంత్రణ చర్యలు అధికారులు తీసుకోలేదు.
-
ఇటీవల దోమల నివారణకు 'దోమల పై దండయాత్ర' కార్యక్రమం అధికార పార్టీ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తూతూమంత్రంగా రెండు రోజులు చేసి మిన్నకుండిపోయారని విమర్శలున్నాయి.
-
కాలువలపై ఇళ్లు తొలగించే విషయాన్ని ప్రస్తావించలేదు. పునరావాసాలు కల్పించకుండా ఇళ్లు తొలగిస్తే వేలాది మంది పేదలు నిరాశ్రయులు అవుతారు. పునరావాసాలు కల్పించకుండా ఆక్రమణలు తొలగించేందుకు కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది.
అవినీతి, అక్రమాలకు అడ్డాగా కార్పొరేషన్..
నగర పాలక సంస్థలోని అన్ని విభాగాల్లో అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ఈ ఏడాది జూన్ 19వ తేదీన టౌన్‌ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ రూ.50వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుపడ్డారు. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఏడుగుర ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కార్పొరేషన్ చరిత్రలో ఒక్కసారి అంతమంది పై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారని కార్పొరేషన్ వర్గాలు అంటున్నాయి. ఇదే విధంగా అన్ని విభాగాల్లోని అధికారులు, సిబ్బంది చేతులు తడిపితేకానీ పనులు చేయని పరిస్దితి ఏర్పడింది. నియంత్రించాల్సిన అధికార పార్టీ అధికారులను వెనుకేసుకొస్తుందని ఆరోపణలున్నాయి.
మీడియాపై ఆంక్షలు..
ఎప్పుడూ లేని విధంగా మీడియా పై పాలక వర్గం ఆంక్షలు విధించింది. కౌన్సిల్ సమావేశంలో ఇప్పటి వరకు అన్ని మీడియా, పత్రికా ప్రతినిధులు వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే మీడియాకు ఆంక్షలు విధించారు. ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటోగ్రాఫర్‌లకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. కార్యాలయం బయటవైపు మీడియా పాయింట్ పెట్టేవిధంగా చర్యలు తీసుకోనున్నారు.
అజెండాలో ముఖ్యమైన అంశాలు..
-
2.47కోట్లుతో ప్రధాన రోడ్లు శుభ్రపరిచేందుకు స్వీపింగ్ మిషన్‌కు మూడేళ్లు అద్దె పద్ధతిన తీసుకునేందుకు అంచనాలు తయారుచేశారు. ఈ మొత్తాన్ని జనరల్ ఫండ్స్ ద్వారా ఖర్చు చేసేవిధంగా అంశాన్ని పెట్టారు.
-
9వ అంశమైన లక్ష్మీపురంలోని రూ.15 కోట్లు విలువచేసే రిజర్వుడ్ స్థలాన్ని దొడ్ల సుబ్బారెడ్డికి ధారాదత్తం చేసేందుకు రూపొందించారు. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత, కార్పొరేటర్ కిన్నెరప్రసాద్‌లు ఈ అంశాన్ని ఆమోదం కోసం పట్టుపట్టనున్నారు. అధికార పార్టీ నేతలకు రూ.5కోట్లు వరకు ముట్టినట్లు సమాచారం.
-
ఎస్సీ సబ్‌ప్లాన్‌లో రూ.38 కోట్లతో పనులు టెండర్లు చాలా కాలంగా జాప్యం చేస్తూ వచ్చారు. అధికార పార్టీ నేతలు 8 ప్యాకేజీలు చేసి పనులను పంచుకున్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లను అజెండాలో 25వ అంశంగా చేర్చారు.
-
రొట్టెల పండగకు రూ.1.2 కోట్లు ఖర్చుచేశారు. కౌన్సిల్ ఆమోదం కోసం 37వ అంశంగా చేర్చారు.