ఫైబర్‌నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ
శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి
పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు
నాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు.
చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు.
పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..
టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.
షరతులు బేఖాతర్!
స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్‌షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.
చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలు
చంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment