మీరంతా కలసి పార్టీ పరువు తీస్తున్నారు | Emergency meet with TDP corporators | Sakshi
Sakshi News home page

మీరంతా కలసి పార్టీ పరువు తీస్తున్నారు

Published Fri, Oct 28 2016 12:38 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

మీరంతా కలసి పార్టీ పరువు తీస్తున్నారు - Sakshi

మీరంతా కలసి పార్టీ పరువు తీస్తున్నారు

  • మేయర్, కార్పొరేటర్ల మధ్య సమన్వయంలేదు
  • వివాదాస్పద అంశాలు కౌన్సిల్‌లో ఎందుకు చేర్చారు
  •  మేయర్‌పై టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అసహనం
  •  గురువారం రాత్రి టీడీపీ కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం
  • సాక్షి ప్రతినిధి, నెల్లూరు : 
    నెల్లూరు నగరంలో కార్పొరేటర్లు, మేయర్‌ మధ్య ఏర్పడిన విభేదాలు వల్ల పార్టీ పరువు బజారున పడిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం కార్పొరేషన్‌ పాలక వర్గ సమావేశం జరుగనున్న నేపథ్యంలో గురువారం రాత్రి టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్‌ అజీజ్, పార్టీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మేయర్‌కు కార్పొరేటర్లకు సమన్వయం లేని కారణంగా నగరంలో పార్టీ బలహీన పడిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 15 స్థానాలు కూడా గెలిచే పరిస్థితిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు అందరినీ కలుపుకొని అందరి అభిప్రాయాలతో నిర్ణయాలు తీసుకోకుండా మేయర్‌ అజీజ్‌ పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్‌లో వివాదాస్పద అంశాలను ఎవరితో చర్చించి చేర్చారని ప్రశ్నించారు. ఇకనైనా అందరూ కలసికట్టుగా లేకపోతే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం కష్టమని హెచ్చరించారు. కార్పొరేషన్‌లో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను దీటుగా తిప్పికొట్టడంలో మేయర్, కార్పొరేటర్లు అంతా విఫలమయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ రంగమయూర్‌రెడ్డి మేయర్‌ అజీజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లక్ష్మీపురంలో 429 అంకణాల లే అవుట్‌ స్థలాన్ని దొడ్ల సుబ్బారెడ్డికి ఇచ్చే అంశాన్ని మేయర్‌ ఏకపక్షంగా అజెండాలో చేర్చారని ఆరోపించారు. నగరంలో వీధులు శుభ్రంచేసే మిషన్‌ తీసుకొచ్చి ముడున్నాళ్ల ముచ్చటగా పనిచేయించి పక్కనేశారని, వాహనాల రిపేర్, కొనుగోళ్ల వ్యవహారంలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మేయర్‌ ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లకే వంత పాడుతూ కౌన్సిల్‌ సమావేశం సమయంలోనే మిగిలిన వారి మద్దతుకోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మేయర్‌ అజీజ్‌ మాట్లాడుతూ తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలేదని, పనుల కోసం తన వద్దకు వచ్చే కార్పొరేటర్లందరికీ ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు జరగడంతో రవిచంద్ర వారి మధ్య సర్దుబాటు చేసి ఇక మీదట అయినా అందరూ కలసికట్టుగా పనిచేయకపోతే పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. శుక్రవారం జరగబోయే కౌన్సిల్‌ సమావేశంలో అజెండాలోని అంశాలన్నీ ఆమోదం పొందేలా చూడాలని కార్పొరేటర్లను ఆదేశించారు. వివాదాస్పదమైన లక్ష్మీపురం లే అవుట్‌ భూమి వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది శుక్రవారం ఉదయం మంత్రి నారాయణతో చర్చించి ఆయన ఆదేశం మేరకు వ్యవహరించాలని నిర్ణయించారు. సమావేశంలో ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌తోపాటు టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement